సినిమా రివ్యూ : ఇరట్టా (నెట్‌ఫ్లిక్స్)
రేటింగ్ : 3/5
నటీనటులు : జోజు జార్జి, అంజలి తదితరులు
ఛాయాగ్రహణం : విజయ్
సంగీతం : జేక్స్ బిజోయ్
దర్శకత్వం : రోహిత్ ఎంజీ కృష్ణన్
నిర్మాతలు : జోజు జార్జి, మార్టిన్ ప్రక్కట్, సిజో వడక్కన్, ప్రశాంత్ కుమార్, చంద్రన్
విడుదల తేదీ (థియేటర్లలో) : ఫిబ్రవరి 3, 2023
ఓటీటీలో విడుదల తేదీ : మార్చి 3, 2023
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లు తీయడంలో మిగతా భారతీయ భాషల దర్శకుల కంటే మలయాళం కథకులు రెండడుగులు ముందే ఉంటారు. ఇతర భాషల్లో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాల ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అవుతుందా? అని ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్న కాలంలో ఉన్నాం. ఇటీవలే మలయాళంలో విడుదల అయి మంచి టాక్ తెచ్చుకున్న ‘ఇరట్టా’ అనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?
కథ: కేరళలోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఫంక్షన్ సందర్భంగా అన్ని ఏర్పాట్లూ చేస్తూ ఉంటారు. ఇంతలో సడెన్‌గా తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో అక్కడికి అందరూ చేరుకుంటారు. ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) అక్కడ బుల్లెట్లు దిగి చనిపోయి ఉంటాడు. అతన్ని ఎవరు చంపారో తెలియదు. దీంతో పోలీస్ స్టేషన్ మొత్తం లాక్ చేసి ఎవరినీ బయటకు పంపకుండా విచారిస్తూ ఉంటారు. ఇంతలో ఈ విషయం వినోద్ కవల సోదరుడు, డీఎస్పీ అయిన ప్రమోద్‌కు (జోజు జార్జి సెకండ్ రోల్) తెలుస్తుంది. విషయం తెలియగానే ప్రమోద్ కూడా అక్కడికి చేరుకుంటాడు? అసలు వినోద్‌ను ఎవరు చంపారు? ప్రమోద్, వినోద్ ఎందుకు గొడవ పడతారు? ఈ కథలో మాలిని (అంజలి) ఎవరు? అనే విషయలు ఓటీటీలో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉంది: మనం రోజూ వార్తల్లో వినే కొన్ని అంశాలను తెరపై రియలిస్టిక్‌గా చూడటం చాలా కష్టం. మనసంతా ఒక రకమైన డిస్టర్బింగ్‌గా అయిపోతుంది. ‘ఇరట్టా’ ఆ కోవలోకే వస్తుంది. క్లైమ్యాక్స్ ట్విస్ట్ చూశాక తిరిగి సెట్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. ‘ఇలాంటి ఆలోచన దర్శకుడికి ఎలా వచ్చింది?’ అని కచ్చితంగా అనిపిస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే... సినిమా ప్రారంభంలో చాలా నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా వినోద్‌తో పడని వ్యక్తులు, వారి కథలను చెప్పే ఎపిసోడ్ నిడివి కాస్త ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. మాలిని, వినోద్‌ల ఫ్లాష్‌బ్యాక్ కొంచెం ఆహ్లాదకరంగా సాగుతుంది.
ఇక ఇన్వెస్టిగేషన్ ప్రమోద్ చేతికి వచ్చిన దగ్గర నుంచి కథ పరుగులు పెడుతుంది. చివరి వరకు ఒకే టెంపోలో సాగుతుంది. ఎన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసిన వాళ్లకి అయినా ఈ క్లైమ్యాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహకి అందదు. ప్రమోద్, వినోద్‌ల తండ్రి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో హింస, గృహ హింస, ఇతర విషయాలను కొంచెం ఓవర్ ది బోర్డ్ చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా ఈ సినిమాను చూసినప్పుడు మాత్రం గ్రిప్పింగ్, డిస్టర్బింగ్ థ్రిల్లర్‌ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
జేక్స్ బిజోయ్ అందించిన మూడు పాటలూ సిట్యుయేషన్‌కు తగ్గట్లు ఉంటాయి. నేపథ్య సంగీతం క్రైమ్ థ్రిల్లర్లకు సరిపోయేలా, సీన్ ఇంటెన్సిటీని పెంచేలా ఉన్నాయి. విజయ్ సినిమాటోగ్రఫీ మూడ్‌ను బాగా క్యారీ చేసింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... నేషనల్ అవార్డు విన్నర్ జోజు జార్జి రెండు పాత్రల్లోనూ చెలరేగిపోయాడు. రెండు పాత్రల్లోనూ గ్రే షేడ్స్ ఉంటాయి. కానీ రెండు పాత్రలకు కావాల్సిన వేరియేషన్స్‌ను జోజు అద్బుతంగా చూపించారు. ఇది ప్రధానంగా వీరిద్దరి కథే. వీరి తర్వాతో అంతో ఇంతో ప్రాధాన్యత అంజలి పోషించిన మాలిని పాత్రకు ఉంది. తను కూడా ఆ పాత్రలో బాగా నటించింది. ఇక మిగతా నటీ నటులందరూ పాత్ర పరిధి మేరకు నటించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘ఇరట్టా’ అనేది ఒక సూపర్ థ్రిల్లర్ సినిమా. కాస్త సెన్సిటివ్‌గా ఉండే వాళ్లు ఈ సినిమాను చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. తెలుగు డబ్ లేదు కానీ మలయాళం లాంగ్వేజ్‌లో సబ్ టైటిల్స్ పెట్టుకుని ఈ సినిమాను చూడవచ్చు.