Gopichand Viswam Movie Review and Rating: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సినిమా 'విశ్వం'. కావ్య థాపర్ హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనెపూడి నిర్మించారు. విజయ దశమి సందర్భంగా నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Viswam Movie Story): సమైరా (కావ్యా థాపర్) కాస్ట్యూమ్ డిజైనర్. ఆమె మిలాన్ వెళ్లినప్పుడు గోపి (గోపీచంద్) పరిచయం అవుతాడు. సమైరాను చూసి అతడు ప్రేమలో పడతాడు. ఆమె కోసం ఇండియా వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సమైరా అన్న కుమార్తె ఆపదలో ఉన్నదని తెలుస్తుంది.
సమైరా అన్నయ్య కుమార్తెను కాపాడటం కోసం గోపి ప్రాణాలు సైతం లెక్క చేయడు. అసలు, ఆ పాప మీద ఎటాక్స్ చేస్తున్నది ఎవరు? గోపిగా ఆమెను కాపాడటానికి వచ్చిన విశ్వం (గోపీచంద్) ఎవరు? ఈ కథలో బాచిరాజు (సునీల్), శర్మగా ఇండియాలో సెటిలైన ఖురేషి (జిష్షుసేన్ గుప్తా) పాత్రలు ఏమిటి? పాప ప్రాణాలకు, ఇండియాలో తీవ్రవాద చర్యలకు సంబంధం ఏమిటి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Viswasam Movie Review Telugu): కమర్షియల్ అంశాలతో, యాక్షన్ & హీరోయిజం మిస్ కాకుండా కామెడీతో కథను చెప్పడం శ్రీను వైట్ల స్టైల్. అయితే, ఆ స్టైల్ కొన్నాళ్లుగా విజయాలు ఇవ్వడం లేదు. తన పంథా మార్చుకుని, రొటీన్‌గా కాకుండా కొత్తగా సినిమా తీశానని 'విశ్వం' విడుదలకు ముందు ఇంటర్వ్యూలలో చెప్పారు. మరి, ఈ సినిమా అలా ఉందా? అంటే... 'లేదు' అని చెప్పాలి.
శ్రీను వైట్ల మార్క్ కమర్షియల్ ఫార్ములాతో తీసిన సినిమా 'విశ్వం'. అందులో మరో మాట చెప్పాల్సిన అవసరం లేదు. హీరో తన ఐడెంటిటీ దాచి మరొకరిగా హీరోయిన్ ఇంటికి వెళ్లడం కామన్. ఈ సినిమాలోనూ అంతే! అయితే... కథల్లో కాస్త మార్పులు చేర్పులు చేశారు. కథ సంగతి పక్కన పెడితే... కామెడీ క్లిక్ అయ్యింది. ఇటీవల కాలంలో పృథ్వీని ఫుల్లుగా వాడుకున్న సినిమా ఇదేనని చెప్పాలి. ఆయన స్క్రీన్ మీదకు వచ్చిన ప్రతిసారీ ఆడియన్స్ నవ్వుతారు. ఇంటర్వెల్ ముందు పృథ్వీతో, ఇంటర్వెల్ తర్వాత 'వెన్నెల' కిశోర్‌తో నరేష్, ప్రగతి సన్నివేశాలు బావున్నాయి. ఆ సీన్లకు ఆడియన్స్ అందరూ నవ్వుతారు.
కామెడీ సన్నివేశాలు తీయడంలో, ప్రేక్షకుల్ని నవ్వించడంలో శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అని చెప్పాలి. కానీ, కథ విషయంలో ఆయన డిజప్పాయింట్ చేశారు. 'విశ్వం' అన్నారు గానీ... ఆ కథ చూస్తే 'దూకుడు' ఛాయలు కనపడ్డాయి. సెంటిమెంట్ లేదా మరొకటి అనుకోవచ్చు... మిలాన్ సిటీలో హీరో హీరోయిన్లు పరిచయం కావడం, ఆ తర్వాత ఇండియా వచ్చాక హీరోయిన్ తండ్రి పరిచయం, హీరో యాంటీ టెర్రర్టిస్ట్ స్క్వాడ్ కావడం వంటివన్నీ 'దూకుడు'ను గుర్తు చేశాయి. కామెడీ ఎంజాయ్ చేసినంతగా కథ, ఆ క్లైమాక్స్ ఎంజాయ్ చేయలేం. దాంతో థియేటర్ నుంచి భారంగా బయటకు రావాల్సిన పరిస్థితి.
రొటీన్ ఫార్ములా నుంచి శ్రీను వైట్ల బయట పడలేదు. కంఫర్ట్ జోన్ కామెడీ ఓకే. కానీ, ఆ కథలోనూ రొటీన్ కమర్షియల్ ఫార్ములా వర్కవుట్ కాలేదు. లాజిక్కులు లేకుండా తీసిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సన్నివేశాలు కామెడీగా మారాయి. కథను నమ్మి భారీగా ఖర్చు చేసిన నిర్మాతలను మెచ్చుకోవాలి. కెవి గుహన్ కెమెరా పనితనంతో ఆ రిచ్‌నెస్ కనిపించింది. లొకేషన్స్ బావున్నాయి. ఫాస్ట్ కట్స్ వంటివి బాగా చేశారు. చైతన్ భరద్వాజ్ అందించిన పాటలకు, పిక్చరైజ్ చేసిన తీరుకు సంబంధం లేకుండా ఉంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టు ఉంది. భీమ్స్ కంపోజ్ చేసిన 'గుంగురూ గుంగురూ' మాస్ బీట్ ప్లేస్‌మెంట్ కూడా బాలేదు. కత్తెరకు పని చెప్పాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి.
Also Read: 'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
గోపీచంద్ నుంచి నటన పరంగా డిమాండ్ చేసిన సన్నివేశాలు లేవు. యాక్షన్ హీరోగా ఆ కథకు, ఆ పాత్రకు తగినట్టు చేశారు. కావ్య థాపర్‌ది గ్లామర్ డాల్ రోల్ తప్ప నటిగా ఆవిడ ప్రతిభ చూపించిన సన్నివేశాలు లేవు. జిష్షుసేన్ గుప్తాది రొటీన్ విలన్ / టెర్రరిస్ట్ క్యారెక్టర్. పృథ్వీ, సునీల్, రాహుల్ రామకృష్ణ, 'వెన్నెల' కిశోర్, నరేష్, ప్రగతి కామెడీ సన్నివేశాలు ఎంజాయ్ చేయవచ్చు. 'కిక్' శ్యామ్, బెనర్జీ, ప్రవీణ్... చెబుతా వెళితే తెరమీద బోలెడంత మంది ఆర్టిస్టులు ఉన్నారు.
శ్రీను వైట్ల మార్క్ కామెడీతో ఆయన రొటీన్ ఫార్ములా కథతో తీసిన సినిమా 'విశ్వం'. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... కామెడీ పరంగా ఆయన శాటిస్‌ఫై చేశారు. కానీ, కథ విషయంలో బాగా డిజప్పాయింట్ చేశారు. విశ్వమంత అంచనాలతో పెట్టుకుని వెళితే... కాస్త నవ్వులతో బయటకు పంపించారు, అంతే!