సినిమా రివ్యూ : #MENTOO
రేటింగ్ : 2/5
నటీనటులు : నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్ తదితరులు  
ఛాయాగ్రహణం : పీసీ మౌళి
సంగీతం : ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్
నిర్మాత : మౌర్య సిద్ధవరం
రచన, దర్శకత్వం : శ్రీకాంత్ జి. రెడ్డి
విడుదల తేదీ: మే 26, 2023


ఇటీవలి కాలంలో చిన్న సినిమా మీద బజ్ పుట్టించడమే చాలా కష్టం అయిపోతుంది. రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్‌కు ప్రత్యక్షం అవుతుండటంతో ఆడియన్స్‌ను థియేటర్ల వైపు రప్పించాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. కానీ టీజర్, ట్రైలర్లతోనే ఈ సినిమాలో ఏదో ఉంది అనే ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన సినిమా ‘#MENTOO’. పెళ్లైన పురుషుల కష్టాలను ఎఫెక్టివ్‌గా చూపిస్తే రిజల్ ఎలా ఉంటుందో ఇప్పటికే ‘ఎఫ్2’ ద్వారా చూశాం. మరి ‘#MENTOO’ ఎలా ఉంది?


కథ: స్టాగ్స్ ఓన్లీ అనే పబ్‌లో రెగ్యులర్‌గా కలిసే కొంతమంది పురుషుల జీవితాల్లో జరిగే సంఘటనలే ఈ సినిమా కథ. ఆదిత్య (నరేష్ అగస్త్య), సంజు (కౌశిక్), మున్నా (మౌర్య సిద్ధవరం), రాహుల్ (వైవా హర్ష) ఇలా ఆ పబ్‌కు వచ్చే వారందరూ తమ కష్టాలు చెప్పుకుంటారు. వర్క్ చేసే ఆఫీస్‌లో తప్పుడు సెక్సువల్ హెరాస్‌మెంట్ ఎదుర్కోవడం, డామినేట్ చేసే గర్ల్ ఫ్రెండ్‌ను భరించడం, మహిళా సంఘం అధ్యక్షురాలిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పడే కష్టాలు... ఇలా సంఘటనలే ఉంటాయి. వారి జీవితాలన్నీ చివరికి ఎక్కడికి చేరుకున్నాయన్నదే ‘#MENTOO’ సినిమా.


విశ్లేషణ: సినిమాకి వచ్చే ప్రేక్షకులను కట్టిపడేయడానికి కథ చాలా అవసరం. కానీ కేవలం సన్నివేశాల ఆధారంగానే సినిమా తీయాలంటే వాటికి ఎంతో బలం ఉండాలి. ప్రేక్షకులు వాటిని కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కానీ ‘#MENTOO’లో అదే మిస్ అయింది. మొదటి నుంచి మల్టీపుల్ ట్రాక్స్ స్క్రీన్ మీదకి వస్తూ ఉండటంతో ఒక్క ట్రాక్‌తో కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. వైవా హర్ష ట్రాక్ మొదటి నుంచి ఎమోషనల్‌గా సాగుతుంది. కౌశిక్, మున్నాల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. వర్క్ స్పేస్‌లో ఆదిత్యకి ఎదురయ్యే సవాళ్లు ఇంకోలా ఉంటాయి. ఇలా రకరకాల నేపథ్యాలున్న ట్రాక్‌లు ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తూ ఉండటంతో దేనితోనూ అంత త్వరగా కనెక్ట్ కాలేం.


ప్రథమార్థం ఒక షాకింగ్ సిట్యుయేషన్‌తో ఎండ్ అవుతుంది. దీంతో దర్శకుడు శ్రీకాంత్ ద్వితీయార్థాన్ని పూర్తిగా ఎమోషన్‌పైనే నడిపే ప్రయత్నం చేశాడు. కానీ అది అంతగా ఫలించలేదు. ఆది, సంజు, కౌశిక్‌ల మధ్య వచ్చే గొడవ అయితే మరీ సిల్లీగా ఉంటుంది. బ్రహ్మాజీ పాత్రకు ఒక కష్టం రాగానే కౌశిక్ ఏమీ ఆలోచించకుండా రూ.25 లక్షలు చెక్ ఇచ్చేయడం చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. ఆ రెండు పాత్రలకూ పెద్ద ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉండదు. పబ్‌కి కనెక్ట్ అయ్యాడు అనుకోవాలి అంతే. చివర్లో నరేష్ అగస్త్య ఇచ్చే స్పీచ్ కూడా ఆకట్టుకోదు. సినిమా మొత్తం అయిపోయాక రెండో భాగానికి హింట్ ఇచ్చారు. కానీ దీనికి వచ్చే రెస్పాన్స్ చూశాక సీక్వెల్ తీస్తే సాహసం అనే చెప్పాలి.


ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్ అందించిన పాటలు సోసోగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా పర్లేదు. పీసీ మౌళి ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ స్క్రీన్ మీద బాగా కనిపించాయి. సినిమాలో నటించిన మౌర్య సిద్ధవరమే ఈ సినిమాకు నిర్మాత కూడా. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు అవసరం అయినంత ఖర్చు పెట్టారు.


Also Read : '2018' రివ్యూ : మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన సినిమా - ఎలా ఉందంటే?


ఇక నటీనటుల విషయానికి వస్తే... నరేష్ అగస్త్య, కౌశిక్‌లు ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు. మౌర్య సిద్ధవరం పాత్ర నవ్విస్తుంది. వైవా హర్ష ఇంతకు ముందు పోషించనంత ఎమోషనల్ వెయిట్ ఉన్న పాత్రలో కనిపించారు. బ్రహ్మాజీని ఇలాంటి పాత్రల్లో ఇప్పటికే చాలా సార్లు చూసేశాం.


ఓవరాల్‌గా చెప్పాలంటే... #MENTOO సినిమా థియేటర్‌కు వచ్చి చూసేంత సినిమా అయితే కాదు. ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయవచ్చు.


Also Read : 'మేమ్ ఫేమస్' రివ్యూ : 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత ఛాయ్ బిస్కెట్‌కు మరో హిట్టేనా?