'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన సినిమా 'దేవర' (Devara Part 1). 'ఆర్ఆర్ఆర్' విడుదలైన రెండేళ్లకు... సోలో హీరోగా ఆరేళ్లకు ఎన్టీఆర్ థియేటర్లలోకి ఆయన వచ్చారు. దర్శకుడు కొరటాల శివ ఎలా తీశారు? ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.
కథ (Devara Movie Story): ఆంధ్రా తమిళనాడు సరిహద్దుల్లోని రత్నగిరి ప్రాంతంలోని ఎర్ర సముద్రంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. తమ జీవనోపాధి కోసం మురుగ (మురళీ శర్మ) కోసం పని చేయడం మొదలు పెడతారు ఆ గ్రామాల్లో ప్రజలు. కార్గో షిప్పుల్లో అక్రమంగా వచ్చిన సరుకును కోస్ట్ గార్డుల కంట పడకుండా ఒడ్డుకు తీసుకు వస్తారు. అందులో ఏముందనేది పట్టించుకోరు.
అక్రమంగా తాము తీసుకొచ్చిన సరుకు వల్ల ఓ ప్రాణం పోయిందని తెలిసి మురుగ కోసం పని చేయకూడదని దేవర (ఎన్టీఆర్) నిర్ణయిస్తాడు. ఎర్ర సముద్రంలో అతని మాటకు తిరుగులేదు. అతడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. దాంతో ఇష్టం లేకున్నా మౌనంగా ఉంటాడు బైరా (సైఫ్ అలీ ఖాన్). చివరకు, దేవర ప్రాణం తీయడానికి ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత దేవర మాయం అవుతాడు.
'దేవర'ను చంపడం కోసం బైరా ఏం చేశాడు? ఆ తర్వాత ఏమైంది? తండ్రి వీరుడు దేవర అయితే కొడుకు వర (ఎన్టీఆర్) భయం భయంగా ఎందుకు తిరుగుతున్నాడు? సింగప్ప (శ్రీకాంత్), అతని కుమార్తె తంగం (జాన్వీ కపూర్) పాత్రలు ఏమిటి? ఎర్ర సముద్రంలో ఏం జరిగింది? ఎర్ర సముద్రం మీదకు స్మగ్లింగ్ కోసం వెళ్లడానికి భయపడేంతగా దేవర ఏం చేశాడు? చివరకు ఏం తేలింది? అనేది సినిమా.
విశ్లేషణ (Devara Telugu Review): ఎన్టీఆర్ స్టార్ మాత్రమే కాదు... ఆయనలో మంచి నటుడు ఉన్నాడు. ఎటువంటి భావోద్వేగమైనా అద్భుతంగా చేయగలరు. కొరటాల శివ మంచి రచయిత. ఇంతకు ముందు ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్' వంటి హిట్ సినిమా తీశారు. పైగా, 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా ఉందా? అంటే...
దేవర, వర... రెండు పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచారు. పాటలు పక్కన పెడితే... అనిరుద్ రవిచందర్ నేపథ్య సంగీతంలో మార్క్ చూపించారు. ఆ ఇద్దరూ వందకు రెండొందల శాతం న్యాయం చేశారు. మరి, ఎందుకు అంచనాలు అందుకోలేదు? అంటే... సినిమా మీద ముందు నుంచి విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దానికి తోడు కథ, కథనాలు కమర్షియల్ పంథాలో ఉన్నాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏం జరుగుతుంది? అని చెప్పవచ్చు. కొరటాల శివ రచన, దర్శకత్వం అంచనాలు అందుకునే స్థాయిలో లేవు.
'మిర్చి', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'జనతా గ్యారేజ్'... కొరటాల శివ సూపర్ హిట్ సినిమాల్లో కథానాయకుడికి ఓ ఐడియాలజీ ఉంటుంది. దాంతో కనెక్ట్ చేస్తూ సన్నివేశాలు, వాటి నుంచి యాక్షన్ సీక్వెన్సులు రాసుకోవడం వల్ల హీరోయిజం ఎలివేట్ అయ్యేది. కథపై ప్రేక్షకుడిలోనూ ఆసక్తి కలిగేది. 'దేవర'లోనూ హీరోకి ఓ ఐడియాలజీ ఉంది. అయితే, అందులో కొత్తదనం లేదు. ఆయన హిట్ సినిమాల్లో ఉన్న ప్రత్యేకత లేదు. అన్నిటికీ మించి ఐడియాలజీని హీరోయిజం డామినేట్ చేసింది. దాంతో స్క్రీన్ ప్లే గానీ, క్యారేకరైజేషన్లను గానీ ఊహించడం ప్రేక్షకుడికి కష్టం కాదు. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు కథ, కథనాలు ఉన్నప్పుడు స్క్రీన్ మీద సన్నివేశాలు ఎంగేజ్ చేసేలా ఉండాలి. అక్కడ కొన్ని చోట్ల కొరటాల మార్క్ మిస్ అయ్యింది. జాన్వీ కపూర్ సీన్లు, ఆ డైలాగులు, క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలో కొరటాల చాలా డిజప్పాయింట్ చేశారు. ఎండింగ్ ట్విస్ట్ అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను గుర్తుకు తెస్తుంది. ఫస్టాఫ్ యాక్షన్, ఎన్టీఆర్ హీరోయిజంతో ముందుగు సాగింది. సెకండాఫ్‌లో కాస్త నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది.
కొరటాల రచన, దర్శకత్వం కాస్త బలహీనంగా ఉంటే... ఎన్టీఆర్ నటన, అనిరుద్ నేపథ్య సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం 'దేవర'కు బలం అయ్యాయి. సినిమాను చాలా వరకు తమ భుజాల మీద మోశాయి. యాక్షన్ సన్నివేశాలను రత్నవేలు పిక్చరైజ్ చేసిన తీరు గానీ, ఆయా సన్నివేశాలకు అనిరుద్ ఇచ్చిన స్కోర్ గానీ టాప్ లెవల్. అందమైన పెయింటింగ్ అన్నట్టు సినిమాను మలిచారు రత్నవేలు. సీన్‌లో కంటెంట్ కంటే అనిరుద్ ఎక్కువ కష్టపడి స్కోర్ చేశారు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. అండర్ వాటర్ సీక్వెన్సుల కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: 'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్
నటుడిగా ఎన్టీఆర్‌కు వంక పెట్టడానికి లేదు. దేవరగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. పాత్రకు తగ్గట్టు హుందాగా కనిపించారు. యాక్షన్ సీన్లలో అయితే అదరగొట్టారు. వర పాత్ర భయపడే సన్నివేశాల్లో, యాక్షన్ చేసేటప్పుడు నటుడిగా ఆయన అనుభవం - ప్రతిభ కనిపించాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర పరిధి పరిమితమే. ఉన్నంతలో అందంగా కనిపించారు. ఆమె నటన గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. సైఫ్ అలీ ఖాన్ ఓకే. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ గెటప్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సింది. మురళీ శర్మకు ఇటువంటి పాత్రలు చేయడం కొత్త కాదు. కానీ, మరోసారి ఆ పాత్రకు న్యాయం చేశారు. షైమ్ టాన్ చాకో, గెటప్ శ్రీను తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
స్టార్ హీరోగా, నటుడిగా తన నుంచి ఫ్యాన్స్, ప్రేక్షకులు కోరుకున్నది ఎన్టీఆర్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్సీలు, యాక్టింగులో 200 పర్సెంట్ అదరగొట్టారు. కొరటాల శివ కథ, కథనాలు ప్రేక్షకుడి ఊహకు అందుతూ ఉంటాయి. సెకండాఫ్ లెంగ్త్ ఎక్కువైంది. కానీ... అనిరుద్ రవిచందర్ సంగీతం కోసం, రత్నవేలు సినిమాటోగ్రఫీ కోసం 'దేవర'కు వెళ్లొచ్చు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం అయితే హ్యాపీగా వెళ్లొచ్చు. ఈ సినిమాకు అన్నిటి కంటే పెద్ధ ఛాలెంజ్... సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉండటం, వాటిని అధిగమించాల్సి రావడం! ఎన్టీఆర్ మాస్ జాతర... దేవర!
Also Read: మత్తు వదలరా 2 రివ్యూ: సత్య వన్ మ్యాన్ షో... నవ్వించారు కానీ కథ సంగతేంటి? సినిమా ఎలా ఉంది?