సినిమా రివ్యూ : ఛత్రపతి (హిందీ)
రేటింగ్ : 2/5
నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నుష్రత్ బరుచ, శరద్ ఖేల్కర్, భాగ్యశ్రీ తదితరులు 
కథ : వి.విజయేంద్ర ప్రసాద్
స్క్రీన్‌ప్లే: ఎ.మహాదేవ్
మాటలు : మయర్ పురి
ఛాయాగ్రహణం : నిజార్ షఫీ
పాటలు : తనిష్క్ బగ్చి
నేపథ్య సంగీతం : రవి బస్రూర్
నిర్మాత : జయంతిలాల్ గడ
దర్శకత్వం : వి.వి.వినాయక్
విడుదల తేదీ: మే 12, 2023


Chatrapathi Review: 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ ప్రభాస్‌ను స్టార్ హీరోను చేసింది. ప్రస్తుతం మనదేశంలో హీరోలని మించిన స్టార్ అయిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సినిమాలతో హిందీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి ‘ఛత్రపతి’ రీమేక్‌ను ఎంచుకున్నారు. మాస్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన వి.వి.వినాయక్‌కు దర్శకత్వ బాధ్యతలు అందించారు. టీజర్లు, ట్రైలర్లు యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేశారు. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది?


కథ (Chatrapathi Hindi Movie Story): శివ (బెల్లంకొండ శ్రీనివాస్) తన తల్లి (భాగ్యశ్రీ), తమ్ముడితో (కరణ్ సింగ్ ఛబ్రా) కలిసి పాకిస్తాన్‌లో ఉంటాడు. కానీ అక్కడ జరిగిన గొడవల కారణంగా చిన్నతనంలో పాకిస్తాన్ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడ్డ గందరగోళంలో తల్లి, తమ్ముడు తప్పిపోతారు. పడవలో తప్పించుకున్న శివ గుజరాత్ తీరప్రాంతానికి చేరుకుంటాడు. శివతో పాటు ఉన్న శరణార్థులు అందరినీ గుజరాత్‌లోని లోకల్ రౌడీ భైరవ్ (ఫ్రెడ్డీ దారూవాలా) బానిసల్లా చూస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో జరిగిన గొడవలో భైరవ్‌ని శివ చంపేసి ఛత్రపతిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవ్ అన్న భవాని (శరద్ ఖేల్కర్) ఏం చేశాడు? శివ తన తల్లిని, తమ్ముడిని ఎలా కనుక్కున్నాడు? అనేది మిగతా కథ.


విశ్లేషణ (Chatrapathi Hindi Movie Review in Telugu): ‘ఛత్రపతి’ కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమాని ఎన్నో సార్లు టీవీల్లో కూడా చూసేసి ఉంటాం. వేరే భాషలో రీమేక్ అవుతుందన్నా ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. కానీ ఒక తెలుగు హీరో, ఒకప్పటి తెలుగు స్టార్ డైరెక్టర్ ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేయడమే ‘ఛత్రపతి’ని వార్తల్లో నిలిచేలా చేసింది. బాలీవుడ్ ఆడియన్స్ కంటే ఈ సినిమాను ఎలా తీసి ఉంటారో అని తెలుగు ఆడియన్స్‌కే ఎక్కువ ఆసక్తి నెలకొంది.


కొన్ని క్లాసిక్ సినిమాలను టచ్ చేయకూడదు. ఎందుకంటే మక్కీకి మక్కీ దించినా ఆడియన్స్ అవుట్ రైట్‌గా రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది. గతంలో కొన్ని సినిమాలతో ఇది రుజువు అయింది కూడా. ప్రభాస్ కెరీర్‌లో ‘ఛత్రపతి’ ఒక క్లాసిక్. ‘బాహుబలి’ కంటే ‘ఛత్రపతి’నే బెస్ట్ అనే ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఈ సినిమాకి. ఇలాంటి రీమేక్‌ను నెత్తికి ఎత్తుకున్న వీవీ వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్ దీనికి న్యాయం చేశారా? అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఒక సినిమాను రీమేక్ చేసేటప్పుడు అందులో ఉన్న ప్లస్ పాయింట్లను మరింత ఎలివేట్ చేస్తూ, మైనస్ పాయింట్లను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కానీ ‘ఛత్రపతి’ విషయంలో మొత్తం రివర్స్ అయింది. సినిమాకి హైలెట్ అనిపించే కొన్ని సీన్లను పూర్తిగా తీసేశారు.


‘ఛత్రపతి’ రిలీజ్ అయినప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది ప్రభాస్ ఇంట్రో ఫైట్. అప్పట్లోనే షార్క్‌తో ఇంట్రడక్షన్ ఫైట్ చేసి ఇన్‌స్టంట్ గూస్‌బంప్స్ తెప్పించారు రాజమౌళి. కానీ గ్రాఫిక్స్ బడ్జెట్ కోసం కాంప్రమైజ్ అయ్యారో ఏమో కానీ ఇందులో రెగ్యులర్ ఫైట్‌తో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. హిందీ ఆడియన్స్‌కు ఇది ఓకే అనిపించవచ్చు కానీ తెలుగు వారికి మాత్రం డిజప్పాయింట్‌మెంట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్‌లో ఎంతో బాగా పండిన మదర్ సెంటిమెంట్ ఇందులో అస్సలు సెట్ కాలేదు. ఆ ఎమోషన్‌ను హిందీ ఆడియన్స్ ఫీల్ అవ్వడం కూడా కష్టమే. యాక్షన్ సన్నివేశాలు అయితే ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారు. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఇంటర్వెల్ బ్యాంగ్ ఇందులో చాలా సాదా సీదాగా అనిపిస్తుంది.


ఇక సెకండాఫ్ మరింత పేలవంగా సాగుతుంది. విలన్ల పాత్రలు చాలా వీక్‌గా కనిపిస్తాయి. ఇక ప్రీ క్లైమ్యాక్స్, క్లైమ్యాక్స్‌లను అయితే చుట్టేశారు. జయంతిలాల్ గడా ఇంత ఖర్చు పెట్టి రీమేక్‌గా తీసే బదులు ఒరిజినల్ ‘ఛత్రపతి’ని జస్ట్ డబ్బింగ్ చేసి వదిలేసినా ప్రభాస్‌కు ఉన్న హిందీ మార్కెట్‌తో చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చేవేమో. బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి ఒక ఒరిజినల్ మాస్ కథ తీసుకుని ఉంటే ఆడియన్స్‌కు కొంచెం అయినా ఇంట్రస్ట్ వచ్చేది.


సినిమాలో ఒక్క పాట కూడా ఆకట్టుకోదు. అదేంటో ఒకే పాటకు రెండు వెర్షన్లు తీసి రెండూ సినిమాలో పెట్టారు. ‘బరేలి కా బజార్’ పాట మొదట స్పెషల్ సాంగ్‌గా వస్తుంది. తర్వాత హీరో, హీరోయిన్ల మీద చిత్రీకరించిన వెర్షన్ చివర్లో ఎండ్ క్రెడిట్స్‌కు ముందు వస్తుంది. ఇక సినిమాలో ఒక్క సాంగ్ కూడా సరైన టైమింగ్‌లో పడలేదు. తనిష్క్ బగ్చి ఇచ్చిన ట్యూన్లూ ఆకట్టుకోవు. ఇక రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ‘అగ్ని స్కలన’ మ్యూజిక్ ఇప్పటికీ రింగ్ టోన్‌గా ఉపయోగించే వాళ్లు ఉన్నారు. కానీ రవి బస్రూర్ ఇచ్చిన రీ రికార్డింగ్ అస్సలు గుర్తుండదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే.


ఇక నటీనటుల విషయానికి వస్తే... యాక్టింగ్ పరంగా బెల్లంకొండ శ్రీనివాస్ కొంత మెరుగయ్యారు. ‘ఛత్రపతి’ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్‌కు అది ఆరో సినిమానే. కానీ ఛత్రపతి పాత్రలోని బరువు మొత్తాన్ని మోశారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఈ పాత్ర మరీ భారం అయిందేమో అనిపించింది. ఇక తన ప్లస్ పాయింట్లు అయిన డ్యాన్స్‌లు, ఫైట్స్‌లో మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ చెలరేగిపోయారు. ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం మరింత మెరుగవ్వాల్సి ఉంది. నుష్రత్ బరుచ అందంగా కనిపిస్తుంది. నెగిటివ్ పాత్రల్లో కనిపించిన ఫ్రెడ్డీ దారువాలా, శరద్ ఖేల్కర్ పర్వాలేదనిపించారు. తల్లి పాత్ర నిడివి తగ్గడంతో భాగ్యశ్రీకి కొన్ని సీన్లే దక్కాయి. తన అనుభవాన్ని ఆవిడ నటనలో చూపించారు.


Also Read : 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?


ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘ఛత్రపతి’ ఒక డిజప్పాయింటింగ్ రీమేక్. ఒరిజినల్ చూడని హిందీ ఆడియన్స్‌కు సినిమా ఏ మేరకు ఎక్కుతుందో చూడాలి. ఒరిజినల్ చూసిన వారు మాత్రం కచ్చితంగా నిరాశ పడతారు.


Also Read: ఉగ్రం రివ్యూ: అల్లరోడి ఉగ్రరూపం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా?