సినిమా రివ్యూ: 'కథ కంచికి మనం ఇంటికి'
రేటింగ్: 1.5/5
నటీనటులు: త్రిగుణ్, పూజితా పొన్నాడ, 'మిర్చి' హేమంత్, 'గెటప్' శీను, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి తదితరులు
మాటలు: శ్రీనివాస్ తేజ
సినిమాటోగ్రఫీ: వై.ఎస్. కృష్ణ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాత: మోనిష్ పత్తిపాటి
దర్శకత్వం: చాణిక్య చిన్న
విడుదల తేదీ: ఏప్రిల్ 8, 2022


యువ హీరో త్రిగుణ్ (Trigun aka Arun Adith) మంచి నటుడు. వరుసగా సినిమాలు చేస్తున్నారు గానీ వరుస విజయాలే దక్కడం లేదు. అడల్ట్ హారర్ కామెడీ 'చీకటి గదిలో చితకొట్టుడు'తో విజయం అందుకున్నారు. అడల్ట్ కామెడీ కావడంతో కొంత మంది విమర్శించారు. అందుకని, ఈసారి క్లీన్ ఫ్యామిలీ హారర్ కామెడీ సినిమా 'కథ కంచికి మనం ఇంటికి' చేశారు. ఈ సినిమా (Katha Kanchiki Manam Intiki Review) ఎలా ఉంది? హీరోయిన్ పూజితా పొన్నాడ (Pujita Ponnada), ఇతర నటీనటులు ఎలా చేశారు?


కథ: తన పేరులో తప్ప జీవితంలో ప్రేమ లేదని, పెళ్లి కావడం లేదని ఫీలయ్యే యువకుడు ప్రేమ్ (త్రిగుణ్). బెట్టింగ్ అంటే చాలు... ఎంత రిస్క్ అయినా టేకప్ చేసే అమ్మాయి అమ్మాయి దీక్ష (పూజితా పొన్నాడ). కన్నయ్య ('గెటప్' శీను) దొంగ. నంది ('మిర్చి' హేమంత్) రైటర్. వేర్వేరు కారణాల చేత ఈ నలుగురూ ఓ రాత్రి స్మశానానికి వెళతారు. భయపడుతూ ఒకరికొకరు పరిచయం అవుతారు. తర్వాత స్మశానం పక్కనున్న బంగ్లాలోకి వెళతారు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది? ఆమెలోకి ఎవరెవరి ఆత్మలో ప్రవేశిస్తూ ఈ నలుగురినీ ముప్పు తిప్పలు పెడతాయి. అసలు, ఆ అమ్మాయి ఎవరు? ఆమెలో ఆత్మలు ఎవరివి? ఆత్మల పగ ఎవరి మీద? ఆ ఆత్మల నుంచి, బంగ్లా నుంచి ఆ నలుగురూ ఎలా బయటపడ్డారు? అనేది మిగతా సినిమా.


విశ్లేషణ: మెజారిటీ హారర్ సినిమాల్లో ఫార్ములా ఒక్కటే ఉంటుంది. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు ఆత్మగా మారడం... ఆ తర్వాత పగ తీర్చుకోవడం... దెయ్యాన్ని చూసి మనుషులు భయపడే సన్నివేశాల నుంచి వినోదం పండించడం! ఫార్ములా రొటీన్ అయినా... ఫన్ వర్కవుట్ అయితే ప్రేక్షకులు పాస్ మార్కులు వేసేస్తారు. ప్రేక్షకులకు ఆ అవకాశం దర్శకుడు ఇవ్వలేదు. అసలు కథ, హారర్ ఎలిమెంట్ ఇంటర్వెల్ తర్వాత గానీ ప్రేక్షకులకు చూపించలేదు.


'కథ కంచికి మనం ఇంటికి' ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ బావున్నాయి. ఇంటర్వెల్ ముందు కాసేపు నవ్వించారు. పతాక సన్నివేశాల్లో ఒక స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. దైవశక్తి, దుష్టశక్తి, ఆత్మల శక్తి అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా చూసేలా తీశారు. అయితే ఆ రెండు ఎపిసోడ్స్ మినహా మిగతా సన్నివేశాలు మినిమమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాయి. హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్ సీన్స్ అయితే అదో రకంగా ఉన్నాయి. ప్రెగ్నెంట్ అయిన లేడీని పెళ్లి చేసుకోవడానికి హీరో రెడీ అయ్యే సీన్లు వెగటు పుట్టించాయి. 'మీరు ఫ్రెష్, నేను తోమేసిన బ్రష్' అంటూ డైలాగుల్లో ప్రాస కోసం రైటర్ నానా ప్రయాస పడ్డారు. మ్యూజిక్ మినహా మిగతా టెక్నికల్ టీమ్ వర్క్ అసలు బాలేదు. కెమెరా వర్క్ షార్ట్ ఫిల్మ్స్‌లో ఇంకా బావుంటుంది. సినిమా ప్రారంభంలో వచ్చే పాటలో సాహిత్యం బావుంది. చిత్రీకరణ కూడా! పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతాన్ని కూడా అభినందించాలి.


Also Read: 'గని' సినిమా రివ్యూ: బాక్సింగ్ పంచ్ అదిరిందా? లేదా?


క్లైమాక్స్‌లో త్రిగుణ్ నటన బావుంది. కామెడీ సన్నివేశాల్లో హుషారుగా చేశారు. కానీ, రైటింగ్‌లో పంచ్ మిస్ అయ్యింది. దాంతో హీరో ఏమీ చేయలేకపోయారు. పూజితా పొన్నాడ గ్లామర‌స్‌గా కనిపించారు. 'గెటప్' శీను, 'మిర్చి' హేమంత్ తమదైన శైలి నటనతో నవ్వించే ప్రయత్నం చేశారు. కొంతవరకూ సక్సెస్ అయ్యారు. మహేష్ మంజ్రేకర్‌ను సరిగా వాడుకోలేదు. సప్తగిరి ఓ సన్నివేశంలో కనిపించారు. ముందు చెప్పినట్టు ప్రీ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ ఎపిసోడ్ బావున్నాయంతే! వాటి కోసం సినిమాకు వెళ్లాలని అనుకుంటే... మీ ఇష్టం! నటుడిగా అడల్ట్ కామెడీ ఫిల్మ్స్ మాత్రమే కాదు, క్లీన్ కామెడీ సినిమాలు కూడా చేయగలడని త్రిగుణ్ పేరు తెచ్చుకుంటారు. చితకొట్టుడుతో అతడి మీద పడిన మచ్చ పోతుంది. కానీ, విజయం మాత్రం కష్టమే.


Also Read: 'శర్మాజీ న‌మ్‌కీన్‌' రివ్యూ: రిషి కపూర్ ఆఖరి సినిమా - వయసుతో పనేంటి?



Also Read: 'మిషన్ ఇంపాజిబుల్' రివ్యూ: తాప్సీ పన్ను నటించిన ఈ సినిమా ఎలా ఉంది?