Amala Akkineni asks Rahul Gandhi to control his party leaders and demands an apology from Konda Surekha: అక్కినేని నాగ చైతన్య, సమంత (Samantha) విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు ప్రజలు మాత్రమే కాదు... ఆ మాటలు తెలిసిన ఇతరుల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళగా అటువంటి నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున, సమంత ఖండించిన విషయం తెలిసిందే. నాగార్జున సతీమణి, సీనియర్ కథానాయిక అక్కినేని అమల అయితే సురేఖ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కొండా సురేఖను రాక్షసిగా పేర్కొన్న అమల!
ఓ మహిళా మంత్రి రాక్షసిగా మారి... దురుద్దేశంతో కట్టు కథలు అల్లి కల్పిత ఆరోపణలు చేయడం, రాజకీయ యుద్ధం కోసం మంచి మనుషులను పావులుగా వాడుకోవడం విని నేను షాక్ అయ్యానని అక్కినేని అమల సోషల్ మీడియా వేదికగా ఒక లేఖ విడుదల చేశారు. కొండా సురేఖను ఆమె రాక్షసిగా వర్ణించారు. 


తన భర్త మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటు అని అమలా అక్కినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మేడం మినిస్టర్... ఎటువంటి సిగ్గు ఎగ్గు లేకుండా నా భర్త గురించి మంచి మర్యాద లేని వ్యక్తులు చెప్పిన కట్టు కథలను మీరు ఎలా నమ్మారు? ఇది నిజంగా సిగ్గు చేటు'' అని అమల ప్రశ్నించారు. నాయకులు తమ స్థాయి మరిచి దిగజారి నేరస్తుల తరహాలో ప్రవర్తిస్తే దేశం ఏమవుతుందని ఆవిడ ఆవేదనతో కూడిన ప్రశ్నను వ్యక్తం చేశారు. 






మిస్టర్ రాహుల్ గాంధీ... అదుపులో పెట్టుకోండి!
''మిస్టర్ రాహుల్ గాంధీజీ.. మీరు గనక మానవత్వాన్ని, మర్యాదను విశ్వసించేటట్లు అయితే మీ నాయకులను అదుపులో ఉంచుకోండి. మీ మంత్రితో నా కుటుంబానికి క్షమాపణ చెప్పించండి. ఈ దేశ పౌరులను రక్షించండి'' అని అక్కినేని అమల తన లేఖను ముగించారు.


Also Read: నా విడాకులకు, రాజకీయాలకు సంబంధం లేదు - కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత



తన విడాకులకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని సమంత సైతం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కినేని ఫ్యామిలీకి కొండా సురేఖ బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున ఏమన్నారో తెలుసుకోవడం కోసం ఈ కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.


Also Readమంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని ఖండించిన నాగార్జున... ఆయన ఏం చెప్పారంటే?