సినిమా రివ్యూ : అశ్విన్స్
రేటింగ్ : 3/5
నటీనటులు : వ‌సంత్ ర‌వి, విమ‌లా రామ‌న్, మురళీధరన్ సుబ్రమణియన్, సార‌స్ మీన‌న్‌, ఉద‌య దీప్‌, మలినా అతుల్, సిమ్రాన్ ప‌రీక్‌ తదితరులు
సహ నిర్మాత : ప్రవీణ్ డేనియల్
ఛాయాగ్రహణం : ఎడ్విన్ సాకే 
సంగీతం : విజ‌య్ సిద్ధార్థ్‌
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం : తరుణ్ తేజ
విడుదల తేదీ: జూన్ 23, 2023


తమిళ చిత్రాలు 'తరమణి', 'రాకీ'తో యువ హీరో వసంత్ రవి (Vasanth Ravi) పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్ 'జైలర్'లోనూ నటించారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'అశ్విన్స్' (Asvins Movie). ఓ 20 నిమిషాల పైలట్ ఫిల్మ్ ఆధారంగా తీసిన చిత్రమిది. ఇదొక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఈ ఏడాది 'విరూపాక్ష'తో ప్రేక్షకులకు థ్రిల్లింత అందించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. 'అశ్విన్స్' కూడా 'విరూపాక్ష' తరహాలో భయపెడుతుందా? థ్రిల్ అందిస్తుందా?


కథ (Asvins Movie Story) : అర్జున్ (వసంత్ రవి), రీతూ అలియాస్ రిత్విక (సారస్ మీనన్), వరుణ్ (మురళీధరన్ సుబ్రమణియన్), రాహుల్ (ఉదయ దీప్), గ్రేస్ (మలినా అతుల్) యూట్యూబర్స్! దెయ్యాలు ఉన్నాయని జనాలు వెళ్ళని ఇళ్ళల్లో వీడియోలు చేయడం వాళ్ళ వృత్తి. ఇండియాలో వాళ్ళు చేసిన వీడియోలు చూసి యూకేలో బ్లాక్ టూరిజం ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. లండన్ నగర శివార్లలో ఉన్న ఓ దెయ్యాల కోటలో ఏముందో రికార్డ్ చేయాలి. ఒక్కప్పుడు ఆ భారీ భవంతిలో ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్ (విమలా రామన్) నివాసం ఉండేవారు. సుమారు పదిహేను మంది శవాలుగా దొరికిన తర్వాత ఆ భవంతిలోకి జనాలు వెళ్ళడం మానేశారు. ఆర్తి రాజగోపాల్ శవం మాయం అవుతుంది. అందులోకి వెళ్లిన అర్జున్ అండ్ గ్యాంగ్ ప్రాణాలతో బయటకు వచ్చారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Asvins Review ) : 'నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూశావా!' - 'అతడు' సినిమాలో డైలాగ్! హారర్ సినిమా ప్రేమికులకు నిశ్శబ్దంలోని భయం ఎలా ఉంటుందో బాగా తెలుసు. నిజానికి నిశబ్దంలోనూ ఓ శబ్దం ఉంటుంది. ఒకవేళ శబ్దమే నిశ్శబ్దాన్ని ఆవహిస్తే? కంటికి కనిపించే దృశ్యానికి శబ్దం తోడుగా నిలిచి ప్రేక్షకుల మదిలోకి దూరి వెంటాడితే? వేటాడితే? అటువంటి థ్రిల్లింత కోసం థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు ఎంతో మంది! అటువంటి వాళ్ళకు అమితంగా నచ్చే సినిమా 'అశ్విన్స్'. 


దెయ్యాల కోటలోకి ఐదుగురు వెళతారు. వాళ్ళను దెయ్యం ఎలా వెంటాడి, వేటాడి చంపింది? లేదంటే దెయ్యం నుంచి ఐదుగురూ తప్పించుకున్నారా? - క్లుప్తంగా చెప్పాలంటే 'అశ్విన్స్' కాన్సెప్ట్ ఇది. నిజం చెప్పాలంటే... ఇంటర్వెల్ వరకు కథ ముందుకు కదలదు. కానీ, ప్రతి అడుగులో ప్రేక్షకులకు థ్రిల్, హారర్ అనుభూతి ఇచ్చాడు దర్శకుడు తరుణ్ తేజ. వందల హారర్ థ్రిల్లర్స్ చూసిన ప్రేక్షకులకు షాట్స్, విజువల్స్ కొత్తగా అనిపించవు. రెగ్యులర్ హారర్ మూమెంట్స్ స్క్రీన్ మీద వస్తుంటాయి. అయినా సరే భయపడతారు. అంతలా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ సిద్ధార్థ్, సినిమాటోగ్రాఫర్ ఎడ్విన్ సాకేలతో తరుణ్ తేజ మేజిక్ చేశారు. విశ్రాంతికి వచ్చేసరికి ప్రేక్షకులకు టికెట్ రేటుకు సరిపడా థ్రిల్, భయాన్ని అందించేశారు. 


'అశ్విన్స్' థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులను భయపెట్టడంలో సంగీత దర్శకుడు విజయ్ సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించారు. ఆఫ్ స్క్రీన్ అసలైన హీరో ఆయనే. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్. విజువల్స్ ఎక్స్ట్రాడినరీ. సౌండ్ డిజైన్, ఎడిటింగ్ & లైటింగ్ కూడా సూపర్బ్! నిర్మాణ విలువలు బావున్నాయి.


కథ, దర్శకత్వం విషయానికి వస్తే... తరుణ్ తేజ చేసిన వర్క్, డిటైలింగ్ ప్రతి మాటలో, ప్రతి సన్నివేశంలో తెలుస్తూ ఉంటుంది. ఆయనలో చాలా విషయం ఉంది. రైటింగ్, విజువల్స్ పరంగా ఫస్ట్ ఫీచర్ ఫిలింను ఈ స్థాయిలో తీయడం అంటే మామూలు విషయం కాదు. హారర్ అండ్ మైథాలజీని మిక్స్ చేసిన తీరు బావుంది. హారర్ మాత్రమే చూసే ప్రేక్షకులకు రెగ్యులర్ భయం, రొటీన్ షాట్స్ మాత్రమే తెరపై కనపడతాయి. లోతుగా చూస్తే... తెరపై చూసేది నటీనటుల భ్రమా? లేదంటే నిజమా? అని క్లూస్ ఇస్తూ వెళ్లారు తరుణ్ తేజ. రియాలిటీ ఏది? ఇల్యూజన్ ఏది? అని పేక్షకులకు పజిల్ ఇచ్చారు. సబ్ కాన్షియస్ మెమరీలో అక్కడ గ్రీన్ లైట్ ఎందుకు వచ్చింది? మరో వైపు రెగ్యులర్ లైటింగ్ ఎందుకు ఉంది? అని ఆలోచన మెదులుతూ ఉంటుంది. ఆ సస్పెన్స్ మైంటైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. భయపెట్టారు కూడా!


అయితే... కొన్ని విషయాలను రిపీట్ చేశారు. సినిమా స్టార్టింగ్ చెప్పిన కథను మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఆర్తీ రాజగోపాల్ చేత చెప్పించడంతో ఎఫెక్ట్ మిస్ అయ్యింది. ఇంటర్వెల్ వరకు ఉన్నంత స్పీడ్ ఆ తర్వాత మిస్ అయ్యింది. అప్పటికే చాలా థ్రిల్ ఇచ్చాం కనుక చాలు అనుకున్నారేమో!? కథ మొదలైన తర్వాత హారర్, థ్రిల్ మూమెంట్స్ తగ్గాయి. మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసరికి స్పీడ్ అందుకుంది. పతాక సన్నివేశాలు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తాయి.


నటీనటులు ఎలా చేశారు? : సాధారణంగా హారర్ థ్రిల్లర్ సినిమాల్లో నటీనటులకు ప్రతిభ చూపే అవకాశం తక్కువ ఉంటుంది. 'అశ్విన్స్' ఫస్టాఫ్ వరకు ఆ మాటలో కొంత నిజం ఉందనిపిస్తుంది. కొన్ని సీన్లు మినహా ఆర్టిస్టులకు పెద్దగా నటించే ఛాన్స్ రాలేదు. ఇంటర్వెల్ తర్వాత విమలా రామన్ ఆ మాటను చెరిపేశారు. ఫ్లాష్ బ్యాక్ తర్వాత నుంచి వసంత్ రవి అయితే విజృంభించారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతానికి తోడు ఆయన నటన మరింత ఉత్కంఠ పెంచుతుంది. హీరో తప్ప మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ అంత బలంగా లేవు. వాళ్ళ మధ్య బాండింగ్ చూపించే సన్నివేశాల్లో డెప్త్ మిస్ అయ్యింది. 


Also Read : 'టీకూ వెడ్స్ షేరు' రివ్యూ : ఇండస్ట్రీ బ్యాక్‌ డ్రాప్‌ లో సినిమా - నిర్మాతగా కంగనా రనౌత్ తొలి అడుగు హిట్టేనా?


చివరగా చెప్పేది ఏంటంటే? : థ్రిల్లర్స్, హారర్ చిత్రాల ప్రేమికులకు 'అశ్విన్స్' అమితంగా నచ్చుతుంది. ప్రేక్షకులను భయపెడుతుంది. మాంచి థ్రిల్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, సంగీతం పరంగా ఉన్నత స్థాయిలో ఉంది. వసంత్ రవి నటన, విజయ్ సిద్ధార్థ్ సంగీతం కోసమైనా 'అశ్విన్స్'ను మిస్ కాకూడదు. ఈ ఏడాది వచ్చిన చక్కటి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో 'అశ్విన్స్' ఒకటిగా నిలుస్తుంది. 


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే