సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ వర్మ. ఈ హైదరాబాదీ నటుడితో తమన్నా కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతోంది. న్యూ ఇయర్(2023) సందర్భంగా గోవాలో వీరిద్దరు ముద్దులు పెట్టుకుంటున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. అయితే, వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చిన తర్వాత.. ఈ జంట ఎక్కడ కలిశారు? వీరి లవ్ స్టోరీ ఎలా మొదలయ్యిందంటూ.. నెటిజన్లు ఆరా తీస్తున్నారు. వీరిద్దరు చాలా రోజులుగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నా.. తమన్నా, విజయ్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. న్యూ ఇయర్ వేడుకలను ముగించుకుని గోవా నుంచి ముంబైకి తిరిగి వచ్చే సమయంలో ఎయిర్ పోర్టులో వీరిద్దరు ఒకరి వెనుక మరొకరు వస్తూ కనిపించారు. అప్పుడు వీరిద్దరు డేటింగ్ ఉన్న మాట వాస్తవమే అనే విషయం తేటతెల్లం అయ్యింది.  


తమన్నాతో డేటింగ్ పై స్పందించిన విజయ్


ప్రస్తుతం విజయ్ వర్మ’దహాద్’ అనే సినిమాలో నటించారు. క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా  ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన, తమన్నాతో  డేటింగ్ ఊహాగానాలపై స్పందించారు.  ‘దహాద్’ టీజర్ లాంచ్ సందర్భంగా తన సహనటుడు గుల్షన్ దేవయ్య, విజయ్ వర్మను టీజ్ చేశారు. స్టేజి మీదే తమన్నాతో ప్రేమాయణం గురించి అడగడంతో విజయ్ సిగ్గు పడ్డారు. తాజా ఇంటర్వ్యూలోనూ విజయ్ సమాధానం చెప్పకుండా కేవలం సిగ్గుతో ఔననే ఆన్సర్ ఇచ్చారు.


‘దహాద్’ మూవీ గురించి


విజయ్ వర్మ ప్రధానపాత్రలో నటించి ఈ సినిమా ఇవాళ(మే 12)న  అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్నది. ఈ క్రైమ్-మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ప్రఖ్యాత చిత్రనిర్మాతలు జోయా అక్తర్, మా కగ్తీ రూపొందించారు. సోనాక్షి సిన్హా , గుల్షన్ దేవయ్య, సోహమ్ షా, మన్యు దోషి సహా పలువురు ఇందులో కీలక పాత్రలు పోషించారు.   8 ఎపిసోడ్‌ల సిరీస్‌ని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్,  టైగర్ బేబీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


తమన్నావిజయ్ లవ్ స్టోరీ ఎలా మొదలైంది?


తమన్నా, విజయ్‌ తొలిసారి సుజోయ్ ఘోష్ ‘లస్ట్ స్టోరీస్ 2’ షూట్ లో కలిశారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలిసింది. అదికాస్త ప్రేమగా మారడంతో డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముంబైలో జరిగిన దిల్జిత్ దోసాంజ్ కచేరీలో ఇద్దరు కలిసి కనిపించడంతో ఆ వార్తలకు మరితం బలం చేకూరింది. ఈ కచేరీలో కార్తిక్ ఆర్యన్, అంగద్ బేడి, నేహా ధూపియా కూడా హాజరయ్యారు. డిసెంబర్ 21న తమన్నా పుట్టినరోజు సందర్భంగా విజయ్.. ఆమె ఇంటికి వెళ్లాడు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. 2023 న్యూ ఇయర్ వేడుకలతో గోవా వేదికగా వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.


విజయ్ ఎవరు?


హిందీలో 'పింక్' సినిమాతో విజయ్ వర్మ గుర్తింపు తెచ్చుకున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన 'గల్లీ బాయ్‌'లో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. గత ఏడాది ఆలియా భట్‌కు జోడీగా నటించిన 'డార్లింగ్స్‌' నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అందులో శాడిస్ట్‌ ప్రేమికుడు, భర్తగా విజయ్‌ వర్మ నటన జనాలను ఆకట్టుకుంది. విజయ్ వర్మ హైదరాబాదీ. అతడు పుట్టింది, పెరిగిందీ ఇక్కడే. మార్వాడీ ఫ్యామిలీ. సినిమాల్లో అవకాశాల కోసం ముంబై వెళ్ళాడు. నాని హీరోగా నటించిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లో విలన్ రోల్ చేశాడు.   






Read Also: 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?