Venom The Last Dance Review: హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ‘వెనమ్’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సూపర్ హీరో సినిమాలు చూసేవాళ్లు ‘వెనమ్’ సినిమాను అస్సలు మిస్ అవ్వరు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలూ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. మూడో సినిమాతో ఈ సిరీస్‌ను ఎండ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అదే ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?
కథ: రెండో పార్ట్ అయిన ‘వెనమ్: లెట్ దేర్ బి కార్నేజ్’ సంఘటన అనంతరం ఎడ్డీ బ్రాక్ (టామ్ హార్డీ) మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవుతాడు. వెనమ్‌ని కూడా తన గ్రహానికి చెందిన వాసులు వెంటాడుతూ ఉంటాయి. దీంతో వారిద్దరూ పారిపోతూనే ఉంటారు. ఇంతలో వీరిద్దరికీ ఒక కొత్త ప్రమాదం ఎదురవుతుంది. వేరే లోకంలో బంధించి ఉన్న నల్ (ఆండీ సెర్కిస్) అనే సూపర్ విలన్ విడుదలకు అవసరమైన ఒక ఎలిమెంట్ ఈ మొత్తం విశ్వంలో వీరి దగ్గర మాత్రమే ఉంటుంది.
దీంతో నల్ సైన్యం కూడా వీరిని వేటాడుతూనే ఉంటుంది. నల్ సైన్యం నుంచి తప్పించుకోవాలంటే అయితే ఎడ్డీ, వెనమ్‌ల్లో ఒకరు మరణించాలి లేదా జీవితాంతం పరిగెడుతూనే ఉండాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్డీ, వెనమ్ ఏం చేశారు? జీవితమంతా పరిగెడుతూ ఉన్నారా? లేకపోతే ఇద్దరిలో ఒకరు ప్రాణత్యాగం చేశారా? అన్నది తెలియాలంటే ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ చూడాల్సిందే.
విశ్లేషణ: సూపర్ హీరో సినిమాలు అంటే మనందరం ఎదురు చూసేది కళ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్లు. ఈ విషయంలో ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రారంభంలో వచ్చే ఫ్లైట్ మీద యాక్షన్ ఎపిసోడ్ దగ్గర నుంచి ఒక మూడు సాలిడ్ యాక్షన్ బ్లాక్‌లు పడ్డాయి. దాదాపు 20 నిమిషాల పాటు సాగే క్లైమ్యాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో హైలెట్. ఒక పెద్ద శత్రువు కోసం వెనమ్, ఇతర సింబియోట్లు, మిలటరీ అందరూ కలిసి చేసే పోరాట సన్నివేశాలు అలరిస్తాయి.
కానీ ఒక సూపర్ హీరోకు ఫేర్‌వెల్ ఇస్తున్నామంటే ఆ సినిమా కేవలం యాక్షన్ పరంగానే కాకుండా ఎమోషన్ పరంగా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండాలి. గతంలో వచ్చిన ‘లోగన్’, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ ఈ విషయంలో చాలా హయ్యస్ట్ మీటర్‌ను సెట్ చేశాయి. ఆ రేంజ్‌లో ఇందులో ఎమోషన్ వర్కవుట్ అయిందా అంటే లేదని చెప్పాలి. ముఖ్యంగా ఎడ్డీ, వెనమ్‌ల మధ్య ఎమోషన్‌ను చూపించే సన్నివేశాలు లేవని చెప్పాలి. ప్రీ క్లైమ్యాక్స్‌కు ముందు వచ్చే ఒక్క సీన్ మాత్రం ఎమోషనల్‌గా కాస్త ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమాలో నల్‌కు, వెనమ్‌కు మధ్యలో ఫేస్ ఆఫ్ సీన్లు ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. నల్ పాత్ర కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తుంది.
టెక్నికల్‌గా ఈ సినిమా చాలా హై స్టాండర్డ్స్‌లో ఉంది. వీఎఫ్ఎక్స్ టాప్ నాచ్‌లో ఉంది. ఈ విషయంలో ఫ్యాన్స్, ఆడియన్స్ ఎక్కడా డిజప్పాయింట్ అవ్వరు. డాన్ డీకన్ అందించిన నేపథ్య సంగీతం పెద్దగా రిజిస్టర్ అవ్వదు.
నటీనటుల విషయానికి వస్తే... ఇది టామ్ హార్డీ వన్ మ్యాన్ షో. వెనమ్ పాత్ర పోషించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎడ్డీ బ్రాక్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. లేని వెనమ్‌ని ఊహించుకుని దాంతో కెమిస్ట్రీని పండించడం మామూలు విషయం కాదు. అలాగే ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. మిగతా పాత్రధారులందరూ వారి పాత్రల మేరకు బాగా నటించారు.
ఓవరాల్‌గా చూస్తే... సూపర్ హీరోకు ఫేర్‌వెల్ ఇస్తున్నారు కాబట్టి ఒక ఎమోషనల్ రైడ్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సరదాగా ఒక సూపర్ హీరో సినిమా చూస్తున్నాం అనుకుంటే మాత్రం ఎంటర్‌టైన్ అవుతారు.