సినిమా రివ్యూ : కబ్జ
రేటింగ్ : 2/5
నటీనటులు : ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియ, సుధ, మురళీ శర్మ తదితరులు
ఛాయాగ్రహణం : ఏ. జే. శెట్టి
సంగీతం : రవి బస్రూర్
నిర్మాతలు : ఆనంద్ పండిట్, ఆర్. చంద్రు, అలంకార్ పాండియన్
రచన, దర్శకత్వం : ఆర్. చంద్రు
విడుదల తేదీ : మార్చి 17, 2023
కేజీయఫ్, కాంతారల తర్వాత కన్నడ నుంచి వస్తున్న పెద్ద సినిమాలు దేశంలోని అన్ని భాషల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక రియల్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం లేదు. ఉపేంద్ర తాజాగా నటించిన కన్నడ పాన్ ఇండియా చిత్రం ‘కబ్జ’. సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియ, మురళీ శర్మ లాంటి టాప్ స్టార్ కాస్ట్‌తో వచ్చిన ఈ సినిమాపై కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది?
కథ: ఈ సినిమా 1945 నుంచి 1975 మధ్య కాలంలో జరుగుతుంది. అర్కేశ్వర (ఉపేంద్ర) పైలట్ కావాలనే లక్ష్యంతో ఉంటాడు. అతని తండ్రి స్వాతంత్ర ఉద్యమంలో మరణిస్తాడు. తల్లి (సుధ) తనను కష్టపడి పెంచుతుంది. అర్కేశ్వరుడికి సంకేశ్వరుడనే అన్న కూడా ఉంటాడు. అమరాపురం యువరాణి మధుమతి (శ్రియ), అర్కేశ్వర ప్రేమించుకుంటారు. కానీ అమరాపురం మహారాజు, మధుమతి తండ్రి అయిన వీర బహదూర్ (మురళీ శర్మ) తన కూతురిని రాజ కుటుంబంలోని వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో అన్న మరణించడంతో సౌమ్యుడైన అర్కేశ్వర కత్తి పట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కథలో పోలీస్ ఆఫీసర్ భార్గవ్ బక్షి (సుదీప్), గుర్తు తెలియని పాత్ర పోషించిన శివరాజ్ కుమార్‌ల పాత్రలు ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ‘పులిని చూసి నక్కలు వాత పెట్టుకోవడం’ అనే సామెత దేశంలోని ఏ చలనచిత్ర పరిశ్రమకు అయినా వర్తిస్తుంది. ఒక సినిమా కళ్లు చెదిరే బ్లాక్‌బస్టర్‌గా, ట్రెండ్ సెట్టర్‌గా నిలిస్తే అదే తరహాలో మరిన్ని సినిమాలు విడుదల అవ్వడం గతంలోనే చూశాం. వాటిలో కొన్ని హిట్టయ్యాయి. కొన్ని ఫట్టయ్యాయి. అలాగే పూర్తిగా కేజీయఫ్ అనుకరణతో వచ్చిన సినిమా ‘కబ్జ’.
అచ్చం కేజీయఫ్ తరహాలోనే ఉపేంద్ర కథను సుదీప్ నెరేట్ చేస్తుండటంతో సినిమా మొదలవుతుంది. ముందుగా సుదీప్ ఇంట్రడక్షన్, ఆ వెంటనే ఒక ఫ్లాష్‌బ్యాక్, తర్వాత ఉపేంద్ర ఎంట్రీ, శ్రియ ఎంట్రీ... ఇలా సీన్లన్నీ కథ ఫ్లోతో సంబంధం లేకుండా పేర్చుకుంటూ వెళ్లిపోయారు. కథలో కొత్త దనం ఏమీ లేదు. గొడవలకు చాలా దూరంగా ఉండే ఒక సౌమ్యుడు, సామాన్యుడు కరడు గట్టిన మాఫియా డాన్‌గా ఎలా ఎదిగాడనేదే కథ. ఎప్పుడు వచ్చిన బాషా నుంచి ఇలాంటి కథలు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. వీటిలో బ్లాక్‌బస్టర్ అయినవీ, బకెట్ తన్నేసినవీ కూడా ఉన్నాయి. కథ తీయడం కుదరాలి అంతే.
సినిమా ఎండింగ్ కూడా చాలా అబ్సర్డ్‌గా ఉంటుంది. కథను సగంలో వదిలేసి, అది కూడా యాక్షన్ సీన్ మధ్యలో ఎండ్ కార్డు వేసి మిగతాది ‘కబ్జ 2’లో చూసుకోండి అనేశారు. ప్రస్తుతం సీక్వెల్స్, సినిమాటిక్ యూనివర్స్‌ల ట్రెండ్ నడుస్తుంది నిజమే కానీ ఇది మొదటి భాగం అని ముందుగా చెప్పి ప్రేక్షకులను కనీసం ప్రిపేర్ కూడా చేయలేదు. దీంతో శివరాజ్ కుమార్ పవర్‌ఫుల్ కామియోతె మంచి హై ఇచ్చినా థియేటర్ నుంచి కొంచెం వెలితిగానే బయటకు వస్తాం.
కేజీయఫ్‌కి వేసిన సెట్లు, కేజీయఫ్ తరహా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కేజీయఫ్ తరహా ఎడిటింగ్ ప్యాటర్న్... ఇలా ఎంత వద్దనుకున్నా అడుగడుగునా కేజీయఫ్ ఫ్లేవర్ తగులుతూనే ఉంటుంది. ఇక రవి బస్రూర్ అయితే కేజీయఫ్‌కి అదనంగా కొట్టిన ట్యూన్లు ‘కబ్జ’కి ఇచ్చేశాడేమో అనిపిస్తుంది. ‘కబ్జ కబ్జ’ టైటిల్ సాంగ్ ‘సలాం రాకీ భాయ్’ పాటను గుర్తు చూస్తుంది. వీఎఫ్ఎక్స్ గురించి అసలు మాట్లాడుకోకపోవడం మంచిది. మరీ నాసిరకంగా ఉన్నాయి. ఎడిటింగ్‌లో కూడా పూర్తిగా కేజీయఫ్‌ను ఫాలో అయ్యారు. కథలో కొంత
మురళీ శర్మ పాత్ర తెరపై కనిపిస్తున్నంత సేపు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే తనకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించారు. అది సరిగ్గా సెట్టవ్వలేదు. అలాగే ఈగ, విక్రాంతో రోణల్లో సుదీప్ గొంతు విన్నాక ఇప్పుడు వేరే వ్యక్తి డబ్బింగ్ చెప్తే అంత ఇంపాక్ట్ కనిపించలేదు. తెలుగు వచ్చిన నటులను సినిమాలో పెట్టుకున్నప్పుడు సొంత డబ్బింగ్ చెప్పించినా బాగుండేది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... ఉపేంద్ర ఎంత గొప్ప యాక్టరో అందరికీ తెలిసిందే. కానీ ఇందులో క్యారెక్టర్ కారణంగా కేవలం కోపం, బాధ కంటే ఎక్కువ ఎమోషన్స్ చూపించే అవకాశం రాలేదు. సుదీప్ రెండు సన్నివేశాల్లో, శివరాజ్ కుమార్ ఒక సీన్లో కనిపిస్తారు. శ్రియకు మధుమతి రూపంలో మంచి పాత్ర లభించింది. కొన్ని సన్నివేశాల్లో తన నటన ఆకట్టుకుంటుంది. ఉపేంద్రకు తల్లిగా సుధ బాగా నటించారు. కోట శ్రీనివాసరావు ఒకటి రెండు షాట్లకు మాత్రమే పరిమితం అయ్యారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘కేజీయఫ్’ టోన్ ఉంటే చాలు సినిమా ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే ‘కబ్జ’ చూడవచ్చు. ఓటీటీలో చూసుకుందాం అనుకుంటే ఈ వారానికి మీ జేబు ‘కబ్జ’ కాకుండా కాపాడుకున్న వారవుతారు.