Maa Oori Polimera 2 Review:


సినిమా రివ్యూ : మా ఊరి పొలిమేర 2
రేటింగ్ : 2.5/5
నటీనటులు : 'స‌త్యం' రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, 'గెట‌ప్' శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, 'చిత్రం' శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు
ఛాయాగ్రహణం : ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి
సంగీతం : గ్యాని
సహ నిర్మాత : భాస్కర్ల ఉమా మహేశ్వరి దేవి 
సమర్పణ : గౌరు గ‌ణ‌బాబు
నిర్మాతలు : గౌరి కృష్ణ‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం : డా. అనిల్ విశ్వ‌నాథ్‌
విడుదల తేదీ: నవంబర్ 3, 2023  


Maa Oori Polimera 2 Movie Review : తెలుగు సినిమాలు కొన్నిటిలో తాంత్రిక పూజలు, మాంత్రిక విద్యలు, చేతబడి వంటి నేపథ్యంలో సన్నివేశాలు ఉన్నాయి. అయితే పూర్తిగా చేతబడి నేపథ్యంలో వచ్చిన సినిమా మా ఊరి పొలిమేర. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. సత్యం రాజేష్, కామాక్షీ భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీలో విడుదలైన ఆ సినిమాకు ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించారు. మా ఊరి పొలిమేర 2ను థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉంది?  


కథ (Maa Oori Polimera 2 Story) : జాస్తిపల్లి పోలీస్ స్టేషనుకు కొత్త ఎస్సై రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) వస్తాడు. 'ఓకే చితిలో రెండు శవాలు' వార్త సంచలనం కావడంతో ఆ ఊరు, అక్కడి ప్రజల గురించి ఆయనకు ఐడియా ఉంది. కేసు వేసిన జంగయ్య (బాలాదిత్య) చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం, ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోవడంతో అతడిపై రవీంద్ర అనుమానం వ్యక్తం చేస్తాడు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని పారిపోయాడేమో అంటాడు. అతని నిజాయతీ గురించి స్టేషనులో జనాలు చెప్పడంతో... అసలు జంగయ్య ఏమయ్యాడో అని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు.


జంగయ్య గురించి ఆరా తీసిన రవీంద్రకు బలిజ ('గెటప్' శ్రీను) ద్వారా కేరళలో కొమరయ్య ('సత్యం' రాజేష్) కనపడతాడు. చిన్నప్పుడు తాను ప్రేమించిన కవితను కాకుండా తన స్నేహితుడు బలిజ భార్యను కొమరయ్య కేరళ తీసుకు వెళ్ళాడని చెబుతాడు. అసలు, వాళ్లిద్దరూ కేరళ ఎందుకు వెళ్లారు? వాళ్ళ మధ్య సంబంధం ఏమిటి? జాస్తిపల్లి ఊరి పొలిమేరలో గుడితో పాటు కేరళలో అనంత పద్మనాభ స్వామి గుడికి... కొమరయ్య చేసే చేతబడి పూజలకు సంబంధం ఏమిటి? కొమరయ్య చేసే చేతబడి గురించి భార్య లక్ష్మి (కామాక్షీ భాస్కర్ల)కు తెలుసా? జంగయ్య ఏమయ్యాడు? చివరకు ఏం తెలిసింది? అనేది సినిమాలో చూడాలి. 


విశ్లేషణ (Maa Oori Polimera 2 Movie Review) : హిట్ సినిమా లేదా ప్రశంసలు పొందిన సినిమాకు సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. 'మా ఊరి పొలిమేర' ఓటీటీలో విడుదల కావడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులతో పాటు ఇళ్ళల్లో జనాలు కూడా చాలా మంది చూశారు. అందువల్ల, 'పొలిమేర 2'కు బజ్ ఏర్పడింది. అంచనాలు ఉంటాయని తెలిసినప్పుడు దర్శక నిర్మాతలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విమర్శలను దృష్టిలో పెట్టుకుని రిపీట్ కాకుండా చూసుకోవాలి. 


'మా ఊరి పొలిమేర' చూడని ప్రేక్షకులు సైతం 'పొలిమేర 2'కు హ్యాపీగా వెళ్ళవచ్చు. అందులో కథనంతా 'కట్టే కొట్టే తెచ్చే' తరహాలో టైటిల్స్ పడేటప్పుడు క్లుప్తంగా చెప్పారు. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ఇంటర్వెల్ వరకు వచ్చే ట్విస్టులు ఆకట్టుకోవడం కష్టం. 'సత్యం' రాజేష్ బతికి ఉన్న విషయం ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సైకు తెలియదేమో! కానీ, బలిజ (గెటప్ శ్రీను)తో పాటు లక్ష్మి (కామాక్షీ భాస్కర్ల)కు తెలుసుగా! జంగయ్య ఏమయ్యాడో అని మొదలు పెట్టిన ఇన్వెస్టిగేషన్ ఇంటర్వెల్ వచ్చేసరికి కొమరయ్య దగ్గర ఆగడంతో 'కట్టే కొట్టే తెచ్చే' తరహాలో చెబితే మూడు సన్నివేశాల్లో పూర్తవుతుందని అనిపిస్తుంది. 


'పొలిమేర 2'లో అసలు కథ ఇంటర్వెల్ తర్వాత మొదలైంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ట్విస్టులు సర్‌ప్రైజ్ చేస్తాయి. సస్పెన్స్ మైంటైన్ చేశారు. మధ్య మధ్యలో చిన్న చిన్న థ్రిల్స్ ఇచ్చారు. అయితే... కథలో ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఎక్కువ. పార్ట్ 3 కోసం అన్నట్లు గుడి మిస్టరీని దాచడంతో కథను అసంపూర్తిగా ముగిసింది. నేపథ్య సంగీతం బావుంది. చివరిలో వచ్చే పెంచల్ దాస్ పాట పర్వాలేదు. ప్రొడక్షన్ డిజైన్ ఇంకా ఇంప్రూవ్ కావాలి. 


నటీనటులు ఎలా చేశారంటే... : కొమరయ్య పాత్రకు 'సత్యం' రాజేష్ మరోసారి న్యాయం చేశారు. అలవాటైన పాత్ర కావడంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లారు. 'పొలిమేర 2'లో కొన్ని సన్నివేశాలు 'మా ఊరి పొలిమేర'తో పాటు చిత్రీకరణ చేయడమో? మరొకటో? 'సత్యం' రాజేష్ పెట్టుడు గడ్డం స్క్రీన్ మీద స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. 


'సత్యం' రాజేష్ కంటే 'పొలిమేర 2'లో కామాక్షీ భాస్కర్ల క్యారెక్టర్ ఎక్కువ సర్‌ప్రైజ్ చేస్తుంది. పతాక సన్నివేశాల్లో ఆవిడ ద్వారా కొన్ని ట్విస్టులు రివీల్ చేశారు. నటిగా కూడా చక్కగా చేశారామె. 'గెటప్' శ్రీను, రాకేందు మౌళి, రవి వర్మ తదితర ఆర్టిస్టులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. పృథ్వీరాజ్, బాలాదిత్యలవి ఈ సినిమాలో అతిథి పాత్రలు. మూడో పొలిమేరలో వాళ్ళిద్దరూ కీలకం అని క్లైమాక్స్ చూస్తే అర్థం అవుతుంది.


Also Read : కీడా కోలా రివ్యూ : తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?


చివరగా చెప్పేది ఏంటంటే : ఇంటర్వెల్ ముందు వరకు కథలో డ్రామా & సాగదీత ఎక్కువ. ఇంటర్వెల్ తర్వాత ట్విస్టులు ఎక్కువ. 'పొలిమేర 3' కోసం బలమైన కథను సిద్ధం చేసుకునే క్రమంలో 'పొలిమేర 2' కథలో సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను ఒక స్థాయికి పరిమితం చేశారు. 'మా ఊరి పొలిమేర' అభిమానులు సైతం ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే శాటిస్‌ఫై అవుతారు.  


Also Read : 'మా ఊరి పొలిమేర 2' ఆడియన్స్ రివ్యూ : ఆ ట్విస్టులు, నేపథ్య సంగీతం సూపర్ అంటున్నారండోయ్!