గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela) దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ వారం (జూన్ 20వ తేదీ, మంగళవారం) పండంటి ఆడబిడ్డకు కొణిదెల వారి కోడలు జన్మ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. అప్పటి నుంచి అపోలో ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారామె. మరి, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు? ఇంటికి ఎప్పుడు వెళతారు? అంటే... 'ఈ రోజు' అని చెప్పారు. 


ఈ రోజు మధ్యాహ్నమే ఉపాసన డిశ్చార్జ్!
అవును... ఈ రోజు మధ్యాహ్నం ఉపాసన డిశ్చార్జ్ కానున్నారు. అందుకు, ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మెగా అభిమానులు, ప్రేక్షకులతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొందరికి ఓ సందేహం ఉంది. ఉపాసనకు నార్మల్ డెలివరీ అయ్యిందా? లేదంటే సిజేరియన్ చేశారా? అని! మరి, ఆ విషయంలో ఈ రోజు దంపతులు ఇద్దరూ సమాధానం చెప్పే అవకాశం ఉంది!


మీడియా ముందుకు చరణ్, ఉపాసన!
Upasana and Ram Charan first press conference after baby girl birth : ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళే ముందు రామ్ చరణ్, ఉపాసన దంపతులు అపోలో ఆస్పత్రి దగ్గర మీడియాతో మాట్లాడనున్నారు. తమకు శుభాకాంక్షలు చెప్పిన పరిశ్రమ ప్రముఖులకు, ఇంకా అభిమానులు & ప్రేక్షకులకు థాంక్స్ చెబుతారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పేంత సమయం ఉంటుందో? లేదో? చూడాలి.


మనవరాలి రాకతో ఆనందంలో మెగాస్టార్!
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు బిడ్డ జన్మించిన రోజున మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. హనుమంతునికి ప్రీతికరమైన రోజు మంగళవారం. ఆ రోజు అమ్మాయి పుట్టడంతో మెగాస్టార్ మరింత సంబరపడ్డారు. తన ఆనందం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ విజయాలు, వరుణ్ తేజ్ నిశ్చితార్థం, మనవరాలు పుట్టడం... తమ ఇంట అన్నీ శుభకార్యాలు జరుగుతున్నాయని తెలిపారు.


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే   


మెగాస్టార్ కుటుంబ సభ్యులు అందరూ మంగళవారమే చరణ్, ఉపాసనల బిడ్డను చూశారు. ఆల్మోస్ట్ మెగా కజిన్స్ అందరూ అపోలో ఆస్పత్రికి క్యూ కట్టారు. అల్లు అరవింద్ దంపతులు సైతం మనవరాలిని చూశారు. సోషల్ మీడియాలో చాలా మంది రామ్ చరణ్, ఉపాసనకు శుభాకాంక్షలు చెప్పారు. మెగాస్టార్ ఇంట మహాలక్ష్మి అడుగు పెట్టిందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అపోలో ఆస్పత్రి దగ్గర మంగళవారం బ్యాండ్ బాజాలతో డ్యాన్సులు చేశారు. 'మెగా ప్రిన్సెస్' హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.


Also Read : 'టీకూ వెడ్స్ షేరు' రివ్యూ : ఇండస్ట్రీ బ్యాక్‌ డ్రాప్‌ లో సినిమా - నిర్మాతగా కంగనా రనౌత్ తొలి అడుగు హిట్టేనా?


'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'తో గత ఏడాది భారీ విజయం అందుకోవడం మాత్రమే కాదు, గ్లోబల్ ఆడియన్స్ కాంప్లిమెంట్స్ అందుకున్న రామ్ చరణ్... సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్, అగ్ర నిర్మాత 'దిల్' రాజుతో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. ఇప్పుడీ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇది పాన్ ఇండియా సినిమా. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, నర్తన్ దర్శకత్వంలో కూడా ఆయన సినిమాలు చేసే అవకాశం ఉంది. చర్చలు జరుగుతున్నాయి.