సినిమా రివ్యూ : ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
రేటింగ్ : 2.25/5
నటీనటులు : నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్ త‌దిత‌రులు  
ఛాయాగ్రహణం : సునీల్ కుమార్ నామ
సంగీతం : కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
సహా నిర్మాత : వివేక్ కూచిభొట్ల
నిర్మాత‌లు : టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
కథ, కథనం, మాటలు, ద‌ర్శ‌క‌త్వం : శ్రీనివాస్ అవసరాల 
విడుదల తేదీ : మార్చి 17, 2023


నాగశౌర్య (Naga Shourya) కథానాయకుడిగా నటుడు శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) దర్శకత్వం వహించిన 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరోగా శౌర్య, దర్శకుడిగా అవసరాల... వీళ్ళిద్దరూ ముచ్చటగా మూడో సినిమా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' (Phalana Abbayi Phalana Ammayi Movie)తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది?


కథ : సంజయ్ (నాగశౌర్య) బీటెక్ జాయిన్ అయినప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ నుంచి అనుపమ (మాళవికా నాయర్) సేవ్ చేస్తుంది. తొలుత ఫ్రెండ్స్ అవుతారు. ఎంఎస్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ప్రేమలో పడతారు. అనుపమ సీనియర్ కావడంతో ఏడాది ముందుగా చదువు పూర్తి అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. వేరే సిటీలో ఆమెకు ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసినందుకు, తనకు దూరంగా వెళుతున్నందుకు సంజయ్ హ్యాపీగా ఉండదు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అదే సమయంలో పూజ (మేఘా చౌదరి)తో స్నేహం మొదలు అవుతుంది. సంజయ్, అనుపమ మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? కొన్నాళ్ళ తర్వాత ఇద్దరూ కలిసినప్పుడు ఏం జరిగింది? మధ్యలో గిరి (శ్రీనివాస్ అవసరాల), వాలెంటైన్ (అభిషేక్ మహర్షి), కీర్తి (శ్రీవిద్య) పాత్రల పరిధి ఏమిటి? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ : హిందూ సంప్రదాయంలో పెళ్లిలో ఏడు అడుగులు వేస్తారు. జీవితంలో ఓ యువతి, యువకుడు వివిధ దశల్లో వేసిన ఏడు అడుగుల సమాహారమే ఈ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఆ మాటకు వస్తే శ్రీనివాస్ అవసరాల సినిమాల్లో కథ కంటే కథనం, కామెడీ ఎప్పుడూ హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో కూడా శ్రీనివాస్ అవసరాల మార్క్ కామెడీ కొన్ని సీన్లలో కనిపించింది. మొత్తం సినిమాగా చూస్తే ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తుంది. 


'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ప్రారంభం బావుంది. కాలేజీలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేయడం చాలా సినిమాల్లో చూశాం. సీనియర్ - జూనియర్ ప్రేమకథ 'హ్యాపీ డేస్'లోనూ ఉంది. అయితే, ఆ సన్నివేశాలను శ్రీనివాస్ అవసరాల డీల్ చేసిన విధానం బావుంటుంది. కొన్ని సీన్లు నవ్విస్తాయి. దర్శకత్వంలో ఆయన మార్క్ కనిపించిన సీన్లు ఉన్నాయి. భావోద్వేగాలు, కథలో కాన్‌ఫ్లిక్ట్ పరంగా డెప్త్ లేదు. హీరో హీరోయిన్లు విడిపోవడానికి సరైన కారణం కనిపించదు. క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు హీరో చెప్పే రీజన్ కూడా కన్వీన్సింగ్ గా అనిపించదు. పార్టులు పార్టులుగా చూస్తే... సన్నివేశాలు బావుంటాయి. కానీ, కథగా మెప్పించడం చాలా కష్టం. ఓ ఫీల్ మిస్ అయ్యింది. 


కళ్యాణి మాలిక్ సంగీతంలో కొన్ని పాటలు బావున్నాయి. మోహనకృష్ణ ఇంద్రగంటి పాడిన పాట పంటి కింద రాయిలా తగిలింది. నేపథ్య సంగీతం ఓకే. వివేక్ సాగర్ 'కఫీఫీ...' సాంగ్ సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి. పర్వాలేదు. 


నటీనటులు ఎలా చేశారంటే? : నాగశౌర్య చాలా చక్కగా చేశారు. లుక్స్ పరంగా చాలా చేంజ్ చూపించారు. నటుడిగా కూడా చాలా బాగా చేశారు. ఇటువంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాల్లో ఆయన ఎప్పుడూ బెస్ట్ ఇస్తారు. ఇందులో కూడా ఇచ్చారు. మాళవికా నాయర్ నటన ఒకే. కానీ, లుక్స్ పరంగా చేంజ్ చూపించడంలో ఫెయిల్ అయ్యారు. మిగతా నటీనటుల్లో అభిషేక్ మహర్షి నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లలో కనిపించినా బాగా చేశారు. శ్రీనివాస్ అవసరాల సహా మరికొందరు స్క్రీన్ మీద కనిపిస్తారు. కానీ, ఎవరూ ఇంపాక్ట్ చూపించలేదు. 


Also Read : కబ్జ రివ్యూ: ఉపేంద్ర పాన్ ఇండియా సినిమా ఎలా ఉంది? ఎవరు ఎవరిని ‘కబ్జ’ చేశారు?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి మెయిన్ రీజన్ శ్రీనివాస్ అవసరాల. ఆయన మార్క్ కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయ్యింది. అందువల్ల, ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇవ్వడంలో సినిమా ఫెయిల్ అయ్యింది. జస్ట్ కొన్ని సన్నివేశాల కోసం ఎవరైనా థియేటర్లకు వెళ్లాలని అనుకుంటే వెళ్ళవచ్చు. 


Also Read : బుర్ర పాడు చేసే డిస్టర్బింగ్ ట్విస్ట్‌తో వచ్చిన లేటెస్ట్ మలయాళం మూవీ ‘ఇరట్టా’ - ఎలా ఉందంటే?