AR Rahman : ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో వైవాహిక బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. తామిద్దరం విడిపోతున్నామని ప్రకటించి ఆయన షాక్ ఇచ్చారు. 29 ఏళ్ల వివాహ బంధం తర్వాత ఇద్దరూ డివోర్స్ బాట పట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఏఆర్ రెహమాన్ మాజీ భార్య మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ ప్రకటనను రిలీజ్ చేశారు ఆమె తరఫున అడ్వకేట్. అయితే ఆపరేషన్ అనంతరం ఆమె చేసిన పోస్ట్ లో రెహమాన్ తో పాటు మరికొందరికి కృతజ్ఞతలు తెలియజేసింది.
సైరా భాను హెల్త్ అప్డేట్
సైరా భాను అడ్వకేట్స్ రిలీజ్ చేసిన ఆ పోస్ట్ లో "కొన్ని రోజుల క్రితమే మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా సైరా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా ఆమె ఆపరేషన్ చేయించుకున్నారు. ఇలాంటి కష్ట సమయంలో త్వరగా కోలుకోవడంపై ఆమె దృష్టి సారించారు. సైరా ఆరోగ్యం గురించి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ అందరి సపోర్ట్, ప్రేమతో క్షేమంగా తిరిగి వస్తాను. ఇలాంటి కఠినమైన సమయంలో సపోర్ట్ చేసినందుకు లాస్ ఏంజెల్స్ లోని స్నేహితులు, సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి, అతని భార్య షాదియా, అడ్వకేట్ వందనా షా, మిస్టర్ రెహమాన్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు" అని రాశారు. అలాగే "సైరా ఇటీవల కాలంలో ప్రైవసీని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు సపోర్ట్ ఇచ్చిన శ్రేయోభిలాషులకు, అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలుపుతున్నారు" అని పేర్కొన్నారు.
సైరా భాను, ఏఆర్ రెహమాన్ డివోర్స్
గత ఏడాది నవంబర్ లో దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు అనౌన్స్ చేశారు సెలబ్రిటీ కపుల్ సైరా భాను - రెహమాన్. వీరి తరఫున అడ్వకేట్ వందనా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. అందులో "చాలా ఏళ్ల తర్వాత సైరా, ఆమె భర్త విడిపోవడానికి చాలా కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. వారి బంధంలో ఎమోషనల్ ప్రెజర్ వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది" అని వివరించారు.
అయితే ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాకు విడాకులు ఇవ్వడానికి వేరే అమ్మాయి కారణం అంటూ రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అలాంటి టైంలో సైరా స్పందిస్తూ, అసలు డివోర్స్ తీసుకోవడానికి గల కారణం ఏంటో వెల్లడించింది. "గత రెండు నెలలుగా నేను శారీరకంగా అనారోగ్యంతో ఉన్నాను. అందుకే ఏఆర్ రెహమాన్ నుంచి బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నాను. యూట్యూబ్ కమ్యూనిటీ తో పాటు మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అతని గురించి చెడుగా ప్రచారం చేయొద్దు. అతను ఒక రత్నం లాంటివాడు. ప్రపంచంలోనే బెస్ట్" అంటూ ఏఆర్ రెహమాన్ పై వచ్చిన ఎఫైర్ రూమర్స్ కి చెక్ పెట్టింది.