సినిమా ఇండస్ట్రీలో హైట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లకు అవకాశాలు రావడం చాలా కష్టం. టాలీవుడ్ లో ఆరడుగుల అందగాడు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఆ తర్వాత రానా... కానీ చాలామంది హీరోలు నామ మాత్రపు హైట్ తోనే నెట్టుకొస్తున్నారు. అందుకే ఇండస్ట్రీలో ఆరడుగులు ఉన్న హీరోయిన్లతో సినిమా అంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా హైట్ ఉన్న హీరోయిన్లు ఆరడుగులు కూడా లేని హీరోల పక్కన మరీ హైట్ ఎక్కువగా కనిపిస్తారు. అందుకే దర్శక నిర్మాతలు హీరోయిన్లను సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఎత్తు గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తారు. మరి సినిమా ఇండస్ట్రీలో అందరి కంటే హైట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె హైట్ గురించి తెలిస్తే ఆరడుగుల హీరోలు కూడా ఆమెతో కలిసి నటించడానికి భయపడతారు.
ఆల్మోస్ట్ ఆరడుగుల అందగత్తె
ఆల్మోస్ట్ ఆరడుగుల హైట్ ఉన్న ఈ హీరోయిన్ మిస్ వరల్డ్. ఇక ఆమె హీల్స్ ధరిస్తే బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కంటే ఎత్తుగా కూడా కనిపించే అవకాశం ఉంది. ఈ అమ్మడు మరెవరో కాదు యుక్తా ముఖి. 1999లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. యుక్త ఇందర్ లాల్ ముఖి మిస్ వరల్డ్ గెలుచుకున్న నాలుగవ భారతీయ మహిళ. ఆవిడ 1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కూడా గెలుచుకుంది. హిందీ చిత్ర సీమలో ఈ అమ్మడు మోడల్ గా, నటిగా రాణించింది.
ఎవరీ యుక్తా? నేపథ్యం ఏమిటి?
బెంగళూరులోని సింధీ కుటుంబంలో యుక్తా జన్మించారు. ఆమెకు ఏడు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఫ్యామిలీ అంతా దుబాయ్ లో నివసించేది. ఆమె కుటుంబం 1986లో ముంబైకి మకాం మార్చింది. ఆమె తల్లి అరుణ బ్యూటీ సెలూన్ నిర్వహించింది. ఆమె తండ్రి ఒక బట్టల కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత యుక్తా ముంబైలోని వీజీ వాజే కళాశాలలో జువాలజీ అభ్యసించింది. తర్వాత ఆమె ఆప్టెక్ నుండి కంప్యూటర్ సైన్స్ డిప్లొమాను కూడా సంపాదించింది. అంతే కాదండోయ్ మూడు సంవత్సరాలు హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది. అనంతరం 1999లో లండన్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని, కిరీటాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ అమ్మడు 5 అడుగుల 11 అంగుళాల ఎత్తుతో ఇండస్ట్రీలోనే అత్యధిక హైట్ ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో బాగా హైట్ ఉన్న హీరోయిన్ అనగానే గుర్తొచ్చేది అనుష్క. కానీ అనుష్క హైట్ 5 అడుగుల 9 అంగుళాలు. అలాగే బాలీవుడ్లో మంచి హైట్ ఉన్న హీరోయిన్ అంటే దీపికా పదుకొనే హైట్ 5 అడుగుల 8 అంగుళాలు.
Also Read: 'జాబిలమ్మ నీకు అంత కోపమా' రివ్యూ: ధనుష్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ - హిట్టా? ఫట్టా?
హైట్ వల్ల అవకాశాలు కరువు
చాలా మంది ప్రముఖ హీరోలు తమ కంటే పొడవైన హీరోయిన్ సరసన నటించడానికి ఇష్టపడకపోవడంతో యుక్తా చాలా వరకు పెద్ద చిత్రాలను కోల్పోయింది. 2010లో వచ్చిన ఒడియా చిత్రం 'స్వయంసిద్ధ' ఆమె చివరి మూవీ. అవకాశాలు రాకపోవడంతో యుక్తా 2008లో న్యూయార్క్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రిన్స్ తులిని వివాహం చేసుకుంది. ఈ జంటకు రెండేళ్ల కొడుకు పుట్టాడు. కానీ వీరి వివాహ బంధం ఎక్కువకాలం సాగలేదు. 2013లో యుక్త తన భర్త, అత్తమామలపై గృహ హింస, వేధింపుల ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. తరువాత విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు యుక్త సామాజిక కార్యకర్తగా, ఇన్ఫ్లూయెన్సర్ గా పని చేస్తోంది.