సినిమా రివ్యూ : హిడింబ 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : అశ్విన్ బాబు, నందితా శ్వేత, మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్ తదితరులు
మాటలు : కళ్యాణ్ చక్రవర్తి 
ఛాయాగ్రహణం : బి. రాజశేఖర్!
సంగీతం : వికాస్ బాడిస
సమర్పణ : అనిల్ సుంకర
నిర్మాత : గంగపట్నం శ్రీధర్
దర్శకత్వం : అనిల్ కన్నెగంటి
విడుదల తేదీ: జూలై 20, 2023


'రాజు గారి గది' సిరీస్ సినిమాలతో విజయాలు అందుకున్న కథానాయకుడు అశ్విన్ బాబు (Ashwin Babu). మధ్యలో 'నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్' చేశారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'హిడింబ' (Hidimba Movie) ఈ నెల 20న థియేటర్లలో విడుదల అవుతోంది. ఇందులో నందితా శ్వేతా (Nandita Swetha) కథానాయిక. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరి, సినిమా ఎలా ఉంది?


కథ (Hidimba Movie Story) : హైదరాబాద్ సిటీలో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతుంటారు. పదహారు మిస్సింగ్ కేసులు నమోదు కావడంతో ఇన్వెస్టిగేషన్ కోసం ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా)ను కేరళ నుంచి రప్పిస్తారు. అప్పటి వరకు కేసును ఇన్వెస్టిగేట్ చేసిన అభయ్ (అశ్విన్ బాబు) కొత్తగా వచ్చిన ఆద్యకు సహకారాలు అందించడా? లేదా? అరాచకాలకు అడ్డాగా మారిన కాలాబండాలోని బోయా (రాజీవ్ పిళ్ళై) ఎవరు? ఆద్య గతం ఏమిటి? నరమాంస భక్షక గిరిజన జాతి హిడింబాలకు, ఈ కేసుకు సంబంధం ఏమిటి? కేరళలో కొన్నేళ్ళ మహిళల అదృశ్యానికి, ఈ కేసుకు సంబంధం ఏమిటి? అంతరించిపోయిన హిడింబ జాతిలో చివరి వ్యక్తి ఎవరు? చివరకు ఏం తెలిసింది? అనేది మిగతా సినిమా.


విశ్లేషణ (Hidimba Movie Review) : 'హిడింబ' ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. మనుషులను తినే గిరిజన జాతి, సిటీలో అమ్మాయిల మిస్సింగ్, మరీ రా అండ్ రస్టిక్ టేకింగ్... ఎగ్జైట్ చేసిన అంశాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే... 'హిడింబ'లో కథ, కథాంశం కొత్తగా ఉన్నాయి. అయితే... ఆ కథను చెప్పిన తీరు మాత్రం రెగ్యులర్ రొటీన్ సినిమాలా ఉంది. సినిమా ఫస్టాఫ్ అంతా నార్మల్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ఉంటుంది. అయితే... నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కొంచెం ఆసక్తి కలిగించింది. 


'హిడింబ'లో కథంతా ద్వితీయార్థంలో ఉంది. మరీ ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఉంది. ఆ ట్విస్టులు, టర్నులు ఆసక్తిగా ఉంటాయి. అయితే... అప్పటి వరకు జరిగే కథ సాదాసీదాగా ఉంటుంది. కానీ, తర్వాత ఏదో జరగబోతుందనే ఆసక్తి కొంచెం కొంచెం పెంచుతూ ముందుకు తీసుకు వెళ్ళారు. మధ్యలో హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ / సాంగ్ నిడివి తక్కువ అయినా సరే అసలు కథకు అడ్డు తగిలాయి. కానీ, స్క్రీన్ మీద గ్రాండియర్ ఆకట్టుకుంటుంది. 


స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో యాక్షన్ సీక్వెన్సులను డిజైన్ చేశారు. ఈ ఫైట్స్ అశ్విన్ బాబు కూడా బాగా చేశారు. అయితే... హీరో అంత బలవంతుడు అని ప్రేక్షకులు నమ్మేలా క్యారెక్టర్ డిజైన్ చేయలేదు. క్రైమ్ థ్రిల్లర్ కథలో యాక్షన్ సీన్లు బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. థ్రిల్లింగ్ సీన్లను బాగా రాశారు. 'హిడింబ' బాలేదని చెప్పలేం. అలాగని, బావుందని చెప్పలేం. ఏదో మిస్ అయిన ఫీలింగ్. ఈ తరహా సినిమాలకు లాజిక్కులు చాలా ముఖ్యం. దర్శకుడు ఆ లాజిక్కులను గాలికి వదిలేశారు. సిటీ వదిలి వెళ్ళకూడదని ఆద్యతో డీజీపీ చెబుతారు. ఆవిడ కేరళ వెళ్లి వస్తుంది. స్టార్టింగులో ఆర్గాన్ ట్రేడింగ్ అంటారు. తర్వాత ఆ ఊసు ఉండదు. దాన్ని గాలికి వదిలేశారు. స్క్రీన్ ప్లే, రైటింగ్ పరంగా దర్శకుడు చాలా స్వేచ్ఛ తీసుకుని సినిమా చేశారు. సినిమాటిక్ లిబర్టీస్ విపరీతంగా తీసుకున్నారు.   


హిడింబ జాతి నేపథ్యం ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసేలా ఉంటుంది. అయితే... ఆ కథను ఇంటెర్వెల్ తర్వాత చెప్పారు. తర్వాత ఆ ఉత్కంఠ కంటిన్యూ చేయడంలో అంతగా సక్సెస్ కాలేదు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ & మ్యూజిక్. ప్రతి ఫేమ్, విజువల్ బావున్నాయి. నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్ సీన్లను ఎలివేట్ చేశాయి. నిర్మాణంలో రాజీ పడలేదని సినిమా చూస్తుంటే అర్థం అవుతోంది.


నటీనటులు ఎలా చేశారు? : సాధారణ సన్నివేశాల్లో కంటే యాక్షన్ సీక్వెన్సుల్లో అశ్విన్ బాబు ఎక్కువ మెప్పిస్తారు. కాలాబండా ఫైట్ గానీ, కేరళలో తీసిన ఫైట్ గానీ బాగున్నాయి. యాక్షన్ సీన్లకు ఆయన న్యాయం చేశారు. పతాక సన్నివేశాల్లో నటన కూడా బావుంది. ఐపీఎస్ ఆద్య పాత్రలో నందితా శ్వేతా డ్రస్సింగ్ స్టైల్, యాక్టింగ్ బావున్నాయి. మకరంద్ దేశ్‌పాండే బదులు మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేం. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, షిజ్జు, శ్రీనివాసరెడ్డి, రాజీవ్ పిళ్ళై తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.


Also Read : నాయకుడు రివ్యూ: రెండు ఆలోచనల మధ్య యుద్ధం - ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ సినిమా ఎలా ఉంది?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'హిడింబ'లో కొత్త పాయింట్ చెప్పారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి కథను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే... ఆ కథను ఆసక్తిగా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. అశ్విన్ బాబు పడిన కష్టం తెరపై తెలుస్తుంది. పార్టులు పార్టులుగా బావుంటుంది. కానీ,  ఓ కథగా, సినిమాగా చూసినప్పుడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. కాస్త డిజప్పాయింట్ అవుతాం. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ షాక్ ఇస్తుంది. క్లైమాక్స్ సీక్వెల్ ఉంటుందని హింట్ ఇస్తుంది. 


Also Read : 'బేబీ' రివ్యూ : ఆనంద్, విరాజ్ - ఇద్దరిలో వైష్ణవి చైతన్య ఎవరి పిల్ల? లేడీ అర్జున్ రెడ్డి అనే సినిమానా?








ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial