Chinmayi Sripaada slams trolls for schooling Anjali for laughing : ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఈవెంట్ లో బాలకృష్ణ, అంజలి మధ్య జరిగిన విషయమే. ఒకవైపు అందరూ బాలకృష్ణ తప్పు అంటుంటే, మరో వైపు అది వాళ్లిద్దరి మధ్య చనువు అలాంటిది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంకొంతమంది మాత్రం అంజలీని ట్రోల్ చేస్తున్నారు. "ఆయన అలా తోసేస్తే నవ్వుతావు ఏంటి? ఆన్సర్ చెప్పాలికదా?" అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ అంశంపై స్పందించారు సింగర్ చిన్మయి శ్రీపాద. అంజలిపై వస్తున్న ట్రోల్స్ పై ఆమె సీరియస్ అయ్యారు. అయితే, నెటిజన్లు మాత్రం చిన్మయి మాటలకు సపోర్ట్ ఇవ్వడం లేదు. తిరిగి ఆమె పైనే విమర్శలు గుప్పిస్తున్నారు.
డబ్బున్న వాళ్లని బాధ్యుల్ని చేయరు..
చిన్మయి శ్రీపాద.. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఈమె వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మీ టూపై పోరాటం చేసి బ్యాన్ కి గురయ్యారు చిన్మయి. ప్రతి విషయంపై స్పందిస్తూ తన భావాలను నిర్భయంగా వ్యక్తపరుస్తుంటారు. బాలకృష్ణ, అంజలి వివాదంపై స్పందించారు ఆమె. ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు చిన్మయి. డబ్బులు, పలుకుబడి, పొలిటికల్ పవర్ ఉన్న పురుషుడిని సమాజం ఎప్పుడూ నిందించదు అంటూ ఆమె ట్వీట్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో బాలకృష్ణ అంజలిని తోసేసిన వీడియో షేర్ చేసిన చిన్మయి ఇలా అన్నారు. “ జనాల్లో నేను గమనించిన పెద్ద ప్రాబ్లమ ఏంటి తెలుసా? చూడు ఆమె ఎలా నవ్వుతుందో.. అలా కాకుండా ఇలా చేసి ఉండాల్సింది అని చెప్పడం. మీరు ఫోన్లో చూస్తే అలా అనుకున్నంత ఈజీకాదు అక్కడ మీరు చెప్పినట్లు చేయడం. సొసైటీ ఎప్పుడూ ఒక స్టేటస్ నుంచి వచ్చిన పురుషుడిని విమర్శంచలేదు. ముఖ్యంగా వాళ్లకు డబ్బు, పలుకుబడి, కులం ఉంటే. స్త్రీ ఏం చేయాలి అనేది చెప్పడం ఆపేయండి" అంటూ ట్వీట్ చేశారు చిన్మయి.
చిన్మయిపై విమర్శలు చేస్తున్న నెటిజన్లు..
ఈ విషయంలో చిన్మయిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. "ఇన్ని చెప్పిన నువ్వు ఎక్కడా బాలకృష్ణ పేరు ఎందుకు తీసుకురాలేదు" అంటూ ఫైర్ అవుతున్నారు. "ఎవరికి ఎందుకు భయపడుతున్నారో చెప్పండి" అంటూ కామెంట్లు పెడుతున్నారు. "ఈ వీడియోలో అంజలిని ట్రోల్ చేస్తున్న వాళ్లపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మరి అలా చేసిన బాలయ్యను ఎందుకు విమర్శించడం లేదు" అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. కొంతమంది మాత్రం చిన్మయిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. "అక్కడ అంత పెద్ద తప్పు జరిగి, ఆయన తోసేస్తే ప్రేక్షకులు నవ్వుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. ఆ టైంలో అంజలి అలానే రియాక్ట్ అవ్వాలి. దాంట్లో తప్పేముంది" అంటూ మరికొంతమంది అంటున్నారు.
అంజలి రియాక్షన్..
ఇక ఆమెపై వస్తున్న ట్రోల్స్ పై అంజలి కూడా రియాక్ట్ అయ్యారు. "'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన బాలకృష్ణ గారికి చాలా థాంక్స్. మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పరస్పర గౌరవం ఉంది. చాలా రోజుల నుంచి మా మధ్య మంచి స్నేహం ఉంది. ఆయనతో మరోసారి స్టేజి షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి" అని అంజలి ట్వీట్ చేశారు. ఈవెంట్ లో ఆయనతో కలిసి మాట్లాడిన వీడియోలు, తోసేసిన తర్వాత హైఫై కొట్టిన వీడియోలు, సరదాగా మాట్లాడుకున్న వీడియోలను షేర్ చేశారు అంజలి.
Also Read: థాంక్యూ బాలకృష్ణ... ట్రోలర్స్‌కు లాగిపెట్టి కొట్టినట్టు స్టేట్మెంట్ ఇచ్చిన అంజలి