Sree Vishnu and Ritu Varma's Swag Movie Review In Telugu: 'రాజ రాజ చోర'తో శ్రీ విష్ణు భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా దర్శకుడు హసిత్ గోలితో ఆయన చేసిన తాజా సినిమా 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో శ్రీవిష్ణు నాలుగు రోల్స్ చేశారు. రీతూ వర్మ కథానాయికగా... మీరా జాస్మిన్, దక్షా నగార్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 'సామజవరగమన', 'ఓం భీం బుష్' తర్వాత శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ ఇచ్చిందా? లేదా? ఎలా ఉందో చూడండి.
కథ (Swag Movie Story): భవభూతి (శ్రీవిష్ణు) ఎస్సైగా రిటైర్ అవుతాడు. అయితే, అతనికి రావాల్సిన పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ రాకుండా ధనలక్ష్మి అనే ఓ మహిళా అధికారి అడ్డుకుంటుంది. డబ్బులు రాలేదని బాధ పడుతున్న సమయంలో తాను శ్వాగణిక వంశంలో జన్మించిన వ్యక్తి అని, వారసత్వంగా తనకు కోట్ల రూపాయల ఆస్తి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఆస్తి కోసం వంశవృక్ష నిలయానికి వెళతాడు భవభూతి. అతనికి అక్కడ అనుభూతి (రీతూ వర్మ) కనిపిస్తుంది. శ్వాగణిక వంశ వారసులు తమ వారసత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన రాగి పలక ఆమె దగ్గర ఉంటుంది.
శ్వాగణిక వంశ పారంపర్య పలక అనుభూతి దగ్గరకి ఎలా వచ్చింది? సింగరేణి అలియాస్ సింగ (శ్రీవిష్ణు) ఎవరు? ఒకే రూపురేఖలతో ఉన్న భవభూతి, సింగ మధ్య సంబంధం ఏమిటి? వాళ్లిద్దరికి ఆస్తి రాకుండా చేసిన యయాతి (శ్రీ విష్ణు) ఎవరు? అతను ఏం చేశాడు? 1551 ఏళ్ల క్రితం మగాళ్లని తన కాలి కింద చెప్పుల కింద చూసిన వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ)ని మాయ చేసి పురుషాధిక్యం పెంచడానికి శ్వాగణిక వంశ మహారాజు భవభూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? రేవతి (మీరా జాస్మిన్), విభూతి ఎవరు? చివరకు ఆస్తి ఎవరికి దక్కింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Swag Review Telugu): పురుషాధిక్యత - స్త్రీ సాధికారత, మాతృస్వామ్యం - పితృస్వామ్యం... సమాజంలో వీటి గురించి చర్చ జరుగుతుంది. వీటితో సంబంధం లేకుండా, 'లింగ వివక్ష లేకుండా అందరినీ సమానత్వంతో చూడటమే మానవత్వం' అని సందేశం ఇచ్చే సినిమా 'స్వాగ్'. అంతకు మించి ఎక్కువ చెబితే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది.
హసిత్ గోలిలో తెలుగు మీద మంచి పట్టు ఉంది. సంభాషణల్లో అది కనిపించింది. మాటల రచయితగా ప్రతిభ చూపించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకు మేకింగ్ మీద గ్రిప్ ఉంది. సన్నివేశాలు తీసిన విధానంలో, సంగీత దర్శకుడి నుంచి పాటలు తీసుకోవడంలో, ఆర్టిస్టుల చేత పెర్ఫార్మన్స్ చేయించడంలో దర్శకుడిగా హసిత్ గోలి మెరిసిన సన్నివేశాలు ఉన్నాయి. అయితే, కథకుడిగా ఫెయిలయ్యారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిన కథను స్క్రీన్ ప్లేతో కంగాళీ చేశారు. ఈ కథను ట్విస్టులతో... ఒక్కొక్కరి ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తూ... స్క్రీన్ ప్లేతో మేజిక్ చేయాలని ట్రై చేశారు. కానీ, అది వర్కవుట్ కాలేదు. ఇటీవల రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఓ చిన్న సినిమాలో ఇటువంటి సందేశాన్ని ఇచ్చారు.
'స్వాగ్' ప్రారంభం బావుంది. సినిమా ఆసక్తికరంగా మొదలైంది. ఇంటర్వెల్ వరకు కథ ఏమిటి? అనేది అర్థం కాదు. అసలు కథ అంతా ఇంటర్వెల్ తర్వాతే ఉంది. ఆ మాటకు వస్తే... ఇంటర్వెల్ తర్వాతే నటుడిగా శ్రీవిష్ణు గానీ, దర్శక రచయితగా హసిత్ గోలి గానీ అద్భుతమైన పనితీరు చూపించినది. వివేక్ సాగర్ స్వరాలు, నేపథ్య సంగీతం బావున్నాయి. రెట్రో సాంగ్ ట్యూన్ చేయడంలో ఆయన టాలెంట్ కనబడుతుంది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ కృషి వల్ల స్క్రీన్ మీద డిఫరెంట్ టైమ్ లైన్స్ చూపించినప్పుడు వేరియేషన్ బాగా కనిపించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా రాజీ పడలేదు. ఈ కథపై అంత ఖర్చు చేయడం గ్రేట్.
యంగ్ హీరోల్లో పెర్ఫార్మన్స్ పరంగా ఎటువంటి రోల్ అయినా చేయగలడని శ్రీవిష్ణు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఆయన కామెడీ చేయగలరు, ఎమోషన్స్ కూడా అంతే అద్భుతంగా పండించగలరు. అయితే... 'స్వాగ్' ప్రేక్షకుల్లో ఆయనపై ఇంకా గౌరవం పెంచుతుంది. అందుకు కారణం విభూతి రోల్. ఇందులో శ్రీవిష్ణు ఐదు రోల్స్, ఏడు లుక్కుల్లో కనిపిస్తారు. అయితే విభూతి మాత్రం ప్రత్యేకం. అంతకు మించి ఎక్కువ చెప్పలేం. చెబితే ట్విస్ట్ రివీల్ అవుతుంది. విభూతి మినహా మిగతా పాత్రలు చేయడం శ్రీవిష్ణుకు కొత్త కాదు. కానీ, ఎస్సై భవభూతి పాత్రకు చెప్పిన డబ్బింగ్, ఆ గెటప్ సరిగా కుదరలేదు. ఇరిటేట్ చేసింది. ఆ విషయంలో దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
Also Read: ఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌కు తానొక మంచి ఆప్షన్ అని 'స్వాగ్'తో దర్శక రచయితలకు మీరా జాస్మిన్ సంకేతాలు పంపించారు. ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్, నటన బావున్నాయి. ఆ పాత్రకు హుందాతనం తెచ్చాయి. రెండు పాత్రల్లో రీతూ వర్మ చక్కగా నటించారు. శ్రీవిష్ణుతో రొమాంటిక్ సీన్స్, కీలకమైన సన్నివేశాల్లో దక్షా నాగర్కర్ కనిపించారు. ఈ సినిమాకు ఆవిడ గ్లామర్ డాల్ అని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత రవిబాబుకు ఫుల్ లెంగ్త్ రోల్ లభించింది. గోపరాజు రమణతో ఆయన సన్నివేశాలు, శ్రీవిష్ణు - గెటప్ శ్రీను మధ్య సన్నివేశాలు కొన్ని నవ్వించాయి.
స్వాగ్... మంచి సందేశాత్మక చిత్రమిది. ప్రస్తుత సమాజానికి అవసరమైన అంశాన్ని చాలా సున్నితంగా, చక్కగా చెప్పారు. ఆ సందేశాన్ని వినోదంతో చెప్పాలని చేసిన ప్రయత్నం అభినందనీయం. కానీ, ప్రేక్షకుడిని కన్‌ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే... ఓవర్ ది బోర్డు క్యారెక్టర్స్ ఆ సందేశాన్ని, వినోదాన్ని డౌన్ చేశాయి. అయితే... ఆ సందేశం కోసం, శ్రీవిష్ణు కొత్త అవతార్ కోసం ఒకసారి థియేటర్లకు వెళ్లవచ్చు.