సినిమా రివ్యూ : రంగమార్తాండ
రేటింగ్ : 3.5/5
నటీనటులు : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, సత్యానంద్ తదితరులు
మాటలు : ఆకెళ్ళ శ్రీనివాస్
ఛాయాగ్రహణం : రాజ్ కె. నల్లి
సంగీతం : ఇళయరాజా
నిర్మాతలు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
దర్శకత్వం : కృష్ణవంశీ
విడుదల తేదీ : మార్చి 22, 2023
మానవ సంబంధాలు, అనుబంధాలు, తెలుగుదనం ఉట్టిపడే కథలను కృష్ణవంశీ (Krishna Vamsi) ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులకు ఏదో ఒక మంచి చెప్పడానికి, సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆయన సినిమాలకు సమాజమే ఓ కథావస్తువు. కొన్నాళ్ళుగా కృష్ణవంశీ నుంచి ఆయన స్థాయికి తగ్గ సినిమా రావడం లేదని అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. అటువంటి తరుణంలో మరాఠీ సినిమా 'నటసామ్రాట్'ను తెలుగులో రీమేక్ చేశారు. ఇందులో బ్రహ్మానందం (Brahmanandam), ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramya Krishnan) ప్రధాన పాత్రల్లో నటించారు. ఉగాది సందర్భంగా ఈ నెల 22న థియేటర్లలోకి రానుంది. అయితే, కొన్ని రోజులుగా ప్రీమియర్లు వేస్తున్నారు. సినిమా చూసిన వారంతా గొప్పగా చెబుతున్నారు. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసలు, సినిమా (Rangamarthanda Review) ఎలా ఉంది?
కథ (Rangamarthanda Story) : రంగస్థల కళాకారుడు రాఘవరావు (ప్రకాష్ రాజ్) ప్రతిభ మెచ్చి ఆయనకు 'రంగమర్తాండ' బిరుదు ప్రదానం చేస్తారు. ఆ సత్కార సభలో తన రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఇష్టపడి కట్టుకున్న ఇంటిని కోడలు గీతా రంగారావు (అనసూయ) పేరు మీద రాసేస్తారు. అమ్మాయి శ్రీ (శివాత్మికా రాజశేఖర్)కు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవ్వడమే కాదు, ప్రేమించిన అబ్బాయి రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్)కు ఇచ్చి పెళ్లి చేస్తారు. శేష జీవితాన్ని సంతోషంగా గడుపుదామని అనుకుంటాడు. అయితే, అందుకు భిన్నంగా జరుగుతుంది. మామగారు చేసే పనులు కోడలికి నచ్చవు. దాంతో శ్రీమతి రాజుగారు (రమ్యకృష్ణ) కోరిక మేరకు ఊరు వెళ్లాలని రాఘవరావు రెడీ అవుతాడు. ఆ విషయం తెలిసి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకు వెళుతుంది కుమార్తె శ్రీ. ఆ తర్వాత ఏమైంది? అమ్మాయి ఇంట్లో ఏం జరిగింది? రాఘవరావు జీవితంలో ప్రాణ స్నేహితుడు చక్రి అలియాస్ చక్రవర్తి (బ్రహ్మానందం) పాత్ర ఏమిటి? ఆయన ఏం చేశారు? చివరికి ఏమైంది? అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ (Rangamarthanda Review In Telugu) : 'ఆనందం... రెండు విషాదాల మధ్య విరామం' - ఇదీ కృష్ణవంశీ వేసిన ఇంటర్వెల్ కార్డ్. తెరపై ప్రధాన పాత్రధారి జీవితంలో సంతోషం ఎక్కడుంది? అడుగడుగునా ఇంట్లో కోడలి నుంచి ఆయనకు అవమానమే, అది విషాదమేగా!! కొందరికి 'అది సహజమేగా, ప్రతి ఇంట్లో జరిగే తంతే కూడా' అనిపించవచ్చు. కానీ, అప్పటి వరకు ఆ విషాదాన్ని తెరపై ప్రకాష్ రాజ్ పలికించిన తీరు చూసి ఆనందం కలుగుతుంది. గొప్ప నటుడికి మరోసారి గొప్ప పాత్ర లభించిందని! ఆ సమయంలో విశ్రాంతి తర్వాత విస్ఫోటనం ఉంటుందని ఎవరూ ఊహించలేరు. ద్వితీయార్థంలో డ్రామాను మరింత పీక్స్‌కు తీసుకు వెళ్ళారు కృషవంశీ. ప్రకాష్ రాజ్ నటనకు ధీటుగా ఆయనను తలదన్నేలా బ్రహ్మానందం నట విశ్వరూపం చూపించారు. కేవలం కళ్ళతో రమ్యకృష్ణ లోతైన భావాలు పలికించారు. భర్త చాటు భార్యగా, భర్తకు అవమానం జరిగితే సహించలేని గృహిణిగా ఆమె హావభావాలు అద్భుతం. అన్నట్టు... భార్యలను ప్రశంసిస్తూ, భర్తల మీద కృష్ణవంశీ కొన్ని సెటైర్లు కూడా వేశారు.
కథగా చూస్తే... 'రంగమార్తాండ'లో కొత్తదనం లేదు. కానీ, ఓ జీవితం ఉంది. ప్రస్తుత సమాజాన్ని తెరపై ఆవిష్కరించారు. ఇంగ్లీష్ భాష మీద మోజుతో మాతృభాషను తక్కువ చేసి చూడటం, ఇంట్లో పెద్దలు చాదస్తం పేరుతో తమకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని పిల్లలు భావించడం, డబ్బు విషయానికి వచ్చేసరికి కన్న తల్లితండ్రులను సైతం అనుమానించడం... అటు సినిమాల్లో, ఇటు సమాజంలో చూస్తున్నవే. మన అమ్మానాన్నలను బతికి ఉన్నపుడు బాగా చూసుకుందామని సందేశం ఇచ్చే చిత్రమిది. అదీ కొత్తది కాదు. కానీ, ఆ సందేశాన్ని చెప్పిన తీరు మనసులను ఆకట్టుకుంటుంది. రంగస్థల కళాకారుడి నేపథ్యం మనకు తెలిసిన కథను కొత్తగా చూపించింది. రంగస్థలంపై నటించిన మనిషి, నిజ జీవితంలో నటించలేక సతమతమయ్యే సన్నివేశాలు, ఆ మనోవేదన మనసుకు హత్తుకుంటుంది.
నిర్మాణ పరంగా కొన్ని లోటుపాట్లు తెలుస్తూ ఉన్నాయి. ఆర్ధిక పరమైన పరిమితుల కారణంగా కొన్ని సన్నివేశాలను చుట్టేసినట్టు ఉంటుంది. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. సింక్ సౌండ్ సరిగా సెట్ కాలేదు. పేర్లు ఎందుకు గానీ కొందరి నటన అంతగా మెప్పించదు. ఆ లోటు పాట్లను, లోపాలను పక్కన పెట్టి సినిమాను కళ్లప్పగించి సినిమాను చూసేలా చేసిన ఘనత మాత్రం బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణల నటన... కృష్ణవంశీ దర్శకత్వం... మేస్ట్రో ఇళయరాజా సంగీతానికి దక్కుతుంది. పాటల్లో, నేపథ్య సంగీతంలో రణగొణ ధ్వనులు లేవు. స్వచ్ఛమైన సంగీతం వింటుంటే మనసుకు హాయిగా ఉంటుంది.
నటీనటులు ఎలా చేశారంటే? : సినిమాలో నటీనటులు తక్కువే. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనల్ని వెంటాడేది ఒక్కరే... బ్రహ్మానందం! ప్రకాష్ రాజ్ భావోద్వేగభరిత పాత్రలు చాలా చేశారు. అందువల్ల, మరోసారి ఆయన మంచి నటన కనబరిచారని అనిపిస్తుంది. మనసుల్ని హత్తుకుంటుంది. రమ్యకృష్ణ ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. ఇంకోసారి నటిగా మెప్పిస్తారు. బ్రహ్మానందం మాత్రం తనలో నటుడిని ఇన్నాళ్లు ఎవరూ వాడుకోలేదనట్టుగా విశ్వరూపం చూపించారు. గెటప్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు... ప్రతి అంశంలో కొత్త బ్రహ్మానందం కనిపించారు. మరోవైపు ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటిస్తున్నప్పటికీ... చూపు తన వైపు నుంచి అతడి మీదకు మళ్లకుండా బ్రహ్మానందం నటించారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆస్పత్రి సన్నివేశంలో ఆయన నటన పీక్స్. బ్రహ్మానందం వల్ల ఆ సన్నివేశంలో డ్రామా పతాక స్థాయికి చేరుకుంది. శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.
Also Read : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల సినిమా ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : మనిషిగా చూసే సినిమాలు కొన్ని, మనసుతో చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. మనసుతో చూడాల్సిన సినిమా 'రంగమార్తాండ'. 'అక్షరాన్ని పొడిగా పలకకు... దాని వెనుక తడిని చూడు' అని సినిమాలో ఓ డైలాగ్ ఉంది. నిజంగా ఈ సినిమాలో తడిని ప్రేక్షకులు చూడాలి. ఆ తడిని మాత్రమే చూడాలి. గుండె లోతుల్లో తడిని కనుపాప చెంతకు తీసుకొచ్చే చిత్రమిది. భారమైన మనసుతో, బరువెక్కిన గుండెతో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు రావడం అయితే ఖాయం. కృషవంశీ ఈజ్ బ్యాక్ - బ్రహ్మానందం రాక్స్!
Also Read : కబ్జ రివ్యూ: ఉపేంద్ర పాన్ ఇండియా సినిమా ఎలా ఉంది? ఎవరు ఎవరిని ‘కబ్జ’ చేశారు?