Vettaiyan Movie Case : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో కొంత మంది మధురై కోర్టులో కేసు వేశారు. ‘వేట్టయాన్’ ప్రివ్యూ లోని డైలాగులు అభ్యంతకరంగా ఉన్నాయని, ఎన్ కౌంటర్లను ప్రోత్సహించేలా ఉన్నాయని వెల్లడించారు. ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
‘వేట్టయాన్’ మూవీపై న్యాయస్థానం కీలక నిర్ణయం
త్వరలో ఈ ‘వేట్టయాన్’ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఈ నెల 20న ‘వేట్టయాన్’ ప్రివ్యూ పేరుతో మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులోని కొన్ని డైలాగుపై అభ్యంతరం చెప్తూ కొంత మంది మధురై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. “అత్యంత భయంకరమైన క్రిమినల్స్‌కు భయపడకుండా ఎన్‌కౌంటర్ చేయడం వల్లే వీళ్లు హీరోలు అయ్యారు”! అని చెప్పే డైలాగ్ పై పిటీషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ డైలాగ్ ఎన్ కౌంటర్లను ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు. ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిపారు. ఈ డైలాగులను సినిమా నుంచి తొలగించాలన్నారు. లేదంటే మ్యూట్ చేయాలని కోరారు. ఈ కేసుపై న్యాయస్థానం విచారణ జరిపింది. సెన్సార్ బోర్డుతో పాటు లైకా ప్రొడక్షన్స్ కు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ వివరణను బట్టి తదుపరి విచారణ ఉంటుందని న్యాయస్థానం వెల్లడించింది. సినిమాపై మధ్యంతర నిషేధం విధించాలన్న విజ్ఞప్తిని మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది.
ఆకట్టుకుంటున్న ‘వేట్టయాన్’ ట్రైలర్
‘వేట్టయాన్’ విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘వేట్టయాన్’ ట్రైలర్ ను విడుదల చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రైలర్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపించాయి. రజనీకాంత్ డైలాగ్ లు హైలెట్ గా నిలిచాయి. “క్రైమ్ క్యాన్సర్ లాంటిది. దానిని పెరగనివ్వకూడదు. నన్ను ఏ పోస్టులో తిప్పి కొట్టినా నేను మాత్రం పోలీస్ వాడినే సార్. నా నుంచి వాడిని కాపాడటం ఎవరి వల్ల కాదు” అనే డైలాగులు అలరించాయి. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ పాత్రలను చక్కగా ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ల డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. రజనీకాంత్ తనదైన స్టైల్, మేనరిజంతో ఆకట్టుకున్నారు. పోలీస్ వ్యవస్థకు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు మధ్య జరిగే వార్ ను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.