మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)తో కలిసి రానా దగ్గుబాటి (Rana Daggubati) మరోసారి పని చేయనున్నారు. ఓ సినిమా చేయనున్నారు. అయితే... ఈసారి త్రివిక్రమ్ కేవలం స్క్రిప్ట్ మాత్రమే అందిస్తారా? లేదంటే దర్శకత్వం వహిస్తారా? అనేది చూడాలి. పూర్తి వివరాల్లోకి వెళితే... 


త్రివిక్రమ్ కథతో 'హిరణ్యకశ్యప'
రానా దగ్గుబాటి డ్రీమ్ ప్రాజెక్టుల్లో 'హిరణ్యకశ్యప' (Hiranyakashyap Movie) ఒకటి. అమర చిత్ర కథల ఆధారంగా రూపొందనున్న చిత్రమిది. ఇందులో రాక్షసరాజు హిరణ్యకశిపునిగా రానా టైటిల్ రోల్ పోషించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనేది ప్లాన్. ఇప్పుడీ సినిమాకు త్రివిక్రమ్ కథ అందిస్తున్నట్లు అమెరికాలోని కామిక్ కాన్ 2023 వేడుకల్లో రానా వెల్లడించారు. 






పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'లో రానా నటించిన సంగతి తెలిసిందే. మలయాళ హిట్ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా రూపొందిన ఆ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించారు. త్రివిక్రమ్, రానా కలయికలో తొలి సినిమా అది. ఈ 'హిరణ్యకశ్యప'కు త్రివిక్రమ్ కథ మాత్రమే అందిస్తారా? లేదంటే దర్శకత్వం కూడా వహిస్తారా? అనేది చూడాలి. ఎందుకు అంటే... దర్శకుడిగా ఆయన పేరు బలంగా వినిపించింది. 


గుణశేఖర్ దర్శకుడిగా మొదలైన సినిమా!
నిజం చెప్పాలంటే... గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' మొదలైంది. స్క్రిప్ట్ డిస్కషన్స్ నుంచి ప్రీ విజువలైజేషన్ వరకు చాలా వర్క్స్ జరిగాయి. అయితే... ఆ  వర్క్స్ ఏవీ సంతృప్తికరంగా సాగలేదని సమాచారం. గుణశేఖర్ పనితీరు మీద రానా తండ్రి, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబుకు నమ్మకం రాలేదట. దాంతో సినిమా నుంచి ఆయన్ను పక్కన పెట్టినట్లు ఫిల్మ్ నగర్ గుసగుస. 


పురాణాలు, ఇతిహాస గాధలు వంటి విషయాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని, ఆయన్ను రానా, సురేష్ బాబు సంప్రదించినట్లు తెలుస్తోంది. 


Also Read : హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా రెబల్ స్టార్... 'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్


'హిరణ్యకశ్యప'ను తొలుత సురేష్ ప్రొడక్షన్స్ మీద నిర్మించాలని అనుకున్నారు. త్రివిక్రమ్ రాకతో పరిస్థితులు మారవచ్చని టాక్. ఈ మధ్య కాలంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో తప్ప ఇతర నిర్మాణ సంస్థలకు త్రివిక్రమ్ సినిమాలు చేయలేదు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థను స్థాపించి తన సతీమణి లక్ష్మీ సౌజన్య నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. ఒకవేళ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తే... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ కూడా యాడ్ అవుతుంది. 


'గుంటూరు కారం' & బన్నీ సినిమాల తర్వాత...
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'గుంటూరు కారం' చేస్తున్నారు త్రివిక్రమ్. 'అతడు', 'ఖలేజా' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది. దీని తర్వాత అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఆ సినిమా ప్రకటన కూడా వచ్చింది. రానా 'హిరణ్యకశ్యప'కు దర్శకత్వం వహిస్తే... ఆ రెండు సినిమాల తర్వాత ఉంటుంది. 'విరాట పర్వం' తర్వాత రానా మరొక సినిమా చేయలేదు. 'హిరణ్య కశ్యప' సినిమా స్టార్ట్ అయ్యే వరకూ మరో సినిమా చేయకూడదని, ఏడాది పాటు ఖాళీగా ఉండాలని ఆయన ప్లాన్ చేసుకున్నారట.


Also Read : నిర్మాతగా 'బాహుబలి' సేతుపతి - ఈసారి కొత్త హీరో హీరోయిన్లతో!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial