తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ కథానాయకుడు కార్తీ (Karthi). ఆయన హీరోగా నటించిన తాజా తమిళ సినిమా 'మెయ్యళగన్' (Meiyazhagan). తమిళనాట నేడు (సెప్టెంబర్ 27న) విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో శనివారం (సెప్టెంబర్ 28న) 'సత్యం సుందరం' (Satyam Sundaram) విడుదల అవుతోంది. '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి (Aravind Swamy) ప్రధాన పాత్రధారి. ఈ చిత్రాన్ని కార్తీ అన్న వదినలు సూర్య, జ్యోతిక నిర్మించారు.
కథ (Satyam Sundaram Movie Story): బంధువుల మధ్య ఆస్తి గొడవల్లో సత్యం... సత్యమూర్తి (అరవింద్ స్వామి), ఆయన తండ్రి రామలింగం (జయప్రకాశ్) మూడు తరాలుగా నివసిస్తున్న తమ పూర్వీకుల ఇంటిని కోల్పోతారు. దాంతో సొంతూరు వదిలేసి విశాఖకు వెళతారు. ఇరవై ఏళ్ళుగా బంధువులు అందరికీ దూరంగా తన లోకంలో ఉంటాడు సత్యం. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నాన్న కుమార్తె భువన (స్వాతి కొండె) వివాహానికి వెళతారు. అక్కడ బావా అంటూ తనను తాను పరిచయం చేసుకుంటాడు ఓ వ్యక్తి (కార్తీ). సత్యమూర్తిని అసలు వదిలిపెట్టడు. చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నిటినీ చెబుతూ ఉంటాడు.
తనను బావా అంటున్నది ఎవరో సత్యమూర్తికి గుర్తు లేదు. పేరు కూడా తెలియదు. అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ, కుదరదు. చివరకు అతని ఇంటిలో ఓ రాత్రి ఉండాల్సి వస్తుంది. అప్పుడు తన గురించి సత్యమూర్తి ఏం తెలుసుకున్నాడు? బావా అంటున్న వ్యక్తి పేరు ఏమిటి? అతని జీవితంలో సత్యమూర్తి వల్ల వచ్చిన మార్పులు ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Satyam Sundaram Movie Review Telugu): జీవితం మనిషి ఎప్పుడు ఏ దారిలో తీసుకు వెళుతుందో ఊహించడం కష్టం. నలుగురితో కలివిడిగా తిరిగే మనిషిని ఒక్కోసారి ఒంటరి చేసేస్తాయి కఠినమైన పరిస్థితులు. అయితే... మన ప్రమేయం లేకుండా మన వల్ల వేరొకరి జీవితంలో జరిగే మంచి మనల్ని హీరోలను చేస్తే? మన గురించి మనం తెలుసుకునేలా చేస్తే? తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం వస్తే? జీవితంలో సంతోషంగా జీవించడానికి డబ్బు, పేరు మాత్రమే కాదని... మన మంచి కోరుకునే మనిషి అవసరం అని చెప్పే సినిమా 'సత్యం సుందరం'.
సత్యం సుందరం... ఇదొక జీవితం! కథగా చూస్తే... వెరీ సింపుల్ పాయింట్. కానీ, ఆ సన్నివేశాలు చూస్తే... ప్రతి సన్నివేశంలోనూ ఎవరో ఒకరు తెరపై పాత్రల్లో తమను తాము చూసుకుంటారు. అంత సహజంగా, అంత హృద్యంగా 'సత్యం సుందరం' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ప్రేమ్ కుమార్. సొంత ఊరిని, ఉన్న ఇంటికి వదిలి వెళ్లలేక టీనేజ్ కుర్రాడు విలవిల్లాడుతుంటే... అతడి పాత్రతో మనమూ ప్రయాణించడం మొదలు పెడతాం. అరవింద్ స్వామి తెరపై కనిపించడానికి ముందు అతని పాత్రను, అతని గుండెల్లో బాధను అర్థం చేసుకుంటాం.
కార్తీ పాత్రను ఉద్దేశిస్తూ 'నువ్వేంట్రా ఇలా ఉన్నావ్' అని ఓ సన్నివేశంలో సత్యం (అరవింద్ స్వామి) అంటాడు. ఒక్క క్షణం మన మనసులోనూ సేమ్ ఫీలింగ్ కలుగుతుంది. ఎటువంటి కల్మషం లేకుండా అంత స్వచ్ఛమైన మనిషి మన జీవితంలోనూ ఎవరో ఒకరు ఉంటే బావుంటుందని ఫీలవుతాం. కార్తీ, అరవింద్ స్వామి పాత్రలతో ప్రేక్షకులు సైతం ప్రయాణం చేసేలా ప్రేమ్ కుమార్ కథ, కథనం రాశారు. వినోదాన్ని, భావోద్వేగాలను వేరు చేయకుండా ఒకదాని వెంట మరొకటి అందించిన విధానం బావుంది.
'సత్యం సుందరం' నిడివి ఎక్కువే... అందులో నో డౌట్. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే... చెల్లెలి కాలికి అరవింద్ స్వామి పట్టీలు కట్టే సన్నివేశం గానీ, సైకిల్ గురించి కార్తీ చెప్పే జ్ఞాపకాలు గానీ, తనను బావా అని పిలిచే వ్యక్తి పేరు తెలుసుకోవడం కోసం అరవింద్ స్వామి పడే తాపత్రయం గానీ, అరవింద్ స్వామికి కార్తీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసే సన్నివేశం గానీ వస్తుంటే అలా నోస్టాల్జియాలోకి వెళతాం. మనసు పొరల్లో తడి మనకు తెలియకుండా కంటి రెప్పకు చేరుతుంది. హీరోలు ఇద్దరూ అంత అద్భుతంగా నటించారు. దివ్యదర్శిని, శ్రీదివ్య, రాజ్ కిరణ్, జయప్రకాష్ వంటి నటీనటులు పాత్రల పరిధి మేరకు చాలా చక్కటి అభినయం కనబరిచారు.
Also Read: 'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్
ప్రేమ్ కుమార్ కథకు ప్రాణం పోసిన ఆన్ స్క్రీన్ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి అయితే... ఆఫ్ స్క్రీన్ హీరోలు సంగీత దర్శకుడు గోవింద్ వసంత్, సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజు. '96' తరహాలో మరోసారి మ్యూజిక్‌తో మేజిక్ క్రియేట్ చేశారు గోవింద్ వసంత్. బాణీలు, నేపథ్య సంగీతం మనసుకు స్వాంతన కలిగించేలా ఉన్నాయి. ప్రతి సన్నివేశం ఓ పెయింటింగ్ అన్నట్టు పిక్చరైజ్ చేశారు మహేందిరన్. తెలుగు డబ్బింగ్ చూస్తే... అరవింద్ స్వామికి హేమచంద్ర చక్కగా చెప్పారు. కానీ, కార్తీకి సరిగా సెట్ కాలేదు. తెరపై తమిళ నేటివిటీ కొంత కనబడుతుంది. అయితే... సంభాషణల్లో తెలుగుదనం తీసుకు వచ్చిన రాకేందు మౌళిని ప్రత్యేకంగా అభినందించాలి.
జీవితంలో మనం మర్చిపోయిన బాల్యస్మృతులను, కల్మషం లేని మనుషులను మళ్లీ గుర్తు చేసే సినిమా 'సత్యం సుందరం'. మూడు గంటల పాటు మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది. మనస్ఫూర్తిగా నవ్వుకునేలా చేస్తుంది, మన గురించి మనం ఆలోచించేలా చేస్తుంది, మధ్య మధ్యలో కంటతడి పెట్టిస్తుంది. అన్నిటి కంటే ముఖ్యంగా నోస్టాల్జియాలోకి తీసుకు వెళుతుంది.
Also Read: మత్తు వదలరా 2 రివ్యూ: సత్య వన్ మ్యాన్ షో... నవ్వించారు కానీ కథ సంగతేంటి? సినిమా ఎలా ఉంది?