Shraddha Kapoor and Rajkummar Rao's Stree 2 review in Telugu: 'ఓ స్త్రీ రేపు రా' - తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్ల క్రితం గోడల మీద కనిపించిన రాతలు. హిందీ సినిమా 'స్త్రీ' (Stree Movie)కి అది స్ఫూర్తి అని చెప్పలేం. కానీ, ఆ పాయింట్ బేస్ చేసుకుని సినిమాను తీసినట్టు ఉంటుంది. ఆరేళ్ల క్రితం వచ్చిన 'స్త్రీ' సూపర్ హిట్ సాధించింది. సీక్వెల్ 'స్త్రీ 2' (Stree 2 Movie) ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు లీడ్ రోల్స్ చేశారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా... పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా ఇతర పాత్రల్లో నటించారు. తమన్నా భాటియా ప్రత్యేక గీతం చేశారు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ హారర్ కామెడీ ఎలా ఉంది?
కథ (Stree 2 Movie Story): చందేరీలో ప్రజలు 'స్త్రీ' నుంచి విముక్తి లభించిందని సంతోషంగా జీవిస్తున్నారు. విక్కీ (రాజ్ కుమార్ రావు) మాత్రం తాను ప్రేమించిన అమ్మాయి (శ్రద్ధా కపూర్) ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నాడు. అయితే, ఆ ఊరిలో అమ్మాయిలు ఒక్కొక్కరుగా మాయం అవుతారు. 'సర్ ఖటా' (మొండెం నుంచి తల వేరుగా ఉన్న ఓ దెయ్యం) అమ్మాయిలను తీసుకు వెళుతుంది.
విక్కీ స్నేహితుడు బిట్టు (అపర్శక్తి ఖురానా) గాళ్ ఫ్రెండ్ చిట్టిని 'సర్ ఖటా' తీసుకు వెళ్లడంతో విక్కీ, బిట్టు, రుద్ర (పంకజ్ త్రిపాఠి)లకు విషయం తెలుస్తుంది. ఊరిలో అమ్మాయిలను రక్షించడం కోసం 'స్త్రీ' సాయం కోరతారు. అందుకోసం జనా... జేడీ (అభిషేక్ బెనర్జీ)ని సైతం ఊరికి తీసుకు వస్తారు. ఈ నలుగురూ కలిసి 'స్త్రీ' కోసం వెళ్లినప్పుడు ఏం జరిగింది? 'సర్ ఖటా'తో పోరాటం కోసం విక్కీ, అతను ప్రేమించిన అమ్మాయి (శ్రద్ధా కపూర్) కలిసి ఏం చేశారు? విక్కీ స్నేహితుల బృందం చందేరీని కాపాడిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Stree 2 Review Telugu Review): 'స్త్రీ' సినిమాలో చందేరీలో మగవాళ్ళను ఆడ దెయ్యం తీసుకు వెళ్లేది. 'స్త్రీ 2'కు వస్తే... మోడ్రన్ అమ్మాయిలను మాత్రమే మగ దెయ్యం తీసుకు వెళుతుంది. కాన్సెప్ట్ ట్విస్ట్ చేశారు. కథ కొద్దిగా మారిందంతే! కానీ, కామెడీలో లోటు చేయలేదు. భయపెట్టడంలో భేషజాలు చూసుకోలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేస్తూ ముందుకు వెళ్లారు దర్శకుడు అమర్ కౌశిక్.
Stree 2 Review And Rating: హారర్ కామెడీ ఫార్ములాను ఎలా డీల్ చేయాలో 'స్త్రీ 2' చూస్తే తెలుస్తుందని చెప్పవచ్చు. రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఓ సన్నివేశంలో భయపెట్టడంలో, ఎట్ ద సేమ్ టైమ్ నవ్వించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు అమర్ కౌశిక్.
సీక్వెల్ తీయడం అంత సులువు కాదు... ప్రేక్షకులు అందరికీ తెలిసిన క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లు ఉన్నప్పుడు తదుపరి సన్నివేశం మీద గానీ, తర్వాత తెరపై ఏం జరుగుతుంది? అని క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో గానీ దర్శక రచయితలు వర్క్ ఎక్కువ చేయాలి. అమర్ కౌశిక్ అండ్ టీమ్ ఆ విషయంలో మంచి వర్క్ చేసింది. రెగ్యులర్ హారర్ మూమెంట్ అయినా సరే... స్టార్టింగ్ సన్నివేశం జనాల్ని భయపెట్టింది. అందుకు కారణం... కెమెరా వర్క్, సౌండ్ డిజైన్, డైరెక్షన్! పర్ఫెక్ట్ టెక్నికల్ అవుట్ పుట్ రావడంతో పాటు ఫెంటాస్టిక్ ఆర్టిస్టులు ఉండటంతో ఫస్టాఫ్ ఎప్పుడు ముగిసిందనేది తెలియదు.
'స్త్రీ 2' హారర్ సన్నివేశంతో మొదలవుతుంది. ఆ తర్వాత కాసేపు పంకజ్ త్రిపాఠి సాంగ్, రాజ్ కుమార్ రావు క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అపర్శక్తి ఖురానా సీన్లు సోసోగా ఉన్నాయి. ఒక్కసారి చిట్టి మాయమైన తర్వాత సన్నివేశాల్లో వేగం పెరిగింది. కథ ముందుకు వెళ్లలేదు. కానీ, తెరపై వచ్చే సన్నివేశాలు అయితే నవ్వించాయి. లేదంటే భయపెట్టాయి. ఎప్పటికప్పుడు కథలో కొత్త క్యారెక్టర్లను లేదా ఆల్రెడీ తెలిసిన ముఖాలను తీసుకు వస్తూ సర్‌ప్రైజ్ చేశారు దర్శక రచయితలు.
దెయ్యం కోరుకునేది ఏంటి? దెయ్యానికి అంతం చేయడానికి ఏం చేయాలి? వంటివి తెలిశాక సినిమాలో వేగం తగ్గింది. మహిళలు అందరూ తమ దుస్తులు ఆల్టరేషన్ కోసం రాజ్ కుమార్ రావు దగ్గరకు వచ్చే సన్నివేశాలతో పాటు ముందు వెనుక అర గంట సేపు సినిమా నెమ్మదించింది. దెయ్యాన్ని అంతం కోసం ఏం చేయాలో తెలిశాక వచ్చే పాట నవ్వించలేదు సరికదా నిడివి పెంచింది. ఊరి జనాల్ని తన అధీనంలోకి దెయ్యం తీసుకునే సన్నివేశాలు అంత కన్వీన్సింగ్‌గా అనిపించలేదు. అక్కడ ఏనుగు సన్నివేశం 'హనుమాన్ జంక్షన్'లో ఆవు సన్నివేశాన్ని తెలుగు ప్రేక్షకులకు గుర్తు చేసే అవకాశం ఉంది. సర్ ఖటా కోటలోకి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు అబ్బుర పరుస్తాయి.
టెక్నికల్ పరంగా 'స్త్రీ 2' హై స్టాండర్డ్స్‌లో ఉంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ వల్ల సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళ్ళింది. సన్నివేశంలో టెన్షన్ క్రియేట్ చేయడంలో బాగా హెల్ప్ అయ్యింది. కెమెరా వర్క్, వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. పంచ్ డైలాగులు భలే కుదిరాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
హిందీ ప్రేక్షకులకు 'స్త్రీ' అంటే శ్రద్ధా కపూర్! ఆ పాత్రలో మరోసారి అద్భుతమైన నటనతో ఆవిడ ఆకట్టుకున్నారు. కేవలం తన కళ్లతో నటించిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఎండ్ క్రెడిట్స్ పాటలో శ్రద్ధా కపూర్ అందం మెస్మరైజ్ చేస్తుంది. రాజ్ కుమార్ రావు నవ్వించారు, ఎమోషనల్ సన్నివేశాలు అంతే చక్కగా చేశారు. జనా... జేడీ పాత్రలో అభిషేక్ బెనర్జీ ఆడియన్స్ అందరికీ పెద్ద రిలీఫ్. ఆయన నటన, ఆ సన్నివేశాలకు నవ్వకుండా ఉండటం కష్టం. పంకజ్ త్రిపాఠి నటన బావుంది.
తమన్నా భాటియా ప్రత్యేక గీతం 'స్త్రీ 2' విడుదలకు ముందు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. యూట్యూబ్, సోషల్ మీడియాలను షేక్ చేసింది. సినిమాలోనూ ఆ పాట బావుంది. అది కాకుండా రెండు మూడు సన్నివేశాల్లో ఆమె కనిపిస్తారు. 'భేడియా'గా వరుణ్ ధావన్ అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. అయితే... అక్షయ్ కుమార్ క్యారెక్టర్ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఆ పాత్రకు ఇచ్చిన ఎండింగ్ ట్విస్ట్ ఈ ఫ్రాంచైజీలో రాబోయే మిగతా సినిమాలపై మరింత అంచనాలు పెంచింది.
Stree 2 Review In Telugu: మీకు కామెడీ కావాలా? 'స్త్రీ 2'లో కామెడీ ఉంది. మిమ్మల్ని భయపెట్టాలా? 'స్త్రీ 2'లో భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయి. మీరు థ్రిల్ అవ్వాలా? 'స్త్రీ 2'లో థ్రిల్ ఫ్యాక్టర్స్, సర్‌ప్రైజ్ మూమెంట్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో కాస్త నెమ్మదించినా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎంగేజ్ చేస్తుంది. నవ్విస్తూ భయపెడుతుంది. భయపెడుతూ నవ్విస్తుంది. అదీ 'స్త్రీ 2' స్పెషాలిటీ.
Also Read: కమిటీ కుర్రోళ్ళు రివ్యూ: ఆ క్లైమాక్స్ పవన్ కోసమేనా - నిహారిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?