సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు (Mahesh Babu Nephew Ashok Galla), ప్రముఖ పారిశ్రామికవేత్త - మాజీ ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ 'హీరో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఆయన నటించిన రెండో సినిమా 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva). దీనికి ప్రశాంత్ వర్మ కథ అందించారు. 'హనుమాన్' విజయం తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో కాస్త ప్రత్యేకత సంతరించుకుంది. మరి, ఈ సినిమా ఎలా ఉంది?


కథ (Devaki Nandana Vasudeva Story): కంస రాజు (దేవదత్తా నాగే)ను ఎదిరించే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవు. అతను అడిగితే పొలమైనా, ప్రాణమైనా ఇచ్చేయాలి. కాదని కంప్లైంట్ ఇస్తే రాక్షసంగా చంపేస్తాడు. కాశీ వెళ్లిన కంస రాజుకు చెల్లెలి మూడో సంతానం వల్ల ప్రాణగండం ఉందని ఓ శివ సాధువు చెబుతాడు. దాంతో తొలిచూరి కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా చెల్లెలి భర్తను చంపేస్తాడు. 


కంస రాజు చేతిలో మరణించిన వ్యక్తి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో కంస రాజును పోలీసులు అరెస్ట్ చేస్తారు. సరిగ్గా ఆ రోజే అతని చెల్లెలు (దేవయాని)కి అమ్మాయి సత్య (మానస వారణాసి) జన్మిస్తుంది. ఓ పెళ్లిలో సత్యను చూసి కృష్ణ (అశోక్ గల్లా) ప్రేమలో పడతాడు. జైలు నుంచి బయటకు వచ్చిన కంస రాజును ఓ ఎటాక్ నుంచి కాపాడి అతనికి దగ్గర అవుతాడు. 


సత్య, కృష్ణ ప్రేమ గురించి కంస రాజుకు తెలిసిందా? లేదా? కంస రాజుకు తెలియకుండా అతని దగ్గర చెల్లెలు దాచిన నిజం ఏమిటి? సత్య ఫ్యామిలీ గురించి పూర్తి వివరాలు తెలిశాక కృష్ణ ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Devaki Nandana Vasudeva Review Telugu): కథలో విషయం ఉందా? లేదా? అని ఆలోచించి ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో... కథకు, కథలో క్యారెక్టర్‌కు హీరో సూట్ అవుతాడా? లేదా? అనేది చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేదంటే సినిమా తేడా కొడుతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ 'దేవకీ నందన వాసుదేవ'. సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ మిస్ కాస్టింగ్. క్యారెక్టర్లకు సరైన నటీనటులను ఎంపిక చేసుకోకపోవడం వల్ల సీరియస్ సినిమా కాస్త ట్రోలింగ్ మెటీరియల్ అయ్యింది.


మైథాలజీ టచ్ చేస్తూ తీసే సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. నిఖిల్ 'కార్తికేయ 2'లో కృష్ణుడి సన్నివేశానికి థియేటర్లలో ఎటువంటి రెస్పాన్స్ లభించిందో చూశాం. ఈ టైంలో కృష్ణుడు - కంసుడు స్ఫూర్తితో, పాన్ ఇండియా హిట్ 'హనుమాన్' తీసిన ప్రశాంత్ వర్మ కథతో సినిమా అనేసరికి తొలుత ఆసక్తి ఏర్పడింది. విడుదల దగ్గరకు వచ్చేసరికి 'దేవకీ నందన వాసుదేవ'పై ఆసక్తి సన్నగిల్లింది. అయినా సరే కాస్తో కూస్తో అంచనాలతో థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు మొదటి పదిహేను, ఇరవై నిమిషాలు చూసేసరికి సినిమాపై ఒక అంచనాకు రావచ్చు.


స్మాల్ సైజ్ షర్టు వేసుకునే నూనూగు మీసాల అబ్బాయికి ఎక్స్ట్రా లార్జ్, డబుల్ ఎక్స్ఎల్ షర్టు వేస్తే ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్... మాస్ ఇమేజ్ లేదా బల్క్ బాడీ ఉన్న హీరో చేయాల్సిన కథను అశోక్ గల్లాతో చేశారని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. బోయపాటి శ్రీను సినిమాల్లో చూసే భారీ యాక్షన్ సన్నివేశాలకు తీసిపోని రీతిలో ఆయన శిష్యుడు అర్జున్ జంధ్యాల 'దేవకీ నందన వాసుదేవ'లో యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. డెప్త్ ఉన్న డైలాగులు రాయించారు. అయితే... అశోక్ గల్లా వయసుకు, అతని బాడీకి మించిన క్యారెక్టర్ కావడంతో సెట్ కాలేదు. దాంతో ఆ క్యారెక్టర్, కథతో కనెక్ట్ కావడం కుదరదు. తేజా సజ్జా సన్నగా ఉన్నా 'హనుమాన్'లో ఫైట్స్ చూశారంటే... మైథాలజీ టచ్. అతనికి దేవుడి అండ ఉంది కనుక ఆడియన్స్ కన్వీన్స్ అయ్యారు. ఈ సినిమాలో అటువంటి టచ్ లేదు కనుక ఫైట్స్ చూసేటప్పుడు కన్వీన్సింగ్‌గా అనిపించదు. 


హీరో పేరు కృష్ణుడు, హీరోయిన్ పేరు సత్య, విలన్ పేరు కంస రాజు... కథ, కథనం ఎలా ఉంటాయో ఊహించడం కష్టం కాదు. కానీ, ఈ కథకు ప్రశాంత్ వర్మ డిఫరెంట్ టచ్ ఇచ్చారు. కంసుడికి సత్యను మేనకోడలు చేశారు. ఆ మేనకోడలు క్యారెక్టర్‌కు మరో ట్విస్ట్ ఇచ్చారు. కథలో హుక్ పాయింట్స్, ట్విస్ట్స్ ఉన్నాయి. అయితే రొటీన్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ ట్రీట్మెంట్ ఇస్తూ తీయడం వల్ల ఎగ్జైట్ చేయదు. తెలుగు కమర్షియల్ సినిమాకు తగ్గట్టు పాటలు, నేపథ్య సంగీతం చేశారు భీమ్స్. కెమెరా వర్క్, ఫైట్స్, ఎడిటింగ్... ప్రతిదీ కమర్షియల్ ఫార్మాటులో ఉంది.


Also Read'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?


అశోక్ గల్లా తన వయసుకు మించిన క్యారెక్టర్ చేశారు. హీరోయిన్ మానస వారణాసి మొదటి చిత్రమిది. అమ్మాయి రూపం బావుంది. కానీ, నటనలో పరిణితి అవసరం. దేవదత్తా నాగేది రొటీన్ విలన్ క్యారెక్టర్. అంతకు మించి ఆయన చేయడానికి ఏమీ లేదు. హీరోయిన్ తల్లిగా దేవయాని, హీరో తల్లిగా ఝాన్సీ క్లైమాక్స్ వరకు డీసెంట్ యాక్టింగ్ చేశారు. ఒక్కసారిగా వాళ్ళతో చేయించిన లౌడ్ యాక్టింగ్ అప్పటి వరకు ఆ క్యారెక్టర్లపై ఉన్న ఇంప్రెషన్ పోయేలా చేసింది. ఫస్టాఫ్ చూస్తే 'గెటప్' శ్రీను, సెకండాఫ్ చూస్తే శత్రు కొంత నవ్వించారు. బిర్యానీ సీన్ భలే వర్కవుట్ అయ్యింది. మ్యాగ్జిమమ్ పోలీస్ క్యారెక్టర్లు చేసే శ్రీధర్ రెడ్డి ఈ సినిమాలో విలన్ అనుచరుడిగా కనిపించారు.


దేవకీ నందన వాసుదేవ... ఒక్క సినిమా అనుభవం, అందులోనూ అశోక్ గల్లా వంటి లీన్ పర్సనాలిటీ యంగ్‌స్టర్‌తో తీయాల్సిన సినిమా కాదు. ఛోటా ప్యాకెట్, బడా ధమాకా అనుకోవడానికి లేదు. మిస్ కాస్టింగ్ వల్ల మిస్ ఫైర్ అయిన సినిమాగా దీనిని చెప్పుకోవచ్చు. యూత్‌ఫుల్ సినిమాలు చేయాల్సిన వయసులో మాస్ ఇమేజ్ కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తే అశోక్ గల్లాకు విజయాలు రావడం కష్టం సుమా!


Also Read'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ సాలిడ్ కమ్ బ్యాక్... ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన జీబ్రా... టాక్ ఎలా ఉందంటే?