Kiran Abbavaram's KA Movie Review In Telugu: ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కథానాయకులలో కిరణ్ అబ్బవరం ఒకరు. హీరోగా మొదటి రెండు సినిమాలు విజయాలు సాధించాయి. తర్వాత అతని ప్రయాణంలో హిట్టూ ఫ్లాపులు ఉన్నాయి. అయితే... బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత కొంత విరామం తీసుకుని, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా 'క'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి తీసుకు వచ్చారు. ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. మరి, ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో కిరణ్ అబ్బవరం ఎలా ఉన్నారు? అనేది చూస్తే...


కథ (KA Movie Story): వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ. మధ్యాహ్నం మూడు గంటలకు చీకటి పడే క్రిష్ణగిరికి పోస్ట్ మ్యాన్ (టెంపరరీ)గా వెళతాడు. అక్కడ ఊరి ప్రజలతో కలిసిపోతాడు. పోస్ట్ మాస్టర్ రామారావు (అచ్యుత్ కుమార్) కుమార్తె సత్యభామ (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. అంతా బావుందని అనుకుంటే అనూహ్య ఘటనలు జరుగుతాయి. అతడిని ఎవరో ఓ గదిలో బంధిస్తారు.


వాసుదేవ్‌ను చీకటి గదిలో బంధించింది ఎవరు? అతడిని హంతకుడని ముసుగు మనిషి ఎందుకు అంటున్నాడు? అతనికి ప్రశ్నలు వేసిన ఆ ముసుగు మనిషి ఎవరు? క్రిష్ణగిరిలో తెల్లవారుజామున అమ్మాయిలు మాయం కావడం వెనుక ఎవరు ఉన్నారు? వాసుదేవ్ గది పక్కన చీకటి గదిలో ఉన్న రాధ (తన్వీ రామ్) ఎవరు? ఆ గది నుంచి వాసుదేవ్ బయట పడ్డాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు 'క' చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (KA Movie Review In Telugu): ఐడియాల్లో కొత్త, పాత అనేవి ఉండవని ఎంత కొత్తగా ప్రజెంట్ చేశామన్నది ముఖ్యమని 'క' దర్శకులలో ఒకరైన సందీప్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో చెప్పారు. నిజమే... ఒక్కోసారి కొత్త కథను సరిగా ప్రజెంట్ చేయలేకపోవచ్చు. కొందరు పాత కథలను తీసుకుని తెరపై అద్భుతాలు ఆవిష్కరించవచ్చు. 'క' సినిమాలో దర్శక ద్వయం సుజిత్ - సందీప్ ఏం చేశారు? అనేది చూస్తే...


'క' థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త క్లైమాక్స్ చూసిన ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఒక సంతృప్తి, సంతోషంలో ప్రేక్షకుడు ఉంటాడు. అయితే, ఈ కథలో కొత్తదనం ఎంత ఉంది? అనేది చూస్తే... ఆ క్లైమాక్స్ ఒక్కటీ మన కళ్ళ ముందు కనబడుతుంది. ఆ తర్వాత కథనం గుర్తుకు వస్తుంది. ఎనభైల నేపథ్యంలో కథ సాగుతుంది. ఆ పీరియాడిక్ టచ్ సన్నివేశాలకు కొత్త సొగసు అద్దింది. కానీ, కథ కొత్తది కాదు.


ఉమెన్ ట్రాఫికింగ్ (మహిళల అక్రమ రవాణా) నేపథ్యంలో కొన్ని కథలు, సినిమాలు వచ్చాయి. కృష్ణవంశీ 'గులాబీ' నుంచి నాని 'కృష్ణార్జున యుద్ధం' వరకు... వాటికి ముందు తర్వాత సినిమాలు వచ్చాయి. 'క'లోనూ ఉమెన్ ట్రాఫికింగ్ మెయిన్ టాపిక్. అయితే, అదొక్కటే మెయిన్ పాయింటా? అంటే... కాదు. ఉమెన్ ట్రాఫికింగ్ రివీల్ చేసే వరకు కథను నడిపిన తీరు బావుంది. దర్శకులుగా పరిచయమైన సుజిత్ - సందీప్ కథను చాలా ఆసక్తికరంగా ప్రారంభించారు. చీకటి గదిలో హీరోని ముసుగు మనిషి బంధించడం, ప్రశ్నలు వేయడం, ఆ కాలచక్రం ఆసక్తి కలిగించాయి. ఆ సస్పెన్స్ మైంటైన్ చేయడంలో తడబడ్డారు. రిడిన్ కింగ్ స్లే కామెడీ వర్కవుట్ కాలేదు. మధ్యలో కొన్ని ఓవర్ ది టాప్, రొటీన్ డైలాగ్స్ ఫ్లోను దెబ్బ తీశాయి. బ్యాక్ టు బ్యాక్ వచ్చే సాంగ్స్ కూడా!


ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా మొదలైన ఈ సినిమాలో ఆ ఇన్వెస్టిగేషన్ / ఉత్కంఠకు మధ్యలో ప్రేమ కథ బ్రేకులు వేసింది. పడుతూ లేస్తూ విశ్రాంతి వరకు వచ్చింది. అక్కడ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచింది. చివరి వరకు సస్పెన్స్ మైంటైన్ చేశారు. ఎండింగ్ అయితే కొత్త అనుభూతి ఇస్తుంది.


సామ్ సిఎస్ నేపథ్య సంగీతం లేని 'క'ను ఊహించుకోలేం. సినిమా స్టార్టింగులో డ్యూటీ ఎక్కేశారు. ఎండింగ్ వరకు కిందకు దిగలేదు. బ్యాక్ టు బ్యాక్ వచ్చే సాంగ్స్ ఫ్లోను దెబ్బ తీసినా... ఆయన ట్యూన్స్ బావున్నాయి. జాతర సాంగ్ బాణీ పూనకాలు తెప్పిస్తుంది. నేపథ్య సంగీతం హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆర్ఆర్ బావుంది. ఆ ఎపిసోడ్ డిజైన్ కూడా! సినిమాటోగ్రాఫర్స్ విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం వర్క్ స్క్రీన్ మీద కనబడుతుంది. నైట్ టైమ్ వచ్చే సీన్స్ చాలా బాగా తీశారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో, ఖర్చు విషయంలో రాజీ పడలేదు.


Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?



'క' అంటే కిరణ్ అబ్బవరం 2.ఓ అని చెప్పొచ్చు. కథలో ట్విస్ట్ రివీల్ చేయకూడదు కానీ... నటుడిగా ఆయన ఈ సినిమాతో ఓ ప్రయోగం చేశారు. గ్రే షేడ్స్ చూపించారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పడిన కష్టం కనబడుతుంది. నయన్ సారికది ఎక్స్‌ప్రెసివ్ ఫేస్. తన పాత్రకు 100 శాతం న్యాయం చేసింది. తన్వీ రామ్ కథలో కీలక పాత్ర చేశారు. అచ్యుత్ కుమార్, శరణ్య ప్రదీప్, అన్నపూర్ణమ్మ, అజయ్, బిందు చంద్రమౌళి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.


క... కొత్త తరహా కథలు ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా. స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ ఇది. ఉమెన్ ట్రాఫికింగ్ కాన్సెప్ట్ కొత్తదని చెప్పలేం. కానీ, ఆ పాయింట్ చుట్టూ కొత్త కథ చెప్పాలని ట్రై చేశారు. ఫస్టాఫ్ రోలర్ కోస్టర్ రైడ్ అయినప్పటికీ... సెకండాఫ్ సస్పెన్స్ హోల్డ్ చేస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అందరికీ నచ్చుతుంది. ఆ ఎండింగ్ ఓ శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తుంది. కిరణ్ అబ్బవరం 2.ఓ - హీరోగా కిరణ్ అబ్బవరానికి పునర్జన్మ 'క' (ఇది గుర్తు పెట్టుకోండి, సినిమా చూశాక అర్థం అవుతుంది).


Also Read: వెనమ్ 3 రివ్యూ: ‘వెనమ్’ సిరీస్‌లో లాస్ట్ సినిమా - మంచి ఫేర్‌వెల్ ఇచ్చారా?