Mathu Vadalara 2 Movie Review In Telugu: 'మత్తు వదలరా'తో ఎంఎం కీరవాణి రెండో తనయుడు శ్రీ సింహ కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఐదేళ్ల తర్వాత ఆ సినిమా సీక్వెల్ 'మత్తు వదలరా 2' తీశారు. శ్రీ సింహతో పాటు కమెడియన్ సత్య మరోసారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.


కథ (Mathu Vadalara 2 Story): డెలివరీ ఏజెంట్లు బాబు (శ్రీ సింహ), ఏసు (సత్య) దొంగ దారిలో హీ టీమ్ (కిడ్నాప్ కేసులను డీల్ చేసే హైలీ ఎమర్జెన్సీ టీమ్)లో ఉద్యోగాలు సంపాదిస్తారు. అయితే జీతం సరిపోక సరికొత్త పథకానికి తెర తీస్తారు. కిడ్నాపర్లకు ఇచ్చే డబ్బుల్లో కొంత మొత్తాన్ని తస్కరించడం మొదలు పెడతారు. ఈ క్రమంలో ఓ పెద్ద కేసు వాళ్ల దగ్గరకు వస్తుంది. 


తన కుమార్తె కనిపించడం లేదని, కిడ్నాపర్లు రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, ఏసుకు చెబుతుంది దామిని (ఝాన్సీ). ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వొద్దని, ఈ కేసును తాము డీల్ చేస్తామని చెబుతారు. ఆ క్రమంలో వాళ్లిద్దరూ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. దామినిగా తమకు పరిచయమైనది జూనియర్ ఆర్టిస్ట్ అని తెలుస్తుంది. 


బాబు, ఏసును మర్డర్ కేసులో ఇరికించినది ఎవరు? తేజస్వి తోట తన పేరును ప్రకాష్ (అజయ్)గా ఎందుకు మార్చుకున్నాడు? ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? హీరో యువ ('వెన్నెల' కిశోర్) పాత్ర ఏమిటిది? అసలు దామిని ఎవరు? ఈ కేసులో నిధి (ఫరియా అబ్దుల్లా) ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Mathu Vadalara 2 Review Telugu): క్వీర్కీ కామెడీస్, సెటైరికల్ ఫన్ ఫిలిమ్స్ తెలుగులో రావడం తక్కువ. ఒక వైపు థ్రిల్ ఇస్తూ... మరో వైపు వినోదం పంచుతూ... ఆల్మోస్ట్ ఐదేళ్ల క్రితం వచ్చిన 'మత్తు వదలరా' మంచి విజయం సాధించింది. అందులో సీరియల్స్ మీద సెటైర్స్ వేశారు. సీక్వెల్ వచ్చే సరికి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, ఇంకా హీరోలను వదిలిపెట్టలేదు దర్శకుడు రితేష్ రానా.


'మత్తు వదలరా 2' విషయంలో కామెడీ మీద ఎక్కువ ఆధారపడ్డారు రితేష్ రానా. ఈ సినిమాలో ట్విస్టులు లేవని కాదు... ఆ ట్విస్టుల కంటే కామెడీ ఎక్కువ వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా కమెడియన్ సత్య చాలా వరకు సినిమాను తన భుజాల మీద మోశారు. సత్య నటన, నడక నుంచి మొదలు పెడితే ఆయన ఎక్స్‌ప్రెషన్స్ వరకు ప్రతిదీ నవ్వించింది. చిరంజీవి తరహాలో సత్య వేసిన డ్యాన్స్ థియేటర్లలో విజిల్స్ వేయించడం గ్యారంటీ. శ్రీ సింహ కూడా బాగా చేశారు. బాబు పాత్రలో మరోసారి ఒదిగిపోయారు. 'వెన్నెల' కిశోర్, సునీల్ సైతం తమ పాత్రలకు న్యాయం చేశారు. కామెడీ వర్కవుట్ అయ్యింది. ఫరియా అబ్దుల్లా తన పాత్రకు న్యాయం చేశారు. రోహిణి, రాజా చెంబోలు, అజయ్ తదితరులు తమ పాత్రల్లో మెరిశారు.


Also Read: 'భలే ఉన్నాడే' రివ్యూ: రాజ్ తరుణ్‌కు హిట్ వచ్చిందా? భలే ఉందనే సినిమాయేనా?



'మత్తు వదలరా'లో సత్య కామెడీ ఎంత నవ్విస్తుందో... ట్విస్టులూ అంతే సర్‌ప్రైజ్ చేస్తాయి. క్రైమ్ ఎలిమెంట్ బావుంటుంది. 'మత్తు వదలరా 2'లో కామెడీ బావుంది కానీ క్రైమ్ ఎలిమెంట్ సరిగా రాసుకోలేదు. దాని మీద వర్కవుట్ చేసి ఉంటే ట్విస్ట్స్ మరింత బావుండేవి. 'మత్తు వదలరా' సినిమాలో వర్కవుట్ అయినంతగా ఇందులో సీరియల్ ట్రోల్ వర్కవుట్ కాలేదు. 'ఓరి నా కొడకా' ట్రాక్ నవ్వించలేదు. కాలభైరవ స్వరాలు, నేపథ్య సంగీతం బావున్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. కెమెరా వర్క్ ఒకే. 


'మత్తు వదలరా 2'... సత్య వన్ మ్యాన్ షో. అందులో నో డౌట్. ఫస్టాఫ్ హిలేరియస్ కామెడీ సీన్లతో ముందుకు సాగుతుంది. సెకండాఫ్‌లో కామెడీ డోస్ తగ్గింది. దానికి తోడు ట్విస్టులు సరిగా పేలలేదు. కానీ, నవ్వించడంలో లోటు చేయలేదు. వీకెండ్ హాయిగా నవ్వుకోవచ్చు. ఇటువంటి సినిమాల్లో లాజిక్కులు వెతక్కూడదు. నవ్వుకోవాలి అంతే. (PS: క్లైమాక్స్ తర్వాత సాంగ్ వస్తుంది. ఆ తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్స్ మిస్ కావద్దు)


Also Readమత్తు వదలరా 2 ట్విట్టర్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ... సత్య కామెడీ కేక... మరి సినిమా ఎలా ఉందంటే?