చులకన...
ఆడ పిల్లలు అంటే చులకన...
అందులోనూ హీరోయిన్లు అంటే ఇంకా చులకన...
ప్రేక్షకులే కాదు... ప్రభుత్వ పెద్దలలోనూ అదే చులకన...
బహుశా... ఆడదానికి ఆడది శత్రువు అంటే ఇదేనేమో!?


అక్కినేని నాగ చైతన్య, సమంత (Samantha) విడాకుల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు కొండా సురేఖ. ఆవిడ చెప్పిన మాటల్ని ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు. ఇంకోసారి వాటిని ఇక్కడ ప్రస్తావించాలని అనుకోవడం లేదు. కానీ, గౌరవప్రదమైన పదవిలో ఉన్న కొండా సురేఖ ఆ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టడం వెనుక అంతర్యం ఏమిటి? ఫక్తు రాజకీయం తప్ప మరొకటి ఏముంది?


కొండా సురేఖ ప్రజల్లో ఉన్న మనిషి. పలుకుబడి ఉన్న మహిళ. అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను ఇరుకున పెట్టడానికి కాకపోతే ఇప్పుడు ఎందుకు ఆయనకు సమంతకు ముడిపెట్టి ఈ వ్యాఖ్యలు చేయడం? విడాకులు తీసుకున్నప్పుడు సురేఖ ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఆమె అధికారంలో లేకపోవచ్చు... కానీ, సాటి మహిళకు అండగా గళం వినిపించే అంత ధైర్యం లేదా? అధికారంలో ఉన్న వ్యక్తులను ప్రశ్నించే గుణం లేదా? లేదంటే ఆ సమయంలో ఎవరు ఎటు పోతే నాకెందుకు అని ఊరుకున్నారా? ఇప్పుడు తనపై ట్రోలింగ్ వచ్చేసరికి కేటీఆర్ మీద విమర్శలు చేశారు. లేదంటే ఆ విషయం వదిలి ఊరుకునేవారా? తనకు అవమానం జరిగితే తప్ప వేరొక మహిళకు జరిగిన అన్యాయం కొండా సురేఖకు గుర్తు రాలేదా?


కొండా సురేఖ కేవలం కేటీఆర్ మీద ఆరోపణలు చేయలేదు. తెలుగు చిత్రసీమతో పాటు తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలో ఎంతో గౌరవం, మన దేశ ప్రజలలో ఎంతో పలుకుబడి ఉన్న అక్కినేని కుటుంబం మీద ఆవిడ అబాండాలు వేశారు. అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఆస్తిలో ఎన్ కన్వెన్షన్ (N Convention) విలువ చాలా అంటే చాలా చాలా చాలా తక్కువ. ఆ విలువ ఎంతన్నది పక్కన పెట్టండి. ఆస్తి కోసం విలువల్ని అక్కినేని ఫ్యామిలీ పణంగా పెడతారని చౌకబారు దిగజారిన మాటలు కొండా సురేఖ వ్యాఖ్యల్లో ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీ పరువు ప్రతిష్టలను కించ పరిచే విధంగా మాత్రమే కాదు... ఇండస్ట్రీలో హీరోయిన్లపై, ఆ మాటకు వస్తే ఆడపిల్లల మీద ఆవిడ మనసులో ఎటువంటి గౌరవం లేదనే విషయం అర్థమవుతుంది.


సమాజంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన స్థానంలో, ప్రభుత్వంలోని ఒక కీలక పదవిలో కొండా సురేఖ ఉన్నారు. మహిళల మీద ఎవరైనా విమర్శలు చేస్తే, మహిళ గౌరవానికి భంగం వాటిల్లితే ఖండించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ఒక మహిళగా సాటి మహిళకు అండగా నిలవాలని ప్రతి ఒక్కరూ ఆశించేది. అయితే... ఓ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న మహిళా మంత్రి ఇంకెంత బాధ్యతగా ఉండాలి? అటువంటివి ఏమీ లేకుండా అక్కినేని కుటుంబాన్ని, సమంతను చులకన చేసేలా కొండా సురేఖ మాట్లాడడం ఎంతవరకు సబబు? ఎందుకు అంత దూర దృష్టితో ఆవిడ ఆలోచించ లేకపోయారు? 


పోరు గడ్డ (వరంగల్) నుంచి ప్రభుత్వంలోని పదవి వరకు కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ప్రజలకు తెలుసు. కానీ, కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు వారి కుటుంబ ప్రతిష్ట మీద మచ్చ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మహిళగా ఆమె స్థాయిని దిగజార్చాయని చెప్పడంలోనూ సందేహం అవసరం లేదు. పదవి లేని సమయంలో సమంతకు కొండా సురేఖ ఎందుకు అండగా నిలబడలేదు? ఆ సంగతి వదిలేద్దాం... అత్యాచార ఘటనలలో బాధిత మహిళ పేరు బయటకు చెప్పకూడదని న్యాయస్థానాలు చెబుతాయి కదా. కోర్టుల వరకు ఎందుకు? సాటి మనిషిగా బాధితురాలి పేరు చెబితే ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మనమే ఆలోచిస్తాం కదా! ఆ విచక్షణ కొండా సురేఖకు ఎందుకు లేకుండా పోయింది? ఒక్క క్షణం కొండా సురేఖ వెర్షన్ నిజమే అని అనుకుందాం... అప్పుడు ఆవిడ చెప్పిన మాటల ప్రకారం సమంత బాధితురాలే కదా! సమంత పేరు చెప్పకూడదని ఇంగితం ఎందుకు లేకుండా పోయింది? 


ఇవాళ సమంత మీద విమర్శలు చేశారు. నిన్న మొన్నటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ మీద కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు. లేదంటే ఓ పార్టీకి చెందిన డిజిటల్ టీమ్ కేటీఆర్, రకుల్ ఫోటోలతో మీద ట్రోలింగ్ నడిపింది. రేపు ఇంకొక మహిళ మీద చేయరనే గ్యారెంటీ ఏమిటి? తెలంగాణ రాజకీయాలకు ప్రతిసారి ఎవరో ఒక మహిళ బలి పశువు కావాలా? మీ రాజకీయాలకు మరో మహిళను ఎందుకు పావుగా వాడుతున్నారు? బలి పశువు చేస్తున్నారు? ఆడపిల్లల పేర్లు తీయకుండా మీరు రాజకీయాలు చేయలేరా? ఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన?? 


ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలలో హీరోయిన్లతో ముడిపెడుతూ విమర్శలు చేయడం తప్ప ఏనాడైనా ఆధారాలు చూపించారా? ఓ సాటి మహిళగా మరొక మహిళ మీద ఇటువంటి విమర్శలు చేసే ముందు సమాజంలోకి ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నాం? అనేది ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? లేదంటే రాజకీయాలలో వ్యభిచారం ఉందని పరోక్షంగా అంగీకరిస్తున్నారా? తప్పండి... మీ రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడానికి మహిళలను బలి పశువులు చేయడం చాలా తప్పు! 


గంటకు ఓ అత్యాచారం, రోజుకు ఒక హత్యాచారం... దేశంలో ఇంతేనేమో!? ఎప్పటికీ పరిస్థితులు మారవేమో!? అని కొందరు ప్రజలు అలవాటు పడొచ్చు. కానీ, ఇలా ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నేళ్లు? మహిళల మీద, ఇంకా ముక్కుపచ్చలారని చిన్నారుల మీద యదేచ్ఛగా జరిగే ఈ దాడులు?? వీటికి అడ్డుకట్ట పడదా??? అసలు లోపం ఎక్కడ ఉందని ఆలోచిస్తే... కొందరి ఆలోచనల్లో ఉందనిపిస్తుంది. కొండా సురేఖ వంటి మహిళలు చేసే అనాలోచిత, స్వార్థపూరిత రాజకీయ విమర్శల్లోనూ ఉందనిపిస్తుంది.


Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు


సమాజంలో హీరోయిన్లు అంటే చాలా చులకన భావం‌ ఉంది.‌ అత్యాచారాలకు కారణం మహిళల దుస్తుల నుంచి హీరోయిన్ల వేషధారణ వరకు అని కామెంట్ చేసే జనాలు మనలో ఉన్నారు. హీరోయిన్లు కావడానికి ముందు వారూ సమాజంలో సాటి మహిళలు అని గుర్తించండి. ప్రభుత్వాలలో ఉన్నత స్థాయిలలో ఉన్న వ్యక్తులు ఆయా హీరోయిన్ల మీద విమర్శలు చేస్తే కింది స్థాయిలో సామాన్యులు తమ ఇరుగుపొరుగు అమ్మాయిల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో ఆలోచించండి! హీరోయిన్లను తక్కువ చేసి, వాళ్లను అంగడిలో ఆటబొమ్మలుగా చిన్న చూపు చూడటం మానేసి, సాటి మహిళగా వాళ్లకు మరొక మహిళ గౌరవం ఇచ్చిన రోజున అందరిలో మార్పు మొదలవుతుంది. తప్పకుండా మొదలై తీరుతుంది.


Also Read: మిస్టర్ రాహుల్ గాంధీ... మీ నాయకుల్ని కంట్రోల్‌లో పెట్టుకోండి - కొండా సురేఖ కామెంట్స్‌పై అమల అక్కినేని ఫైర్