Adipurush: ఆదిపురుషుడు ఎవ‌రు? అత‌ని పూర్వీకులు ఎవరు? ఈ ప్రశ్నకు విష్ణువుకే సమాధానం తెలియదు. ఎందుకంటే ఆయ‌న విశ్వాన్ని సృష్టించిన‌ప్పుడు, నీరు తప్ప ఇంకేమీ చూడలేదు. తన గురించి తనకేమీ తెలియదు. విష్ణువుకు తాను ఆదిపురుషుడనే రహస్యం తెలియదు. అదే సమయంలో ఆదిపురుషుడు ఎవరో తెలుసుకోవాలంటే తపస్సు చేయ‌మంటూ ఆకాశవాణి చెబుతుంది. ఆకాశవాణి సూచ‌న‌ ప్రకారం, విష్ణువు నీటిలో కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించాడు. నీటిపై నివసించేవాడు కాబట్టి విష్ణువును నారాయణ అని పిలిచేవారు.


1. విష్ణువు- ఆది పురుషుడు
తపస్సులో ఉన్న శ్రీ‌మ‌హా విష్ణువు నాభి నుంచి ఒక దివ్యమైన కమలం ఉద్భ‌వించింది. ఆ కమలంపై కూర్చున్న బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. విష్ణువుకు నమస్కరించిన  బ్రహ్మ, ఆయ‌న‌ను ఆది పురుషుడు అని సంభోదిస్తాడు. ఎందుకంటే ఆ సమయంలో విష్ణువు తప్ప ఇతర పురుషులు బ్రహ్మ ముందు కనిపించలేదు. విశ్వంలో మొట్ట‌ మొదట శ్రీ‌మ‌హావిష్ణువే ఉన్నాడు. అందుకే విష్ణువును ఆది పురుషుడు అంటారు.


2. ఆది- అంతం లేనివాడు
ఆది పురుషుడైన విష్ణువు నుంచి బ్రహ్మ దేవుడు జన్మించాడు. ఆయ‌న అనంత జీవ‌కోటిని సృష్టించి కొనసాగించాడు. అందుకే విశ్వంలో విష్ణువును ఆదిపురుషుడిగా పూజిస్తారు. ఇంటిలో సత్యనారాయణ వ్ర‌త స‌మ‌యంలో, ఆదిపురుషుడు, అనాది పురుషుడు అంటూ సత్యనారాయణ స్వామిని పూజిస్తారు. ఎందుకంటే ఆయ‌న‌కు ఆది, అంతం లేద‌ని, ఎవ‌రూ వాటిని గుర్తించ‌లేర‌ని అందుకే ఆదిపురుషుడిది అంతం లేని ప్రారంభం అని నమ్ముతారు.


3. శ్రీ‌రాముడు- నాగరిక సమాజ స్థాప‌న‌
శ్రీరాముడు శ్రీ‌ విష్ణువు అవతారంగా పూజ‌లందుకుంటున్నాడు. విష్ణువు ద‌శావతారాల్లో రామావ‌తారానికి ముందు అవతారాలు ఉన్నా, అవ‌న్నీ విశ్వాన్ని ర‌క్షించేందుకే దాల్చాడు. కానీ రామావతారంలో మానవులకు ఆదర్శవంతమైన వ్యవస్థ, విలువ‌ల‌కు పునాది వేశాడు. అందుకే నేటి సమాజంలో శ్రీరాముడు ఆదిపురుషుడుగా పేరొందాడు. నాగరిక సమాజానికి రూప‌క‌ల్ప‌న చేసి దానిని స‌మ‌ర్థంగా నిర్వచించిన తొలి వ్యక్తిగా శ్రీరాముడు గుర్తింపు పొందాడు. 


Also Read: పుట్టినప్పటి నుంచి పోయేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు ఇవే!


రామ‌చ‌రిత్ర తెలిపే రామాయణం భారతీయ సాహితీ రచనలలో ఆదికావ్యంగా భావిస్తారు. త్రేతాయుగంలో జన్మించిన శ్రీరాముడు, భారతీయుల జీవనశైలిపై ఇప్పటికీ లోతైన ప్రభావం చూపుతూనే ఉన్నాడు. రాముడు నడిచిన దారి, నమ్ముకున్న ధర్మం, ఆయన గుణగణాలు ఆయనను ప్ర‌త్యేకంగా నిలిపాయి. ఒక వ్యక్తిగా శ్రీ రాముడు ఆదర్శవంతమైన వ్యక్తి. మనిషి అన్నవాడికి ఉండాల్సిన సద్గుణాలు అన్నీ రామునిలో ఉన్నాయి. వ్యక్తిగా తన నైతిక బాధ్యతలన్నింటినీ రాముడు నెరవేరుస్తాడు. అందుకే శ్రీరాముడిని పురుషోత్తముడిగా కీర్తిస్తారు.


Also Read: అక్రమ సంబంధాలకు కూడా గ్రహస్థితే కారణమా, జాతక చక్రంలో ఈ గ్రహాలు అస్సలు కలసి ఉండకూడదు!


రాముడికి పెద్దలంటే గౌరవం, చిన్నవారిపై అంతులేని వాత్స‌త్యం, ఎదుటి వ్యక్తులకు గౌరవం, కష్టం వస్తే ఆదుకునే స్వభావం, పోరాడే ధైర్యం ఇవన్నీ ఆయనకు విశేష‌మైన గుర్తింపు ఇచ్చాయి. అందరి హృదయాల్లో రాముడిని దేవుడిలా నిలిపాయి. రాముడు ఒక్కడే ఆయనను మించిన వారు లేరు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ఒక్కటే. ఒకే మాట‌- అంటే రాముడు ఏదైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటాడు. ఏక పత్నీ వ్రతుడు- రాజు అయి ఉండి కూడా జీవితాంతం ఒక్క భార్యనే కలిగి ఉన్నాడు. ఒక్క‌ బాణం- ఒక్క రామబాణం ఎలాంటి విధ్వంసం అయినా చేయగలదు.


శ్రీరాముడు జీవితాంతం ధర్మాన్నే నమ్ముకున్నాడు, ధర్మం కోసమే యుద్ధం చేశాడు, ధర్మయుద్ధంలో విజయం సాధించాడు.
రావణుడు తన భార్య సీతను అపహరించినా, యుద్ధంలో తన పక్షాన్ని ఎన్నో విధాల గాయపరిచినా, ఎన్ని రకాల హేయమైన చర్యలు చేసినా, శ్రీ రాముడు ఏనాడూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు, తన విలువలు విడవలేదు. రావణుడిని అన్నివిధాలా గౌరవించాడు. చివరకు త‌న చేతిలో మ‌ర‌ణించిన లంకాధిప‌తి మృతికి కూడా శ్రీ రాముడు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాడు, గౌరవంగా అంత్యక్రియలను జరపవలసిందిగా సూచించాడు. ఆదిపురుషుడు అంటే అంతం, ఆరంభం లేనివాడు. అందుకే బ్రహ్మదేవుడు విష్ణువును మూలపురుషుడు అంటారు. విష్ణువు సర్వలోక శ్రేయస్సు కోసం ఒక్కో యుగంలో ఒక్కో అవతారం ఎత్తాడు.