Dhanush's Jabilamma Neeku Antha Kopama movie review in Telugu: హీరో ధనుష్ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'జాబిలమ్మ నీకు అంత కోపమా'. మేనల్లుడు పవిష్ నారాయణ్ (Pavish Narayan)ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు (ఫిబ్రవరి 21న) విడుదలైంది. ఇందులో అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ప్రధాన తారాగణం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు ఆల్రెడీ వైరల్ అయ్యాయి. మరి, ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...
కథ (Jabilamma Neeku Antha Kopama Movie Story): ప్రభు (పవిష్)కు ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తారు. పెళ్లి చూపుల్లో అమ్మాయి (ప్రియా ప్రకాష్ వారియర్)ని చూసి అబ్బాయి షాక్ అవుతాడు. ఆమె కూడా! ఎందుకంటే... వాళ్లిద్దరూ క్లాస్‌మేట్స్. వారం రోజులు ట్రావెల్ చేశాక పెళ్లి మీద నిర్ణయం తీసుకోవాలని అనుకుంటారు. అయితే, నీలా (అనిఖా సురేంద్రన్) వెడ్డింగ్ కార్డు చూసి ప్రభు డల్ అవుతాడు. క్లాస్‌మేట్ అడిగితే కథ చెప్పడం మొదలు పెడతాడు.
ప్రభు, రవి (వెంకటేష్ మీనన్), రాజేష్ (మాథ్యూ థామస్) ఫ్రెండ్స్ & క్లాస్‌మేట్స్. శ్రేయా (రబీనా ఖాటూన్)తో రవి లవ్ యానివర్సరీలో ప్రభు, నీలా ఒకరికొకరు పరిచయం అవుతారు. తర్వాత ప్రేమలో పడతారు. ప్రభుని తన తండ్రి (శరత్ కుమార్)కు పరిచయం చేస్తుంది నీలా. ఆ తర్వాత వాళ్ళ ప్రేమకు ఎటువంటి అడ్డంకులు ఎదురు అయ్యాయి? ఎందుకు దూరం అయ్యారు? నీలా పెళ్లికి ప్రభు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? గోవాలోని డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఈవెంట్ ప్లానర్ అంజలి (రమ్య రంగనాథన్) ఏం చేసింది? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Jabilamma Neeku Antha Kopama Review): దర్శకుడిగా ధనుష్ మూడో చిత్రమిది. గతేడాది 'రాయన్'తో విజయం అందుకున్నారు. అయితే... ఆ చిత్రానికి, ఇప్పుడీ 'జాబిలమ్మ నీకు అంత కోపమా'కు అసలు సంబంధం లేదు. అది రస్టిక్ యాక్షన్ ఫిల్మ్ అయితే, ఇది యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ. దర్శక రచయితగా రెండిటి మధ్య వ్యత్యాసం చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇక, 'జాబిలమ్మ నీకు ఎంత కోపమా' ఎలా ఉందనే విషయానికి వస్తే...
న్యూ ఏజ్, యూత్ పల్స్ పట్టుకోవడంలో ధనుష్ సక్సెస్ అయ్యారు. టీనేజ్‌లో యువత ఎలా ఉందనేది చక్కగా చూపించారు. ధనుష్ తీసుకున్నది పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ ఏమీ కాదు. అలాగని, కాంప్లికేటెడ్‌గా కూడా తీయలేదు. సింపుల్ అండ్ స్ట్రెయిట్‌గా చెప్పారు. 'జాబిలమ్మ నీకు అంత కోపమా'లో దర్శక రచయితగా ప్రేక్షకులకు సెటైర్ వేసే ఛాన్స్ ఇవ్వలేదు. ఈ జనరేషన్ ప్రేమికుల్లో చాలా మంది 'బుజ్జి కన్నా' అంటూ ముద్దులు పెట్టుకోవడం చూస్తుంటాం. అటువంటి జంటను చూసి 'ఏంట్రా ఇది?' అంటే 'క్రింజ్' అని చెప్పడంతో థియేటర్లలో ఒక్కసారిగా క్లాప్స్, విజిల్స్ పడ్డాయి. పడతాయి కూడా! 'వీడేంట్రా ఇంత మంచోడు' డైలాగ్ చెప్పే సీన్ క్లాప్ వర్తీ! ఇటువంటి మూమెంట్స్, సెటైర్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి.
లవ్ అంటే ఎమోషన్, డెప్త్, ఫీల్ వంటి భారీ డైలాగులను ధనుష్ చెప్పించలేదు. ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. కానీ, కథ పెద్దగా ముందుకు కదల్లేదు. డబ్బున్న అమ్మాయి మిడిల్ క్లాస్ అబ్బాయితో ప్రేమలో పడటం కాన్సెప్ట్ కొత్తది ఏమీ కాదు. కానీ, దానికి ధనుష్ ఇచ్చిన ట్రీట్మెంట్ బావుంది. ప్రతి సీన్, ప్రతి డైలాగులో నవ్వించే ప్రయత్నం జరిగింది. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం కంటే సిట్యువేషనల్ ఫన్ కోసం ఎక్కువ చూశారు. దాంతో మధ్య మధ్యలో కాస్త డల్ అయ్యింది. సెకండాఫ్ ఎమోషన్స్, కథ మెయిన్ సీట్ తీసుకోవడంతో కాస్త వేగం పెరిగింది. హీరో పేరెంట్స్, హీరోయిన్ ఫాదర్ రోల్స్ మరీ రొటీన్‌గా రాసుకున్నారు.
టెక్నికల్ టీం నుంచి దర్శకుడికి మంచి సపోర్ట్ లభించింది. లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ వైబ్రెంట్‌గా ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. తెలుగు సాహిత్యం వినిపించేలా సాంగ్స్ రికార్డ్ చేయించి ఉంటే బావుండేది.
పవిష్ నారాయణ్ నటనలో మేనమామ ధనుష్ ఛాయలు కనిపించాయి. ఆ పాత్రకు తగ్గట్టు అతను నటించాడు. అయితే, అతనిలో ధనుష్ లుక్స్ ఉన్నాయి. అనిఖా సురేంద్రన్ తన పాత్ర పరిధి మేరకు నటించారు. అందంతో పాటు అభినయంతో రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ఆకట్టుకున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో అందంగా, చక్కగా కనిపించారు. 'గోల్డెన్ స్పారో' పాటలో ప్రియాంకా అరుల్ మోహన్ మెరిశారు. హీరో హీరోయిన్ల కంటే ఫ్రెండ్ రాజేష్ రోల్ చేసిన మాథ్యూ థామస్ నటన హైలైట్. అతను స్క్రీన్ మీదకు వచ్చిన ప్రతిసారీ నవ్వించాడు. ఆ నటన, డైలాగ్ డెలివరీ బావున్నాయి. శరణ్య ప్రదీప్, శరత్ కుమార్, 'ఆడుకాలం' నరేన్ పాత్రల్లో కొత్తదనం లేదు. తమ పరిధి మేరకు నటించారు.
'జాబిలమ్మ నీకు అంత కోపమా'... రెండు గంటలు హాయిగా నవ్వుకునే సినిమా. స్నేహితులతో కలిసి థియేటర్లకు వెళితే... టెన్షన్స్ మర్చిపోయి ఎంజాయ్ చేసే సినిమా. యువతకు బాగా నచ్చుతుంది.