Parasyte: The Grey Web Series Review in Telugu: కొరియన్‌లో వెబ్ సిరీస్‌లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా వైరస్‌లు, వింత జీవులు, జాంబీలు లాంటి కథాంశాలతో సినిమాలు, సిరీస్‌లు తెరకెక్కించాలంటే కొరియన్ ఇండస్ట్రీ ముందుంటుంది. అదే జోనర్‌లో తాజాగా మరో వెబ్ సిరీస్.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘పారాసైట్: ది గ్రే’. ఏప్రిల్ 5న నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్‌కు థ్రిల్లర్ లవర్స్ ఫిదా అవుతున్నారు. హారర్ కావాలంటే దెయ్యాలే ఉండాల్సిన అవసరం లేదని ‘పారాసైట్: ది గ్రే’ మరోసారి ప్రూవ్ చేసింది. ఈ కొరియన్ వెబ్ సీరిస్ తెలుగులో కూడా ఉంది.


కథ..


ఆకాశం నుంచి కొన్ని పారాసైట్స్ భూమిపైకి వచ్చి మనుషులపై దాడి చేస్తాయి. అవి మనుషుల చెవుల్లోకి వెళ్లి, వారి బ్రెయిన్స్‌ను కంట్రోల్ చేయడం మొదలుపెడతాయి. అంతే కాకుండా ఆ పారాసైట్స్ వల్ల మనుషుల రూపురేఖలు కూడా మారిపోతాయి. ముఖ్యంగా మనుషుల తలలు చాలా వింతంగా మారిపోతాయి. అయితే ఈ పారాసైట్స్ వల్ల మానవాళికి ప్రమాదాన్ని గుర్తించిన ఒక ఎమర్జెన్సీ ఫోర్స్.. వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.


మరోవైపు సూపర్ మార్కెట్లో పనిచేసే జియోన్ సు ఇన్ (జియోన్ సో నీ) అనే అమ్మాయిలోకి కూడా ఓ పారాసైట్ ప్రవేశిస్తుంది. సూపర్ మార్కెట్‌కు వచ్చిన ఓ తాగుబోతు.. ఆమెతో వాగ్వాదానికి దిగుతాడు. ఆమెపై కక్షగడతాడు. ఆమె ఒంటరిగా బైక్ మీద ఇంటికి వెళ్తున్న సమయంలో కారుతో గుద్ది.. కత్తితో దారుణంగా పొడుస్తాడు. దీంతో రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి వెళ్లి స్పృహ కోల్పోతుంది. అదే సమయంలో ఆకాశం నుంచి రాలిన ఓ పారాసైట్.. ఆమెలోకి ప్రవేశిస్తుంది. ఆమెను చంపడానికి వస్తున్న తాగుబోతును చంపేస్తుంది. ఆమె గాయాలను నయం చేసే క్రమంలో.. పారాసైట్ ఆమె మెదడును పూర్తిగా ఆక్రమించుకోలేదు. దీంతో ఆమె సగం పారాసైట్, సగం మనిషిగా ఉంటుంది.


మరోవైపు సియోల్ కాంగ్ వూ (కో క్యో హువాన్) అనే యువకుడి అక్క శరీరంలోకి కూడా పారాసైట్స్ ప్రవేశిస్తాయి. దీంతో అతడు వాటితో పోరాడి రివేంజ్ తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. అతడికి జియోన్ సాయం చేస్తుంది. కానీ, పోలీసులు ఆమెను పారాసైట్‌గానే భావిస్తారు. దీంతో ఆమె తోటి పారాసైట్స్ నుంచి చాలా సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తుంది. ఒక వైపు ఎమర్జెన్సీ ఫోర్స్, మరోవైపు తోటి పారాసైట్స్‌ ఆమెను లక్ష్యంగా చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఫోర్స్ ఆమెను అంతం చేస్తారా? లేదా ఆమె సాయంతో పారాసైట్స్‌తో పోరాడతారా అనేది బుల్లితెరపైనే చూడాలి.


విశ్లేషణ..


‘పారాసైట్: ది గ్రే’.. మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. సోది లేకుండా నేరుగా కథలోకి ప్రవేశిస్తుంది. పారాసైట్స్ ప్రభావం వల్ల మనుషుల తలలు విచ్ఛిన్నం అవుతాయి. అలాంటి సీన్స్ చూడాలంటే తప్పకుండా గుండె ధైర్యం ఉండాలి. పిల్లలు ఈ సీరిస్‌కు దూరంగా ఉండటమే మంచిది. అశ్లీల సన్నివేశాలు లేకున్నా.. ఒళ్లుగగూర్పాటు కలిగించే సీన్స్ చాలానే ఉన్నాయి. తెగిన శరీర భాగాలు.. ఛిద్రమయ్యే బాడీలు.. ఇలాంటి సీన్స్.. సీరిస్ ముగిసిన తర్వాత కూడా వెంటాడుతాయి. ఈ సిరీస్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది మాత్రం గ్రాఫిక్సే. అసలు ఏ మాత్రం కూడా అవి గ్రాఫిక్స్ అని, నిజం కాదని ప్రేక్షకులకు అనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. ఇలాంటి సీన్స్‌ మనకు ఎక్కువగా ఏలియన్స్ సినిమాల్లోనే కనిపిస్తాయి. ఆ పారాసైట్ కూడా ఏలియన్.. అది మనుషుల మెదడులో తిష్టవేసి రకరకాలుగా తలలను ఛిత్రం చేసి.. ఆయుధాలుగా మార్చుకుంటుంది. వాటిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదనే విధంగా ఈ సీరిస్‌లో చూపించారు.


అంచనాలు లేకుండా చూడటమే బెటర్..




‘ట్రైన్ టు బుసన్’ వంటి జాంబీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించాడు దర్శకుడు ఇయోన్ సంగ్ హో(Yeon Sang-ho).  అతడి దర్శకత్వంలో రూపొందిన ‘హెల్ బాండ్’ వెబ్ సీరిస్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే, వాటినే మైండ్‌లో పెట్టుకుని ఈ సీరిస్ చూడద్దు. ఎందుకంటే.. ఇది వాటి కంటే భిన్నమైనది. పైగా అందులో ఉండేంత ఉత్కంఠత ఈ సీరిస్‌లో ఉండదు. ఈ సీరిస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టకుండా చూసుకున్నాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా బాగుంటాయి. అయితే, ఈ సీరిస్‌కు ముగింపు ఇవ్వలేదు. మరొక సీజన్ కోసమే సస్పెన్స్‌లో వదిలేశారని అర్థమవుతుంది.



సైన్స్ ఫిక్షన్, హర్రర్, డార్క్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ఇష్టపడే వారికి ‘పారాసైట్: ది గ్రే’ కచ్చితంగా నచ్చుతుంది. కానీ క్యారెక్టర్లు ఎక్కువగా ఉండడం కూడా ఈ సిరీస్‌కు ఒక మైనస్‌ అని చెప్పవచ్చు. పాత్రలపై కాకుండా, కథపై ఎక్కువగా శ్రద్ధపెట్టాలనే ఉద్దేశంతో ఇయోన్ సంగ్ హో.. ఏ క్యారెక్టర్‌ను ఎక్కువ లోతుగా చూపించలేకపోయాడు అనిపిస్తుంది. నటులు జియోన్ సో నీ, కో క్యో హువాన్, లీ జుంగ్ హ్యూన్, క్వాన్ హే హ్యో, కిమ్ ఇన్ క్వాన్ నటన ఆకట్టుకుంటుంది. తమ పాత్రలకు న్యాయం చేశారు. చివరిగా.. ఈ ‘పారాసైట్’ మీ బుర్రను తొలిచేస్తుంది. పిల్లలతో చూడకండి. కొన్ని సీన్లు చాలా డిస్ట్రబ్ చేస్తాయి.


Also Read: ఆమె కడుపులోకి డ్రగ్ ప్యాకెట్ చొప్పిస్తారు.. అది పగలగానే ఊహించని పవర్స్ వస్తాయ్, అంతే కథ మొత్తం తారుమార్!