సినిమా రివ్యూ : బేబీ
రేటింగ్ : 3/5
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన తదితరులు
ఛాయాగ్రహణం : ఎం.ఎన్. బాల్ రెడ్డి
సంగీతం : విజయ్ బుల్గానిన్
నిర్మాత : ఎస్.కె.ఎన్
రచన, దర్శకత్వం : సాయి రాజేష్ నీలం
విడుదల తేదీ: జూలై 14, 2023
సాయి రాజేష్ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'బేబీ' (Baby Movie). జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫోటో'కు ఆయనే రచయిత. ఆ సినిమా తర్వాత సాయి రాజేష్ నుంచి వస్తున్న చిత్రమిది. ఇందులో విజయ్ దేవరకొండ (Anand Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఓ హీరో. 'అల వైకుంఠపురములో' సహా కొన్ని సినిమాల్లో, 'సాఫ్ట్‌వేర్ డేవ్‌లవ్‌పర్' వెబ్ సిరీస్‌లో నటించిన వైష్ణవి చైతన్య ఈ సినిమాతో కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ మరో హీరో. ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా (Baby Review) ఎలా ఉందంటే?
కథ (Baby Movie Story) : వైష్ణవి (వైష్ణవి చైతన్య) బస్తీలో అమ్మాయి. ఎదురింటిలో ఉన్న అబ్బాయి ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను ప్రేమిస్తుంది. ఆమెను అతడూ ప్రేమిస్తాడు. అయితే... టెన్త్ ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ అవుతాడు. వైష్ణవి ఇంజనీరింగ్ జాయిన్ అవుతుంది. కొత్త పరిచయాలు వైష్ణవిలో మార్పుకు కారణం అవుతాయి. విరాజ్ (విరాజ్ అశ్విన్)కు దగ్గర అవుతుంది. పబ్బులో అతడితో రొమాన్స్ చేస్తుంది.
కాలేజీలో కుర్రాడితో రొమాన్స్ విషయం ఆనంద్‌కు తెలిసిందా? తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? పదో తరగతి నుంచి ఇంటి ఎదురుగా ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్న సంగతి విరాజ్‌కు తెలిసిందా? తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆనంద్, విరాజ్... ఇద్దరిలో వైష్ణవి ఎవరిని ప్రేమించింది? చివరికి ఏమైంది? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Baby Movie Review) : పాఠశాల, కాలేజీల్లో ఈతరం ప్రేమ కథల గురించి వార్తల్లో చదువుతున్నాం, తరచూ టీవీల్లో చూస్తున్నాం. సాయి రాజేష్ వాటిని చూసి స్ఫూర్తి పొందారో? లేదో? ఆయన కథలో ఆ కథలు అన్నీ కనిపించాయి. ఆ కథల నుంచి బలమైన సన్నివేశాలను, హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను ఆయన రాసుకున్నారు. యువతలో చాలా మంది తమను తాము తెరపై చూసుకుంటారు. సమాజంలో జరుగుతున్న అంశాలకు దర్శకుడు 'బేబీ'తో ఓ రూపం ఇచ్చారు.
ప్రీ ఇంటర్వెల్ వరకు 'బేబీ' కథ నిదానంగా సాగుతుంది. పాఠశాలలో ప్రేమకథ ఎక్కువ సేపు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే... మధ్యలో మంచి పాటలు మనల్ని ఆకట్టుకుంటాయి. ప్రీ ఇంటర్వెల్ దగ్గర అసలు కథ, కథలో కాన్‌ఫ్లిక్ట్ మొదలైంది. 'ప్రేమిస్తే'తో పాటు కొన్ని సినిమాలు గుర్తు రావచ్చు. అయితే... కథానాయికలో మానసిక సంఘర్షణ, నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టింది.
ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్... ఇద్దరితో వైష్ణవి చైతన్య సన్నివేశాలు ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుందో? అని ఆసక్తి రేపాయి. థియేటర్లలో ఆ సీన్లకు విజిల్స్, క్లాప్స్ పడటం గ్యారెంటీ. ఇంటర్వెల్ తర్వాత కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంది. 'ప్రేమిస్తున్నా...' పాట, ఆ నేపథ్యంలో వచ్చే సీన్లు మౌనంగా చూసేలా చేస్తాయి. ఆ తర్వాత ఏమవుతుందో? అని ఆలోచింపజేస్తాయి. పతాక సన్నివేశాలు భావోద్వేగ భరితంగా సాగుతాయి. తండ్రి ప్రేమను చక్కగా ఆవిష్కరించారు.
'బేబీ'కి అసలైన బలం ఇంటర్వెల్, క్లైమాక్స్ & మాటలు, పాటలు! సాయి రాజేష్ రచనలో కొన్ని మాటలు థియేటర్లలో ఆటం బాంబుల్లా పేలతాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మీద అభిమానాన్ని కూడా చూపించారు. క్యారెక్టర్లు, ఆ క్యారెక్టరైజేషన్స్ కంటే ముఖ్యంగా సొసైటీని రిప్రజెంట్ చేసేలా సాయి రాజేష్ సీన్లు రాశారు. 'ల...జ' అని తిడుతూ అమ్మాయిలను హార్ట్ చేయడం గురించి రాసిన సీన్ మహిళలకు నచ్చే అవకాశాలు ఎక్కువ. మూడు పాత్రలతో సినిమాను నడిపించడం మాటలు కాదు. దర్శకుడిగా ఆ విషయంలో సాయి రాజేష్ పట్టు చూపించారు. పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. కెమెరా వర్క్ అందంగా ఉంది. నిడివి ఇంకొంచెం తగ్గిస్తే బావుండేది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : 'బేబీ'లో కొత్త ఆనంద్ దేవరకొండ కనిపించారు. మనం ఇప్పటి వరకు చూసిన ఆనంద్ వేరు, ఈ సినిమాలో ఆనంద్ వేరు. అతని నటనలో సహజత్వం కనిపించింది. బస్తీలో ఆటో డ్రైవర్లు, పదో తరగతిలో ప్రేమలో పడిన యువకులు ఎలా ఉంటారో? అలా కనిపించారు, నటించారు. ఎమోషనల్ సీన్లు బాగా చేశారు. నటుడిగా ఆనంద్ దేవరకొండ బెస్ట్ సినిమా ఇది. ఇంతకు ముందు చేసిన సినిమాల్లో విరాజ్ అశ్విన్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మరోసారి మంచి నటన కనబరిచారు. సంపన్న కుటుంబంలో జన్మించిన యువకుడిగా విరాజ్ చక్కగా చేశారు. ఎమోషన్స్ కూడా పలికించారు.
బస్తీలో అమ్మాయి, గ్లామర్ గాళ్... వైష్ణవి చైతన్య అయితే లుక్స్ పరంగా వేరియేషన్ చూపించడమే కాదు, నటిగానూ ఆకట్టుకున్నారు. ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే అద్భుతంగా చేశారు. కథానాయికగా వైష్ణవి చైతన్యకు మంచి డెబ్యూ ఇది. హీరో స్నేహితులుగా హర్ష, సాత్విక్ పాత్రలు పరిమితమే. ఉన్నంతలో ఇద్దరూ బాగా చేశారు. నాగబాబు నటించడం వల్ల తండ్రి పాత్రకు హుందాతనం వచ్చింది. ఓ ముఖ్యమైన సన్నివేశంలో ఆయన నటన ఆకట్టుకుంటుంది.
Also Read : నాయకుడు రివ్యూ: రెండు ఆలోచనల మధ్య యుద్ధం - ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ సినిమా ఎలా ఉంది?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'గుండెలపై కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వరూ కొట్టలేరు' - 'బేబీ' సినిమాలో వైష్ణవి చైతన్య డైలాగ్. నిజమే... 'బేబీ'లో కొన్ని మాటలు ప్రేక్షకుల గుండెలపై గట్టిగా కొడతాయి. బలమైన ముద్ర వేస్తాయి. సాయి రాజేష్ రచన, దర్శకత్వంలో బలమైన సన్నివేశాలు, సమాజాన్ని కళ్ళ ముందు ఉంచే కథ ఉన్నాయి. పాటలు మనసును హత్తుకుంటాయి. హీరో హీరోయిన్లు ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తుండే సినిమా 'బేబీ'.
Also Read : : నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial