Love Sitara Review In Telugu streaming on Zee5 OTT: తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిందీ సినిమా 'లవ్, సితార'. అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆమె తొలి చిత్రమిది. విశేషం ఏమిటంటే... ఈ సినిమా కూడా పెళ్లి నేపథ్యంలో రూపొందింది. 'జీ 5' ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? శోభితా ధూళిపాళ ఎలా చేశారు? అనేది చూడండి. 


కథ (Love, Sitara Story): తార (శోభితా ధూళిపాళ) ఇంటీరియర్ డిజైనర్. అర్జున్ (రాజీవ్ సిద్ధార్ధ) షెఫ్. ఇద్దరూ ప్రేమలో ఉంటారు. తాను ప్రెగ్నెంట్ అని తెలిశాక పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తుంది తార. ఓకే చెబుతాడు అర్జున్. అయితే, తన ప్రెగ్నెన్సీ విషయం దాచి పెడుతుంది. అమ్మమ్మ ఇంటిలో నిరాడంబరంగా పెళ్లి జరగాలని కోరుకుంటుంది. అందుకూ అర్జున్ ఓకే చెబుతాడు. కుటుంబ సభ్యులతో కలిసి కేరళ వెళతారు.


అమ్మమ్మ ఇంటికి వెళ్లిన తర్వాత పిన్ని హేమ (సోనాలి కులకర్ణి) గురించి తారకు ఓ నిజం తెలుస్తుంది. అది ఏమిటి? ఆమె దాచిన ప్రెగ్నెన్సీ విషయం తెలిశాక అర్జున్ ఏమన్నాడు? ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అయ్యారు? అనేది 'జీ 5'లో సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Love Sitara Review): నిజం... చెప్పే ధైర్యం ఎంత మందికి ఉంటుంది? అదీ తప్పు చేసినప్పుడు, తప్పు చేశానని ఫీలైనప్పుడు నిజాయతీగా ఎదుటి వ్యక్తికి / జీవిత భాగస్వామికి ఆ విషయం చెప్పే అంత ధైర్యం ఎంత మందికి ఉంది? 'లవ్, సితార'తో దర్శకురాలు వందనా కటారియా ప్రేక్షకులకు వేసిన ప్రశ్నలు ఇవి. ఈ క్వశ్చన్స్ చూసి క్లాస్ పీకే సినిమా అనుకోవద్దు.


ప్రేమ, కన్నపేగు మీద మమకారం, క్షణికావేశం, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ వంటి అంశాలను స్పృశిస్తూ తీసిన క్లాసీ ఫిల్మ్ 'లవ్, సితార'. క్లాసీ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ఇష్టం వచ్చినట్టు రొమాంటిక్, స్పైసీ సన్నివేశాలు తీసే స్కోప్ కథలో ఉంది. కానీ, వందన అటువైపు వెళ్లలేదు. చెప్పాలని అనుకున్న పాయింట్ మాత్రమే చెప్పారు. అందుకు మెచ్చుకోవాలి. అయితే... క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఎక్కువ సమయం తీసుకున్నారు. అలాగే, ట్విస్ట్ రివీల్ అయ్యాక క్లైమాక్స్ దగ్గరకు వెళ్లడానికి కూడా!


చిన్నప్పటి నుంచి హీరోలా చూసిన పిన్ని చేసిన ఓ పని తనకు నచ్చలేదని కాబోయే భర్తకు ఫోన్ చేసి చెబుతుంది తార. 'మీరు ముందు మనుషులను దేవుళ్ళు చేస్తారు. ఆ తర్వాత దేవుళ్ళు తప్పు చేశారని అంటారు' అని అర్జున్ ఓ మాట అంటాడు. మనిషి అన్నాక తప్పు చేస్తారనే విషయాన్ని చక్కగా సింపుల్‌గా చెప్పారు. కథలో అంతర్లీనంగా ఈ తరహా చమక్కులు కొన్ని ఉన్నాయి. అక్క చెల్లెళ్ళ మధ్య సన్నివేశాలు, అర్జున్ - శోభితా మధ్య పతాక సన్నివేశాలను వందన చక్కగా డీల్ చేశారు.


'లవ్, సితార' తరహా కథలతో సమస్య ఏమిటంటే... అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆమోదముద్ర లభించదు. ప్రోగ్రెసివ్ థింకింగ్, రైటింగ్ రిసీవ్ చేసుకునే ఆడియన్స్ తక్కువ. మగతోడు లేకుండా ఓ మహిళ ఇద్దరు అమ్మాయిల్ని పెంచి పెద్ద చేసి ఓ స్థాయికి తీసుకు రాగలదని అమ్మమ్మ పాత్ర ద్వారా దర్శకురాలు వందన చెప్పకనే చెప్పింది. ఇండిపెండెంట్‌గా ఉండటం అంటే నచ్చిన వ్యక్తితో తిరగడం కాదని కూడా చెబుతుంది. అయితే... అటువంటి సందేశం అంతర్లీనంగా ఉంది. వాటి కంటే కథలో ఎఫైర్స్ పైకి ఎక్కువగా కనపడతాయి. ఎటువంటి వల్గారిటీ లేకుండా అందంగా ఈ కథను తెరకెక్కించారు.


Also Read'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే



'లవ్, సితార'లో శోభితా ధూళిపాళ చక్కగా నటించారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆ పాత్రకు తగ్గట్టు ప్రవర్తించారు. అర్జున్ పాత్రలో రాజీవ్ సిద్ధార్థ ఓకే. ఇక... శోభిత అమ్మమ్మగా బి జయశ్రీ, తల్లిగా వర్జీనియా రోడ్రిగజ్, పిన్నిగా సోనాలి కులకర్ణి ప్రతి సన్నివేశంలోనూ ఆ పాత్ర మాత్రమే కనిపించేలా నటించారు. మిగతా నటీనటులు కూడా ఓకే. పాటలు కథతో పాటు వెళ్లాయి. పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కెమెరా వర్క్ బావుంది. 


'లవ్, సితార'... ఓ సినిమాను కాకుండా ఒకరి జీవితంలో కొన్ని పేజీలు చదువుతున్న అనుభూతి ఇచ్చే సినిమా. ఈ తరహా కథలు అందరి జీవితాల్లో జరగవు. కానీ, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నిజం చెప్పాలనే సందేశాన్ని ఇస్తుంది. సినిమా స్లోగా ఉంటుంది. అయితే, సున్నితమైన విషయాలను చక్కగా చెబుతుంది. ఈ వీకెండ్ ఇంట్లో కూర్చుని ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు... 'లవ్, సితార' చక్కటి ఆప్షన్.


Also Read: మత్తు వదలరా 2 రివ్యూ: సత్య వన్ మ్యాన్ షో... నవ్వించారు కానీ కథ సంగతేంటి? సినిమా ఎలా ఉంది?