Vishwak Sen's Gangs Of Godavari Review: గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన రూరల్ యాక్షన్ డ్రామా 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి'. లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. గోదావరి అమ్మాయి అంజలి, నేహా శెట్టి హీరోయిన్లు. గేయ రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణచైతన్య తీసిన చిత్రమిది. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 


కథ (Gangs Of Godavari Story): గోదావరి లంక గ్రామంలో యువకుడు రత్నాకర్ (విశ్వక్ సేన్). చిన్నతనంలో తల్లిదండ్రులు మరణిస్తారు. రత్నమాల (అంజలి) అతనికి స్నేహితురాలు. గొప్పగా బతకాలని ఆశపడతాడు. చిన్న దొంగతనాలు నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యే దొరస్వామిరాజు (గోపరాజు రమణ) దగ్గర చేరడం వరకు... ఆ తర్వాత నానాజీ (నాజర్) అండతో దొరస్వామిరాజుకు వ్యతిరేకంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడం వరకు తన తెలివితేటలతో పైకి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతాడు.


ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 'లంకల' రత్నకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? ప్రేమించి మరీ తనను పెళ్లి చేసుకున్న నానాజీ కుమార్తె బుజ్జి (నేహా శెట్టి) ఎందుకు తుపాకీతో షూట్ చేసింది? వేశ్య రత్నమాలతో రత్న సంబంధం ఏమిటి? లంక గ్రామంలో సొంత మనుషులే రత్నపై కత్తి కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు అతను ఎందుకు జైలుకు వెళ్ళాడు? చివరకు రత్నను సొంత జనాలు చంపేశారా? లేదంటే అతను వాళ్లను చంపేశాడా? ఈ ప్రయాణంలో అతను పొందినది ఏమిటి? కోల్పోయినది ఏమిటి?


విశ్లేషణ (Gangs Of Godavari Review): మంచోడి జీవితంలో మలుపులు తక్కువగా ఉంటాయ్. చెడ్డోడి జీవితంలో ఊహించని ఘటనలు, సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందుకే, క్రిమినల్ హిస్టరీ బేస్డ్ కథలకు మార్కెట్టులో మాంచి గిరాకీ ఉంటుంది. 'నేరాలు - ఘోరాలు' కార్యక్రమంపై ప్రజల్లో ఉన్నంత ఆసక్తి 'నమ్మలేని నిజాలు'కు ఉండదు. నేరం చేసి అయినా సరే గొప్ప స్థాయికి వచ్చిన మనిషి కథ బాక్సాఫీస్ బరిలో భారీ విజయానికి మాంచి ముడిసరుకు. 'కెజియఫ్', 'పుష్ప' అందుకు ఉదాహరణ. కథ పరంగా చూస్తే ఆ జాబితాలో చేరే చిత్రమే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. మరి, సినిమా ఎలా ఉంది? అనే విషయంలోకి వెళితే...


కథ, కథనం కంటే క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టరైజేషన్‌లో విశ్వక్ సేన్ నటన... అంత కంటే ముఖ్యంగా యువన్ శంకర్ రాజా సంగీతం మీద నమ్మకంతో తీసిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులకు ఆ మూడు మాత్రమే గుర్తుకు ఉంటాయి. కథ కొత్తది కాదు. కథనంలో కూడా కొత్తదనం లేదు. శర్వానంద్ 'రణరంగం', రానా దగ్గుబాటి 'నేనే రాజు నేనే మంత్రి', మహేష్ బాబు 'బిజినెస్  ఛాయలు కనిపిస్తాయి.


సినిమా ప్రారంభం నుంచి విశ్వక్ సేన్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటుంది. తర్వాత ఎటు వైపు అడుగులు వేస్తాడు? అని స్క్రీన్ ముందున్న ప్రేక్షకుడిలో చిన్న ఆసక్తి కలిగిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథతో సంబంధం లేకుండా కొన్ని సన్నివేశాలు సర్‌ప్రైజ్ చేస్తాయి. మధ్య మధ్యలో వినోదం ఆకట్టుకుంటుంది. కానీ, ఇంటర్వెల్ తర్వాత వినోదం అసలు లేదు. కథ పూర్తిగా రివెంజ్ & ఎమోషనల్ టర్న్ తీసుకుని ముందుకు వెళ్లడంతో మలుపులు ఆకట్టుకోలేదు. ఫక్తు కమర్షియల్ ఫార్మటులో సాగింది. దాంతో కాస్త భారంగా ముందుకు కదులుతుంది.


కథకుడిగా, దర్శకుడిగా పూర్తి స్థాయిలో కృష్ణచైతన్య ఆకట్టుకోలేదు. కానీ, సాంకేతిక నిపుణుల నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నారు. ముఖ్యంగా అనిత్ మదాడి సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా సంగీతం చాలా బావున్నాయి. గోదావరిని ఈ స్థాయి గ్రే షెడ్‌లో చూపించిన సినిమాటోగ్రాఫర్ మరొకరు లేరేమో! యాక్షన్ సీన్లకు అవసరమైన ఫైర్ యువన్ నేపథ్య సంగీతం తీసుకొచ్చింది. సినిమా విడుదలకు ముందు పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. స్క్రీన్ మీద కూడా బావున్నాయి. కత్తెరకు పని చెప్పాల్సిన సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. సంభాషణలు బావున్నాయి.


Also Read: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆడియన్స్ రివ్యూ: 'పుష్ప'కు ఫాస్ట్ ట్రాకా? ఎన్టీఆర్‌తో తీస్తే ఇంకా బాగుండేదా? జనాలు గొర్రెలు డైలాగ్ ఏంట్రా బాబూ!


రత్న పాత్రకు విశ్వక్ సేన్ ప్రాణం పోశాడు. 'ఫలక్‌నుమా దాస్'లో అతను మాస్ రోల్ చేశారు. కానీ, రత్న మాస్ వేరు. గోదారి లంక గ్రామంలో యువకుడిగా ఆ మీసకట్టు, లుంగీలో కొత్తగా కనిపించారు. యాక్షన్ సన్నివేశాల్లో రౌద్ర రసం పలికించిన తీరు మాస్ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. బుజ్జిగా నటించిన నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయారు. 'సుట్టం సూసిపోకలా...' పాటలో అందంగా కనిపించారు. ఆ తర్వాత రత్న భార్యగా భావోద్వేగభరిత సన్నివేశాలు బాగా చేశారు. అంజలి పాత్రలో వేరియేషన్స్ ఉన్నాయి. సినిమా ప్రారంభంలో వేశ్యగా, తర్వాత హీరోకి సాయం చేసే మహిళగా భిన్నమైన నటనలో షేడ్స్ చూపించారు. గోదావరి అమ్మాయి కనుక ఆ యాస కూడా బాగా పలికించారు. 'హైపర్' ఆది, పమ్మి సాయి క్యారెక్టర్లకు స్క్రీన్ స్పేస్ ఉంది కానీ కామెడీ చేసే ఛాన్స్ లేదు. నెగెటివ్ షేడ్ యాదు పాత్రలో గగన్ విహారి బాగా చేశాడు. నాజర్, గోపరాజు రమణ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.   


'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'... ఇది విశ్వక్ సేన్ మాస్ మూవీ. గోదావరి నేపథ్యంలో రా అండ్ రస్టిక్ సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు ఒక ఆప్షన్ అంతే. కథ, కథనంలో కొత్తదనం అసలు లేదు. సెకండాఫ్‌ చాలా డల్‌గా ఉంది‌. యాక్షన్ సీక్వెన్సులు, విశ్వక్ సేన్ నటన, యువన్ సంగీతం ఒక సెక్షన్ ఆఫ్ మాస్ జనాల్ని మాత్రమే మెప్పిస్తాయంతే! అందరినీ ఆకట్టుకునే సినిమా కాదిది.


Also Read: ఫ్యూరియోసా రివ్యూ: ‘మ్యాడ్ మ్యాక్స్’ ప్రీక్వెల్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఆకట్టుకుందా?