Allu Arjun's Pushpa 2 Review In Telugu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'పుష్ప 2'. 'పుష్ప' పాన్ ఇండియా సక్సెస్ సాధించడం, అందులోని నటనకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడంతో సీక్వెల్ మీద అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకునేలా 'పుష్ప 2' ఉందా? 'బాహుబలి 2', 'కెజిఎఫ్ 2' స్థాయిలో ఈ సీక్వెల్ కూడా ఘన విజయం సాధిస్తుందా? లేదా? సినిమా ఎలా ఉంది?


కథ (Pushpa 2 Movie Story): ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే కూలీ నుంచి సిండికేట్ శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్ప రాజ్ (అల్లు అర్జున్). చిత్తూరు జిల్లాలో అతణ్ణి కాదని ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. తమ ఊరికి వచ్చిన ముఖ్యమంత్రిని కలవడానికి పుష్ప వెళుతుంటే... ఓ ఫోటో తీసుకోమని అడుగుతుంది శ్రీవల్లి (రష్మిక). అయితే... పుష్ప స్మగ్లర్ అని అతనికి ఫోటో ఇవ్వడానికి నిరాకరిస్తాడు సీఎం. అప్పుడు పుష్ప ఫీల్ అవుతాడు. తనకు జరిగిన అవమానంగా భావిస్తాడు. దాంతో సిద్ధప్ప (రావు రమేష్)ను ముఖ్యమంత్రి చేయాలనే నిర్ణయం తీసుకుంటాడు.


సిద్ధప్పను సీఎం చేయడానికి పుష్ప రాజ్ ఏం చేశాడు? అసలు చేయగలిగాడా? లేదా? ఎలాగైనా సరే పుష్పను పట్టుకుని తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని మరో వైపు భన్వర్ సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్) కాచుకుని కూర్చున్నాడు. అతను ఏం చేశాడు? సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డి (జగపతి బాబు), అతని తమ్ముడి కొడుకు (తారక్ పొన్నప్ప)కు, పుష్పకు సంబంధం ఏమిటి? తమ్ముడు అని తనను సవతి సోదరులు దగ్గరకు తీసుకోవడం లేదని పుష్ప పడుతున్న మనో వేదనకు, ఇంటి పేరు కోసం చేస్తున్న పోరాటానికి ముగింపు కార్డు పడిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Pushpa 2 Review Telugu): మాస్... ఊర మాస్... పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మాస్ తాండవం... 'పుష్ప 2' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అంతే! నటనలో, హీరోయిజంలో 'అస్సలు తగ్గేదే లే' అన్నట్టు అల్లు అర్జున్ నటిస్తే... దర్శకుడిగా సుకుమార్ కూడా తగ్గలేదు. తన మార్క్ మాస్ చూపించేశారు. ఆల్రెడీ పుష్ప రాజ్ క్యారెక్టర్, ఆ ప్రపంచం ప్రేక్షకులు అందరికీ తెలుసు. దాంతో కొత్తగా క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి సుకుమార్ టైం తీసుకోలేదు. డైరెక్టుగా ఫ్యాన్స్‌ కోరుకునే మాస్ మూమెంట్స్, హీరోయిజం మీద కాన్సంట్రేట్ చేశారు.


దర్శకుడిగా సుకుమార్ ఎక్కువ మెరిశారా? రచయితగా ఎక్కువ మెరిశారా? అంటే... రెండూ అని చెప్పాలి. యాక్షన్ సీక్వెన్సుల్లో హై మూమెంట్ ఇవ్వడంలో దర్శకుడిగా సక్సెస్ అయితే... ఎమోషనల్ సన్నివేశాల్లో పొదుపైన సంభాషణలతో రచయితగా గుండెలను తట్టారు. అయితే... కథకుడిగా నిడివి విషయంలో కాస్త ఇబ్బంది పెట్టారు. సుక్కు మార్క్ మాస్ 'పుష్ప 2'లో కనబడుతుంది. ఇంట్రడక్షన్ ఫైట్ బాగా డిజైన్ చేశారు. జాతర ఎపిసోడ్ ఆయన డీల్ చేసిన విధానం అద్భుతం. క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ విపరీతమైన హై ఇస్తుంది. అయితే, లెక్కల మాస్టారు లాజిక్కులను పక్కన పెట్టేయడం గమనార్హం. ఫైట్ సీక్వెన్సుల్లోనూ లాజిక్స్ చూసే సుక్కు, వాటిని పక్కన పెట్టేశారు. 


'పెళ్ళాం మాట వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా' అని హీరో చెప్పే మాట కొందరికి నచ్చకపోవచ్చు. కానీ, 'పుష్ప 2'కు అది టర్నింగ్ పాయింట్. వైఫ్ అండ్ హజ్బెండ్ సీన్లు మాత్రమే కాదు... తనను తమ ఇంటివాడు కాదు అని అన్నయ్య తక్కువ చేసిన చూడటంతో కుమిలిపోయిన పుష్ప ఆవేదనకు ఎండ్ కార్డు వేసిన విధానం, ఇంటి పేరుకు ముగింపు పలకడం దర్శకుడిగా, రచయితగా సుకుమార్ మెచ్యూరిటీ చూపించింది. అయితే... సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ - నిడివి. మోటు సరసం కొంత ఇబ్బంది పెడుతుంది. పీలింగ్స్ పాటకు ముందు వచ్చే రెండు సీన్లలో ఒకదానికి కత్తెర వేయవచ్చు.


'పుష్ప 2' రన్ టైమ్... మూడు గంటల 20 నిమిషాలు. అంత సేపు థియేటర్లలో కూర్చోబెట్టడం టఫ్ టాస్క్. దాన్ని సుకుమార్ కొంత వరకు అధిగమించారు. అయితే... ఆ రన్ టైమ్ వల్ల కొన్ని సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అంతే కాదు... అద్భుతంగా ఉన్న జాతర ఎపిసోడ్ మధ్యలో వచ్చే 'సూసేకి' పాట పంటి కింద రాయిలా తగులుతుంది. పుష్ప ఇంటికి అన్నయ్య (అజయ్) వచ్చే సీన్ చాలా బావుంది. కానీ, అది కూడా నిడివి ఎక్కువైంది. విపరీతమైన హై ఇచ్చిన ఫైట్ సీక్వెన్స్ తర్వాత క్లైమాక్స్‌లో ఆ ఎమోషనల్ సీన్‌కు చోటు ఇవ్వడం సాహసం. అయితే... పుష్ప మనసులో వేదనకు కారణమైన ఇంటి పేరు సమస్యకు ముగింపు ఇచ్చారు సుక్కు. కానీ, పార్ట్ 3కి అవసరమైన లీడ్ - క్లిఫ్ హ్యాంగర్ (ఎగ్జైట్‌మెంట్) ఇవ్వడంలో సక్సెస్ కాలేదు.  


జపాన్ (ఇంట్రో) ఫైట్ బావుంది. కానీ, సినిమా అంతా అయ్యాక ఎందుకు అనిపిస్తుంది. పార్ట్ 3 కోసం లింక్ ఇచ్చారేమో!? దర్శకుడిగా హీరోయిజం మీద, ఎమోషనల్ మూమెంట్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసిన సుకుమార్... కథ పరంగా సర్‌ప్రైజ్ ఏమీ చేయలేదు. లాజిక్స్ గురించి ఆలోచించలేదు. మాస్ కమర్షియల్ సినిమాకు అవసరమైన ఫార్మటులో తీశారు. ఈ తరహా హీరోయిజం సినిమాలకు అది చాలు అని నిరూపించారు. 


టెక్నికల్ పరంగా 'పుష్ప 2' హై స్టాండర్డ్స్‌లో ఉంది. మిరోస్లా క్యూబా బ్రోజెక్ కెమెరా వర్క్ టాప్ క్లాస్. దేవి శ్రీ ప్రసాద్ పాటలు స్క్రీన్ మీద ఇంకా బావున్నాయి. ఫైట్ సీక్వెన్సులు అన్నిటిలో నేపథ్య సంగీతం అదిరింది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్! అందులో గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. అందుకు సామ్ సిఎస్ (Sam CS)ను మెచ్చుకోవాలి. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఖర్చుకు వెనుకాడలేదు. ప్రతి రూపాయి ఫ్రేములో కనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ బావుంది.


పుష్ప అంటే పేరు కాదు, అదొక బ్రాండ్! అందుకు రీజన్ క్యారెక్టర్ మాత్రమే కాదు, అందులో అల్లు అర్జున్ చూపించిన నటన. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. 'పుష్ప: ది రైజ్' చూశాక... 'అంతకు మించి' అనేలా నటించారు. నటనలో కసి కనిపించింది. సీన్, ఫైట్ అని తేడా లేదు. ప్రతి దాంట్లో ప్రాణం పెట్టి నటించారు. అయితే... జాతర ఎపిసోడ్‌లో ఆయన నటన అన్నిటినీ డామినేట్ చేస్తుంది. ఆ ఎపిసోడ్ అంతటా నిజంగా అమ్మవారు పూనారా? అన్నట్టు పూనకం వచ్చినట్టు నటించారు. ప్రీ క్లైమాక్స్ ఫైట్ కూడా హై ఇస్తుంది. ఆడపిల్ల గురించి అల్లు అర్జున్ చెప్పే మాటలు కంటతడి పెట్టిస్తాయి.


Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటి?



'పుష్ప'తో కంపేర్ చేస్తే... 'పుష్ప 2'లో ఫహాద్ ఫాజిల్ స్క్రీన్ స్పేస్ ఎక్కువ. మాంచి విలనిజం చూపించే మూమెంట్స్ ఉన్నాయి. ఎర్ర చందనం లారీలను కాల్చే సన్నివేశంతో పాటు కొన్ని సన్నివేశాల్లో విశ్వరూపం చూపించారు. కానీ, ఫహాద్ అభిమానులకు - సగటు ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ నచ్చే అవకాశాలు తక్కువ. క్యారెక్టర్ ఆర్క్ బాలేదు. కొన్ని చోట్ల కమెడియన్ చేసేశారు. జగపతి బాబు లుక్ కొత్తగా ఉంది. 'పుష్ప 2' వరకు సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చూపించారు. 'పుష్ప 3'లో ఆయన రోల్ ఎక్కువ ఉంటుందని ఆశించవచ్చు. తారక్ పొన్నప్ప క్యారెక్టర్, ఆయన నటన చూస్తే నిజంగా చంపేయాలని అనిపిస్తుంది. విలనిజం అంత ఎఫెక్టివ్‌గా ఉంది. సునీల్ స్క్రీన్ స్పేస్ తక్కువ. క్యారెక్టర్ కూడా పార్ట్‌ 1లో ఉన్నంత పవర్‌ఫుల్‌గా లేదు.


శ్రీవల్లి పాత్రలో ఈ సినిమాకు అవసరమైన గ్లామర్ (పీలింగ్స్ పాటలో) యాడ్ చేయడమే కాదు... జాతర మధ్యలో వచ్చే ఒక్క సన్నివేశంలో నటన పరంగానూ రష్మిక ఫైర్ చూపించారు. అయితే... ఆ సాంగ్ అందరికీ నచ్చే అవకాశాలు తక్కువ. 'కిస్సిక్...' పాటలో శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టారు. అల్లు అర్జున్ తల్లి పాత్ర చేసిన కల్పలత, దాక్షాయణిగా కనిపించేది కాసేపే అయినా అనసూయ, అజయ్ కుమార్తెగా నటించిన పావని కరణం తమ పాత్రల పరిధి మేరకు చేశారు. 


పుష్ప... పుష్ప రాజ్ రూల్... అల్లు అర్జున్ మాస్ తాండవం. ఇంటర్వెల్ తర్వాత ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎపిసోడ్ సుక్కు మార్క్ మాస్‌కు నిదర్శనం. జాతర ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ ఫైట్  గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మాస్‌ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్‌కు పూనకాలు గ్యారంటీ. అల్లు అర్జున్ నటన కోసమైనా కంపల్సరీ చూడాల్సిన సినిమా.


Also Read: రోటి కపడా రొమాన్స్ రివ్యూ: రొమాంటిక్‌గా కలిశాక... లవర్స్ మధ్య ప్రాబ్లమ్స్ వస్తే?