'బాహుబలి' తర్వాత ఆ స్థాయి విజయం రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)కి రాలేదు. అంచనాలు పెంచిన 'సాహో' సరైన ఫలితం ఇవ్వలేదు. 'రాధే శ్యామ్' అయితే చాలా డిజప్పాయింట్ చేసింది. 'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత ప్రభాస్  వీరాభిమానులు సైతం అంచనాలు పెట్టుకోవడం మానేశారు. ఆ సినిమా ఫలితం ముందుగా ఊహించమని చెప్పారు. 'ప్రాజెక్ట్ కె' (Project K)తో మళ్ళీ ప్రభాస్ పూర్వ వైభవం అందుకుంటారని, భారీ విజయం ఖాయమని అభిమానులు ఆశించారు. వాళ్ళ ఆశల మీద ఫస్ట్ లుక్ నీళ్లు చల్లింది. 


ఫ్యాన్ మేడ్ పోస్టర్లే బావున్నాయ్!
'ప్రాజెక్ట్ కె' టీమ్ అధికారికంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు బావున్నాయని నెటిజనులు కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ లుక్ అభిమానుల్లో చాలా మందిని డిజప్పాయింట్ చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. 'ఆదిపురుష్' హ్యాంగోవర్ నుంచి బయట పడక ముందు 'ప్రాజెక్ట్ కె' లుక్ విడుదల చేశారని వ్యంగ్యంగా ఒకరు కామెంట్ చేయడం విశేషం. ఇక, మీమర్స్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. సెటైర్లతో రెచ్చిపోతున్నారు. 






అమీర్‌ పేట్ గ్రాఫిక్స్ బెటర్...
'ఐరన్ మ్యాన్'కి కాపీ పోస్టర్!
ఓ మీమ్ పేజీలో 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ లుక్ గ్రాఫిక్స్ అసలు బాలేదని పోస్ట్ చేశారు. దాని కంటే అమీర్‌ పేట్ కంపెనీల్లో చేసే విజువల్ ఎఫెక్ట్స్ బావుంటాయని పేర్కొన్నారు. మరొక మీమ్ పేజీలో అయితే ఎవరి బాడీకో ప్రభాస్ ఫేస్ అతికించినట్టు ఉందని ట్రోల్ చేశారు. 'ఐరన్ మ్యాన్' లుక్ కాపీ చేశారని కొందరు పేర్కొన్నారు. 'ప్రాజెక్ట్ కె' లుక్ విడుదలైందో? లేదో? మీమర్స్, ట్రోలర్స్ రెచ్చిపోయారు. పండగ చేసుకున్నారు.  






నాగ్ అశ్విన్ మీద నమ్మకం ఉంచండి!
'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ లుక్ మీద వస్తున్న విమర్శలను పక్కన పెట్టి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ మీద నమ్మకం ఉంచమని కొందరు చెబుతున్నారు. సావిత్రి జీవిత కథతో 'మహానటి' తీసి మెప్పించిన నాగ్ అశ్విన్, అంత ఆషామాషీగా చెత్త సినిమా తీయడని నమ్ముతున్నారు. టైటిల్ గ్లింప్స్ విడుదలైతే తప్ప ఈ ట్రోల్స్ ఆగేలా లేవు. అదీ అభిమానులను మెప్పిస్తే మాత్రమే! లేదంటే మళ్ళీ ట్రోల్స్ స్టార్ట్ అయ్యేలా ఉన్నాయి. 


Also Read  త్రివిక్రమ్ కథతో రానా 'హిరణ్యకశ్యప' - హాలీవుడ్ గడ్డపై ప్రకటన







ఒక్కటి మాత్రం స్పష్టం అయ్యింది... 'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ సూపర్ హీరోగా యాక్ట్ చేస్తున్నారని! సైన్స్ ఫిక్షన్ కథతో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ కథానాయిక కాగా... బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, 'లోఫర్' ఫేమ్ దిశా పటానీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Also Read నిర్మాతగా 'బాహుబలి' సేతుపతి - ఈసారి కొత్త హీరో హీరోయిన్లతో!
 
అమెరికాలో జరుగుతున్న కామిక్ కాన్ 2023 వేడుకల్లో సినిమా టైటిల్ వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం కోసం ప్రభాస్, దీపికా పదుకోన్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్, దిశా  పటానీ తదితరులు వెళ్లారు. వీళ్ళతో రానా దగ్గుబాటి కూడా జాయిన్ కానున్నారు. 




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
























గమనిక : సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్, మీమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు, ఏబీపీ దేశానికి ఎటువంటి సంబంధం లేదు. వాటికి సంస్థ బాధ్యత వహించదని తెలియజేయడమైనది.