నెట్‌ఫ్లిక్స్ కి యుగాంతానికి సంబంధించిన చిత్రాల మీద ఉన్న మోజు అంతా ఇంతా కాదు. 'Bird box', 'How it ends', 'Cargo' వంటివి కూడా ఈ తరహా చిత్రాలే. ఈ కాన్సెప్ట్ తో హాలీవుడ్‌లో బోలెడు సినిమాలు వచ్చాయి. కానీ 2019లో విడుదలైన 'ది సైలెన్స్' మాత్రం మిగిలిన పోస్ట్ అపోకలిప్టిక్ సినిమాల కంటే కొంత భిన్నంగా ఉంటుంది. 


ఒక పరిశోధనా బృందం 800 అడుగుల లోతున్న ఓ గుహను పగలగొట్టినపుడు ఆ గుహ నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ నుంచి 'వెస్ప్స్' అని పిలవబడే కొన్ని వింత జీవులు ఆ పరిశోధకులను క్రూరంగా చంపి, శబ్దం వినిపించే చోటును వెతుకుతూ బయటి ప్రపంచంలోకి వస్తాయి. ఒక కారు ప్రమాదంలో వినికిడి కోల్పోయిన అల్లీ ఆండ్రూస్, ఆమె తల్లిదండ్రులు హ్యూ , కెల్లీ ఆండ్రూస్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె అమ్మమ్మ లిన్, ఆమె తమ్ముడు జూడ్, వారి పెంపుడు కుక్క ఓటిస్‌తో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నారు. వెస్ప్ అనే జీవులు అందర్నీ చంపేస్తున్నాయనే వార్తలు వ్యాపించడంతో, ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తుంది. ప్రజలను ఇంట్లోనే నిశ్శబ్దంగా ఉండమని చెప్తుంది.


శబ్దం ఎక్కువగా ఉండని గ్రామీణ ప్రాంతానికి వెళ్దామని అల్లీ కుటుంబానికి సూచిస్తుంది. హ్యూ ఫ్రెండ్ అయిన గ్లెన్ కూడా వారితో పాటే వస్తానని తుపాకులు తీసుకొస్తాడు. రెండు కార్లలో బయలుదేరుతారు. హ్యూ కారును ఓ వ్యక్తి హైజాక్ చేయటానికి ప్రయత్నిస్తాడు. అతన్ని గ్లెన్ కాలు మీద గన్ తో కాలుస్తాడు. విపరీతమైన ట్రాఫిక్ ఉండటంతో గ్లెన్ కారును రోడ్ పై నుంచి మళ్లించి వెళ్లినపుడు, అతని కారు జింకల గుంపును ఢీ కొట్టి, లోయలో పడిపోతుంది. గ్లెన్ కారులో చిక్కుకుపోతాడు. కాపాడటానికి హ్యూ కుటుంబం ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. దారిలో వారి పెంపుడు కుక్క అరుపులకు ఆ వెస్ప్స్ పసిగడతాయని, బలవంతంగా కుక్కను కార్ నుంచి బయటకు పంపుతాడు హ్యూ.


ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని.. వారంతా సమీపంలో ఓ ఇంటికి వెళ్తారు. వెస్ప్స్ సంగతి తెలియని అక్కడి ఇంటి యజమాని గట్టిగా మాట్లాడుతుంది. ఆమె మాటల విని వెస్ప్స్ వచ్చి, ఆమెను దారుణంగా చంపేస్తాయి. వాటి నుంచి ఆమెను రక్షించేందు ప్రయత్నించిన కెల్లీ కాలును కరుస్తాయి. హ్యూ యూ వాటిని తరిమేయటానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. చివరికి వారు ఆ ఇంట్లోకి వెళ్తారు. అక్కడ అల్లీకి తన బోయ్ ఫ్రెండ్ రాబ్ కనిపించి, అతని పేరెంట్స్ చనిపోయిన విషయం చెప్తాడు. కెల్లీ కాలికి అయిన గాయం ఇబ్బంది పెడుతుంది. వాళ్లు యాంటీబయోటిక్స్ తేవటానికి హాస్పిటల్ వెళ్తారు. అక్కడ శవాల్లో వెస్ప్స్ గుడ్లు పెరుగుతున్నట్లు అల్లీకి తెలుస్తుంది. వెస్ప్స్ చల్లటి ప్రదేశాల్లో ఉండవని ఇంటర్నెట్ లో తెలుసుకుంటుంది. కెల్లీ కోలుకున్నాక చల్లటి ప్రాంతానికి బయల్దేరుతారు.


అదే ప్రాంతంలో ముందు నుంచే ఎంతోమంది బతుకుతుంటారు. మనుషులు శబ్దం చేయకుండా తన లాంటి సైన్ లాంగ్వేజ్ కు అలవాటు పడిపోతారో లేదా వెస్ప్స్ చల్లటి ప్రదేశాల్లో బతకటానికి అలవాటు పడతాయో అని అల్లీ అనుకుంటుంది. చివరికి వారు వెస్ప్స్ ని తరిమేసే మార్గం కనుగొన్నారా? లేదా వాటి వల్ల యుగాంతం జరిగిందా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే విజువల్స్ కూర్చున్న చోటు నుంచి మనల్ని కదలనివ్వవు. ‘A Quiet Place’ కూడా ఇదే కాన్సెప్ట్‌తో ఉంది. ఆ మూవీ కూడా భలే ఉత్కంఠంగా సాగుతుంది.


Also Read: ఫ్రెండ్‌తో కోడలు ఎఫైర్ - అత్తను హత్యచేసి మామకు అడ్డంగా దొరికిపోతుంది, ఇక అన్నీ ట్విస్టులే!