Director

టవీవట్ వాంతా

Starring

నడేక్ కుగిమియా, కజ్బండిట్ జైడీ, పీరకిత్ పచ్చరబున్యకియత్, డెనీస్ జెలిల్చా కపౌన్, రత్తనవేడ్ వాగ్టాంగ్, నుత్తచ్చా పడోవన్

Available On

Netflix

Death Whisperer Review In Telugu: థాయ్, కొరియన్ లాంటి భాషల్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే వారు హారర్ సినిమాలను ఎక్కువగా రియాలిస్టిక్‌గా తెరకెక్కిస్తూ ఉంటారు. దాంతో పాటు అందులో ప్రేక్షకులను భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తారు. అలాంటి సినిమాల్లో ఒకటి ‘డెత్ విస్పరర్’. ఒరిజినల్‌గా థాయ్ భాషలో ఈ మూవీ టైటిల్ ‘టీ యోడ్’. మామూలుగా చాలా హారర్ చిత్రాల్లో ఉండే చాలావరకు కామన్ పాయింట్స్.. ఈ సినిమాలో కూడా ఉన్నాయి. కానీ నటీనటుల నటన మాత్రం ‘డెత్ విస్పరర్’ను మరోస్థాయికి తీసుకెళ్తుంది. ఈ చిత్రాన్ని ఒక వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించారట.

కథ

1972లో సిటీకి దూరంగా కంచనబూరీ అనే ప్రాంతానికి ఒక థాయ్ - చైనీస్ ఫ్యామిలీ షిఫ్ట్ అవుతుంది. ఆ కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉంటారు. కొడుకుల పేర్లు యాక్ (నడేక్ కుగిమియా), యోస్ (కజ్బండిట్ జైడీ), యోడ్ (పీరకిత్ పచ్చరబున్యకియత్). కూతుళ్ల పేర్లు యాడ్ (డెనీస్ జెలిల్చా కపౌన్), యామ్ (రత్తనవేడ్ వాగ్టాంగ్), యీ (నుత్తచ్చా పడోవన్). ఇంటికి పెద్ద కొడుకు అయిన యాక్.. మిలిటరీలో పనిచేస్తూ ఇంటికి దూరంగా ఉంటాడు. ముందుగా ఆ ప్రాంతం ఆ కుటుంబానికి చాలా నచ్చుతుంది. కానీ వీరు కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన కొన్నిరోజుల్లోనే ఆ ఊరిలో అనుమానాస్పద రీతిలో ఒక అమ్మాయి మరణిస్తుంది.

చనిపోయిన అమ్మాయికి ఏం జరిగిందో.. అదే ఈ కుటుంబంలో కూడా జరగడం మొదలవుతుంది. రెండో కూతురు అయిన యామ్.. విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. తనకు ఏదో నల్లటి ఆకారం కనిపిస్తుందని చెప్తూ ఉంటుంది. మెల్లగా తనతో పాటు మిగతా ఇద్దరు అమ్మాయిలకు కూడా అలాంటి ఆకారం కనిపిస్తూ ఉంటుంది. స్కూల్ నుండి ఇంటికి వచ్చే దారిలో వారికి ఈ ఆకారం ఎక్కువగా కనిపిస్తూ ఉందని అందరికీ చెప్తారు. మెల్లగా యామ్ ఆరోగ్యం మరింత క్షీణించిపోతుంది. వింతగా ప్రవర్తిస్తూ, గొంతును మార్చి మాట్లాడుతూ ‘టీ యోడ్’ అని మాత్రమే అరుస్తూ ఉండేది. దీంతో తన కుటుంబాన్ని కాపాడడం కోసం పెద్ద కొడుకు అయిన యాక్.. తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇక యాక్ తిరిగొచ్చిన తర్వాత ఏం జరిగింది? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలిగాడు? అన్నది తెరపై చూడాల్సిన కథ.

విశ్లేషణ

రక్తం తాగే దెయ్యాలపై ‘డెత్ విస్పరర్’ సినిమా ఆధారపడి ఉంటుంది. దీంతో మూవీలో ఇతర హారర్ ఎలిమెంట్స్‌తో పాటు రక్తం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ముందుగా ఆ ఊరిలో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు తను రక్తం కక్కుకున్నట్టుగా చూపించే సీన్‌తో అసలు సినిమా అంతా ఎలా ఉండబోతుంది అనే విషయం క్లారిటీ వస్తుంది. హారర్ సినిమాలంటే ఎక్కువగా లాజిక్స్ లేకుండానే ఉంటాయి. కానీ ‘డెత్ విస్పరర్’ను అలా కాకుండా భిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు టవీవట్ వాంతా. అనవసరమైన హడావిడి లేకుండా ఎక్కువగా చిత్రాన్ని ప్రాక్టికల్ పద్ధతిలో నడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఒక కుటుంబంలో ఇలాంటిది జరిగినప్పుడు వారంతా కలిసి ఎంత ధైర్యంగా దీనిని ఎదుర్కోగలరు లాంటి ఎమోషనల్ విషయాన్ని కూడా ఇందులో జతచేర్చాడు దర్శకుడు. ఇక క్యాస్టింగ్ విషయంలో ఆయన 100 శాతం సక్సెస్ అవ్వడంతో మూవీ వేరే లెవెల్‌కు వెళ్లి చేరుకుంది.

Also Read: ‘పారాసైట్: ది గ్రే’ వెబ్ సిరీస్ రివ్యూ - పిల్లలు దూరంగా ఉంటే బెటర్, పెద్దలూ మీ గుండె జాగ్రత్త!

సినిమాకు తనే ప్రాణం..

హారర్ సినిమాలు అనేవి ఎక్కువగా హారర్ సీన్స్, ఎలిమెంట్స్‌పైనే ఆధారపడి ఉంటాయి. కానీ ‘డెత్ విస్పరర్’ అలా కాదు. ఈ చిత్రాన్ని పూర్తిగా నిలబెట్టిన క్రెడిట్ మాత్రం యాక్ పాత్రలో కనిపించిన నడేచ్ కుగిమియాకే వెళ్తుంది. ఇంటికి పెద్ద కొడుకు కావడంతో తన కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉంటుంది. అయినా తను కూడా వయసులో చిన్న కాబట్టి అసలు ఆ దెయ్యాలను ఎలా ఎదుర్కోవాలో తనకు కూడా తెలియదు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ నడేచ్ నటన అద్భుతంగా ఉంటుంది. థాయ్ సినిమాలు ఎక్కువగా ఫాలో అయ్యేవారికి నడేచ్ సుపరిచితడే. తను ఎలా సూపర్ హిట్ సినిమాల్లో, సిరీస్‌లలో నటించాడు. కానీ ‘డెత్ విస్పరర్’లో తన పాత్ర వాటన్నింటికి భిన్నంగా ఉంటుంది. ‘టీ యోడ్.. ఏ డిస్టంట్ వాయిస్ వెయిల్స్ మ్యాడ్లీ’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు టవీవట్ వాంతా. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంది.

Also Read: ష్.. గప్‌చుప్, శబ్దం చేస్తే.. ఆ వింత జీవులు చంపేస్తాయ్ - అసలు అవి ఎక్కడ నుంచి వచ్చాయ్?