Nagarjuna Responds on Minister Konda Surekha allegation | హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ నటుడు నాగార్జునపై, ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత విడాకుల (Naga Chaitanya Samantha Divorce)కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కారణమని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. తన ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన కండీషన్లకు నాగార్జున ఒప్పుకున్నారన్నారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కొండా సురేఖ తమ వ్యక్తిగత విషయాలపై చేసిన ఆరోపణలపై నటుడు నాగార్జున ఘాటుగా స్పందించారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించిన నాగార్జున
మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల్ని నాగార్జున తీవ్రంగా ఖండించారు. ‘కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోవద్దు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ’ నటుడు నాగార్జున మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు.
రాజకీయ విమర్శలు వ్యక్తిగత విమర్శలుగా మారాయి. బీఆర్ఎస్ శ్రేణులు తనను అవమానించారని మంత్రి కొండా సురేఖ రెండు రోజుల కిందట కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళనని చూడకుండా, దారుణమైన కామెంట్లు చేశారని.. తనకు తిండి కూడా తినాలనిపించడం లేదన్నారు. కేటీఆర్ చెల్లికి ఇలా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుంతో తెలుస్తుందని సైతం అన్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు మాత్రం మహిళలపై అలాంటి వ్యాఖ్యలు, ట్రోలింగ్ దారుణమన్నారు. ఇలాంటి తప్పులు ఎవరూ చేయకూడదని సూచించారు.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాత్రం కొండా సురేఖ కన్నీళ్లపై సైతం కామెంట్స్ చేశారు. గతంలో తాను మాట్లాడిన ఉచ్చ ఆగడం లేదా అనడం, అలాంటి మాటలు గుర్తుకురాలేదా అని కేటీఆర్ అన్నారు. తమపైనే కాంగ్రెస్ శ్రేణులు ట్రోలింగ్ చేశారని పేర్కొన్నారు దాంతో మంత్రి కొండా సురేఖ మరోసారి మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ సినిమా వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేశారని, ఎంతో మంది జీవితాలు నాశనం చేశారన్నారు. కేటీఆర్ కారణంగా కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లిచేసుకోగా, మరికొందరు హీరోయిన్లు విడాకులు కూడా తీసుకున్నారంటూ బాంబు పేల్చారు. నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని కొండా సురేఖ ఆరోపించారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ డీల్ కు నాగార్జున రాజీపడ్డారని.. వీటి కారణంగా ఆ ఇంట్లో విడాకులు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు. కొండా సురేఖ రాజకీయ విమర్శలను పక్కనపెట్టి.. కొందరి జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత ఆరోపణలు చేయడం వివాదాస్పదం అవుతోంది.