సినిమా రివ్యూ: 'గని'
రేటింగ్: 2.25/5
నటీనటులు: వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర తదితరులు
మాటలు: అబ్బూరి రవి
సినిమాటోగ్రఫీ: సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్
సంగీతం: ఎస్. తమన్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాతలు: అల్లు బాబీ (వెంకటేష్), సిద్ధు ముద్ద
దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి
విడుదల తేదీ: ఏప్రిల్ 8, 2022
వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'గని' (Ghani Movie). ఇందులో ఆయనది బాక్సర్ రోల్. సినిమా, క్యారెక్టర్ కోసం ప్యాక్డ్ బాడీ బిల్డ్ చేశారు. ఆల్రెడీ 'తమ్ముడు'లో పవన్ కల్యాణ్ బాక్సర్ రోల్ చేశారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎలా చేశారు? ఈ మధ్య తెలుగులో స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. బాక్సింగ్ / మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో 'తమ్ముడు', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి', 'గురు'తో పాటు కొన్ని చిత్రాలు వచ్చాయి. మరి, 'గని' (Ghani Review) ఎలా ఉంది?
కథ: గని (వరుణ్ తేజ్) బాక్సర్. నేషనల్ ఛాంపియన్ కావాలనేది అతడి కల. అతడి చిన్నతనంలో తండ్రి విక్రమాదిత్య (ఉపేంద్ర) నేషనల్స్ కి వెళతాడు. ఓడిపోతాడు. పైగా, డ్రగ్స్ తీసుకున్నాడని తేలుతుంది. దాంతో అందరూ గని, అతడి తల్లిని అందరూ నానా మాటలు అంటారు. హైదరాబాద్ వదిలి విశాఖ వెళతారు. తన తండ్రి వల్ల పోయిన పరువును మళ్లీ తిరిగి రావాలంటే... ఇండియన్ బాక్సింగ్ లీగ్ (ఐబిఎల్)లో విజేతగా నిలవాలని అనుకుంటాడు. తండ్రిని ద్వేషిస్తూ ఉంటాడు. బాక్సింగ్ నేర్చుకుంటున్నట్టు తల్లి (నదియా)కి కూడా చెప్పడు. ఆమెకు విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఛాంపియన్ కావాలనే గని కల నెరవేరిందా? లేదా? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? తండ్రి విక్రమాదిత్య గురించి ఏం తెలిసింది? చివరకు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: నటీనటులకు కొన్ని కథలు ప్లస్ అవుతాయి. వైవిధ్యమైన, విలక్షణ కథలు లభించడంతో ప్రతిభ చూపించే అవకాశం లభిస్తుంది. మరికొన్ని కథలకు నటీనటులు ప్లస్ అవుతారు. సాధారణ కథలను తమ నటనతో చిత్రాన్ని ఓ మెట్టు పైకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచుతాయి. 'గని' రెండో కేటగిరీకి చెందిన సినిమా. రెగ్యులర్ ఫార్మాట్ కథకు ప్రతిభావంతులైన నటీనటులు, ఉన్నత నిర్మాణ విలువలు తోడు కావడంతో తెర నిండుగా ఉంది.
'గని' కథకు వస్తే... కొత్తదనం ఏమీ లేదు. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అసలు ఆకట్టుకోదు. సినిమా నుంచి ఆ ట్రాక్ తీసేసినా... పెద్దగా నష్టం ఏమీ ఉండదు. ఇంటర్వెల్‌లో 'గేమ్ బిగిన్స్' అని వేశారు. నిజానికి, 'గని' అసలు కథ కూడా ఇంటర్వెల్ దగ్గర మొదలైంది. అలాగని, సెకండాఫ్‌లో కూడా కొత్తదనం ఏమీ లేదు. ప్రేక్షకుల ఊహలకు అనుగుణంగా ఉంటుంది. కాకపోతే... ఫస్టాఫ్‌తో పోలిస్తే బెటర్. అబ్బూరి రవి రాసిన సంభాషణలు కొన్ని సన్నివేశాలకు బలంగా నిలిచాయి. డెప్త్ ఉన్న డైలాగ్స్ రాశారు.
కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా తన తొలి సినిమాకు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా రొటీన్ ఫార్ములా కథ రాసుకున్నాడు. అయితే... రొటీన్ కథతో ఆడియన్స్‌ను మెప్పించడం అంత సులభం కాదు. అది అసలైన రిస్క్. కథతో కాకుండా టేకింగ్‌తో స్క్రీన్ ముందు ఉన్న ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలి. ఆ విషయంలో కిరణ్ జస్ట్ పాస్ మార్కులు స్కోర్ చేశారు. కనీసం స్క్రీన్ ప్లే విషయంలో కూడా సర్‌ప్రైజ్ చేయలేదు. దర్శకుడికి సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి విలియమ్స్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. విజువల్ పరంగా సినిమా బావుంది. సినిమాలో పాటలకు స్కోప్ లేదు. కానీ, ఉన్న పాటల్లో సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి పాడిన 'రోమియోకి జూలియట్ లా...' పాట బావుంది. 'కొడితే...' పాటకు తమన్నా డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూస్తున్నంత సేపూ అర్థం అవుతుంది.
నటుడిగా వరుణ్ తేజ్ పంథా ముందు నుంచి వచ్చిన విభిన్నమే. ఓ జానర్, ఓ తరహా కథలకు పరిమితం కాకుండా కొత్తదనం కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఆ క్రమంలో స్పోర్ట్స్ బేస్డ్ జానర్ సినిమా చేశారు. ఫస్టాఫ్ అంతా లవ్ స్టోరీ, రొటీన్ సీన్స్ కావడంతో నటుడిగా ఆయన పెద్దగా చేసేది ఏమీ లేదు. ఈజీగా చేసుకుంటూ వెళ్లారు. ఇంటర్వెల్ తర్వాత, ముఖ్యంగా క్లైమాక్స్, అంతకు ముందు ఓ అరగంట కొత్త వరుణ్ తేజ్ కనిపిస్తారు. నటనతో మెప్పించారు. ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి, జగపతి బాబులవి రొటీన్ క్యారెక్టర్స్. ఆయా పాత్రల్లో వాళ్ళు నటించడం ప్లస్ అయ్యింది. సయీ మంజ్రేకర్ పాత్రకు కథలో ఇంపార్టెన్స్ లేదు. ఆమె నటనలో ఇంటెన్స్ లేదు. కమర్షియల్ కథానాయిక ఎలా ఉండాలో? అలా ఉన్నారు! వరుణ్ తేజ్‌తో ఫేస్ టు ఫేస్ సీన్స్‌లో నవీన్ చంద్ర బాగా చేశారు. సీనియర్ నరేష్, 'స్వామి రారా' సత్య పాత్రలు పెద్దగా నవ్వించలేదు.
Also Read: 'శర్మాజీ నమ్‌కీన్' రివ్యూ: రిషి కపూర్ ఆఖరి సినిమా - వయసుతో పనేంటి?
రొటీన్ కథ, కథనాలతో సినిమా తీసినప్పటికీ... 'గని'లో మంచి కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఉంది. తల్లి దగ్గర నిజం దాచిన ఓ కుమారుడు పడే ఆవేదన ఉంది. నిజానికి, అబద్ధానికి మధ్య కథానాయకుడు పడే మానసిక సంఘర్షణ ఉంది. సెకండాఫ్‌లో బెట్టింగ్ మాఫియాను భాగం చేసిన తీరు పర్వాలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే... ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే టైమ్ పాస్ అవుతుంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్ వేల్యూస్ ఆకట్టుకుంటాయి. ఈ వారం మరో పెద్ద సినిమా విడుదల లేకపోవడం 'గని'కి ప్లస్ పాయింట్.
Also Read: 'మిషన్ ఇంపాజిబుల్' రివ్యూ: తాప్సీ పన్ను నటించిన ఈ సినిమా ఎలా ఉంది?