వెబ్ సిరీస్ రివ్యూ: మోడ్రన్ లవ్ హైదరాబాద్  
రేటింగ్: 3/5
నటీనటులు: నిత్యా మీనన్, రేవతి, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, 'బిగ్ బాస్' అభిజీత్, మాళవిక నాయర్, సుహాసిని మణిరత్నం, నరేష్ అగస్త్య, ఉల్కా గుప్త, సీనియర్ నరేష్, కోమలి ప్రసాద్ తదితరులు
కథలు: నగేష్ కుకునూరు, శశి సుడిగల, బహాయిష్ కపూర్
సంగీతం: ఎం.ఎం. కీరవాణి, కాలభైరవ, తపస్ రెలియా, స్మరణ్ సాయి, వివేక్ సాగర్  
నిర్మాత: ఇలాహే హిప్టులా 
దర్శకత్వం: నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రల , దేవిక బహుధానం
విడుదల తేదీ: జూలై  8, 2022
ఎపిసోడ్స్: 6
ఓటీటీ వేదిక: ప్రైమ్ వీడియో


ఆరు కథల సమాహారంగా రూపొందిన (యాంథాలజీ) వెబ్ సిరీస్ 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' (Modern Love Hyderabad Web Series). ఇందులో ప్రేక్షకులు మెచ్చిన తారాగణం ఉన్నారు. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రసంశలు అందుకున్న నలుగురు దర్శకులు తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉంది? (Modern Love Hyderabad Telugu Web Series Review)


అమ్మ చేతి వంట అంత మధురం
ఫస్ట్ ఎపిసోడ్ (My unlikely pandemic dream partner) కథ: నూరి (నిత్యా మీనన్) ప్రేమకు తల్లి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో ఇంటి నుంచి వచ్చేసి పెళ్లి చేసుకుంటుంది. ఆరేళ్ళ తర్వాత కుమార్తె దగ్గరకు తల్లి మెహరున్నీసా (రేవతి) వస్తుంది. తర్వాత ఏమైంది? ఆరేళ్ళలో ఇద్దరి జీవితాల్లో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలు ఏంటి? అనేది ఫస్ట్ ఎపిసోడ్ కథ.
 
ఎలా ఉంది?: నిత్యా మీనన్, రేవతి... ఇద్దరి నటనకు వంక పెట్టలేం. ఒక్కో సీన్‌లో జస్ట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో అలా చూపు తిప్పుకోనివ్వకుండా చేశారు. ఇష్టాన్ని, ప్రేమను, కోపాన్ని... ప్రతి భావోద్వేగాన్ని దర్శకుడు నగేష్ కుకునూర్ చాలా హృద్యంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులకు దూరమైన ఇద్దరు మహిళల కథ ఇది. తల్లీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించిన కథ. కుమార్తెకు ఆరేళ్ళు దూరమైన తల్లి, ఆ ప్రేమను వంట చేయడం ద్వారా చూపెట్టడం ఆకట్టుకుంటుంది. ఈ కథలో మాటలను చాలా పొదుపుగా వాడారు. నిత్యా మీనన్, రేవతి లాంటి నటులు ఉన్నప్పుడు మాటలు అవసరం లేదు కదా! అయితే, ఈ కథకు కరోనా నేపథ్యం అవసరం లేదేమో అనిపిస్తుంది. ఆ సీన్స్ కాస్త నిడివి పెంచాయంతే! సంగీతానికి వస్తే... చివర్లో వచ్చే పాట ఆకట్టుకుంటుంది.


గతాన్ని గుర్తు చేసుకోవడం ఎందుకు? గుర్తుంటుందా?
రెండో ఎపిసోడ్ (Fuzzy, purple and full of thorns...) కథ: రేణు అలియాస్ రేణుక (రీతూ వర్మ), ఉదయ్ (ఆది పినిశెట్టి) లివ్-ఇన్ రిలేషన్ (సహ జీవనం)లో ఉన్నారు. అయితే... ఒక రోజు ఉదయ్ మాజీ ప్రేయసి చెప్పులు కబోర్డ్‌లో చూస్తుంది రేణు. చెప్పులు ఎందుకు దాచుకున్నావని అడుగుతుంది. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. ఆ తర్వాత ఏమైంది? అనేది కథ.


ఎలా ఉంది?: ఆది పినిశెట్టి, రీతూ వర్మ చక్కగా నటించారు. అయితే... మోడ్రన్ రిలేషన్షిప్స్, కపుల్స్ మధ్య మనస్పర్థల నేపథ్యంలో చాలా సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. అందువల్ల, కథలో కొత్తదనం లోపించింది. అయితే, ఈ కథను నగేష్ కుకునూర్ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. లివ్ ఇన్ అనేసరికి చాలా మంది శృంగారాత్మక కోణం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. నగేష్ కుకునూర్ మాత్రం వ్యక్తుల ఆలోచనను ఆవిష్కరించాలని చూశారు. ఆరు కథలు చూశాక... ఈ కథ అంతగా గుర్తుండటం కష్టం.


గుండె లోతుల్లో బరువును కొలవగలమా?
మూడో ఎపిసోడ్ (Why did she leave me there…?) కథ: రోహన్ (నరేష్ అగస్త్య) ఒక పెద్ద కంపెనీకి సీఈవో. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లినా... బాల్యం అతడిని వెంటాడుతుంది. చిన్న వయసులో అతడిని అనాథ ఆశ్రమంలో చేర్పించిన అమ్మమ్మ (సుహాసిని)... ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆమె ఎందుకు అలా చేసింది? పెద్దయిన తర్వాత రోహన్ ఏం తెలుసుకున్నాడు? అనేది కథ.
     
ఎలా ఉంది?: విన్నప్పుడు సాధారణమైన కథగా అనిపించవచ్చు. కానీ, స్క్రీన్ మీద చూసినప్పుడు కథలో లోతు ఎంతో తెలుస్తుంది. అదీ కథ వల్ల కాదు... నటీనటుల ప్రతిభ వల్ల! సాధారణమైన సన్నివేశాలను సుహాసినీ మణిరత్నం, నరేష్ అగస్త్య మరో మెట్టు ఎక్కించారు. దర్శకుడు నగేష్ కుకునూర్ సహజంగా తీశారు. కథలో భావోద్వేగం సగటు పేద, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకుంటుంది.


వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య సంఘర్షణ
నాలుగో ఎపిసోడ్ (What clown wrote this script!) కథ: అశ్విన్ (అభిజీత్) ఒక టీవీ ఛానల్‌లో సీనియర్ ప్రొడ్యూసర్. రొటీన్ సీరియల్స్ చేయడం కాకుండా కొత్తగా ఓటీటీ స్పేస్‌లో ఏదైనా చేయాలనుకుంటాడు. ఒక రోజు స్టాండప్ కమెడియన్ విన్నీ (మాళవికా నాయర్)ను చూస్తాడు. తెలుగబ్బాయి థీమ్ మీద ఆవిడ చేసిన స్టాండప్ షో నచ్చి, ఆ నేపథ్యంలో టీవీ కోసం షో చేయాలనుకుంటాడు. విన్నీకి తనను పరిచయం చేసుకున్న అశ్విన్... కాన్సెప్ట్ గురించి చెబుతాడు. ఆ క్రమంలో ప్రేమలో పడతారు. వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైన నిర్ణయాలు ఏ విధంగా ప్రభావం చూపాయి? ఏమైంది? అనేది మిగతా కథ.


ఎలా ఉంది?: స్టాండప్ కామెడీ సీన్స్ నవ్వించలేదు. కానీ, టీవీ / ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ నేపథ్యంలో తెరకెక్కించడం వల్ల కథకు కొత్తదనం వచ్చింది. టిపికల్ తెలుగు అబ్బాయి గురించి మాళవికా నాయర్ చెప్పే సీన్ నిజమే అనిపిస్తుంది. ఆవిడ నటన, బాడీ లాంగ్వేజ్ అద్భుతం. ఈ కథలో అందం ఏంటంటే... దర్శకుడు ఉదయ్ గుర్రాల ప్రతి అంశాన్ని సున్నితంగా డీల్ చేశారు. చాలా నిజాలను చక్కగా చెప్పారు. ఉదాహరణకు... టీవీ ఆర్టిస్ట్ దుస్తుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడం నుంచి డబ్బు, ఉద్యోగం కోసం ఇచ్చిన మాటను పక్కనపెట్టి ప్రేమించిన అమ్మాయికి హీరో దూరం కావడం వరకు ప్రతిదీ సెటిల్డ్‌గా ఉంటుంది.
 
రెగ్యులర్ ఫాదర్ & మోడ్రన్ డాటర్
ఐదో ఎపిసోడ్ (About that rustle in the bushes) కథ: స్నేహ (ఉల్కా గుప్తా) ఉద్యోగం చేస్తుంది. కాబోయే వరుడిని తానే ఎంపిక చేసుకోవాలని పెళ్లి మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో అబ్బాయిల ప్రొఫైల్స్ చూసి కలిసి మాట్లాడుతుంది. అబ్బాయిలను స్నేహ కలవడానికి వెళ్లిన ప్రతిసారీ ఆమెకు తెలియకుండా తండ్రి (నరేష్) ఫాలో అవుతాడు. ఈ విషయం తెలిసి అమ్మాయి ఏం చేసింది? అమ్మాయి విషయంలో తండ్రి అభిప్రాయం ఏంటి? అనేది కథ.


ఎలా ఉంది?: కాలం మారినా పిల్లల విషయంలో తల్లిదండ్రుల చూపించే ప్రేమ, బాధ్యత మారదని చెప్పే కథ ఇది. ఉల్కా గుప్తా, నరేష్, దివ్యవాణి... ప్రతి ఒక్కరూ పాత్రలకు తగ్గట్టు నటించారు. అయితే... సీన్స్, తీసిన విధానం రొటీన్‌గా ఉన్నాయి. అందువల్ల, ఈ కథకు కనెక్ట్ కావడం కష్టమే. కథలో ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్ ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. 


పెంగ్విన్... వాటీజ్ థిస్ నాన్సెన్స్!
ఆరో ఎపిసోడ్ (Finding your penguin…) కథ: ఇందు (కోమలీ ప్రసాద్) మైక్రో బయాలజీ స్టూడెంట్. వేరే అమ్మాయిని కిస్ చేస్తూ బాయ్‌ఫ్రెండ్‌ కనిపించడంతో బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సరైన పార్ట్‌న‌ర్‌ వెతుక్కోవడం కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. పార్ట్‌న‌ర్‌ కోసం యానిమల్స్ ట్రై చేసే మెథడ్స్ ట్రై చేస్తూ ఉంటుంది. చివరకు, సరిజోడీని వెతుక్కుందా? లేదా? అనేది కథ.


ఎలా ఉంది?: ఈ కథ చూశాక మదిలో మొదలయ్యే మొదటి ప్రశ్న ఏంటంటే... చివరకు ఏం చెప్పారు? అని! ఎందుకంటే... దర్శకుడు వెంకటేష్ మహా ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు కాబట్టి! ఇంకొకటి... యానిమల్స్, లవ్ అంటూ చెప్పే విషయం అసలు అర్థం కాదు. కోమలీ ప్రసాద్ నటన, కొన్ని సీన్స్ నవ్విస్తాయి. 


Also Read : 'హ్యాపీ బర్త్ డే' రివ్యూ: బోరింగ్ బర్త్ డే పార్టీనా? అంతా హ్యాపీనా?


చివరగా చెప్పేది ఏంటంటే: 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' సిరీస్‌లో చూపించినవి కథలు కాదు... జీవితాలు! జీవితాలు అన్నీ బావుంటాయని చెప్పలేం! జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నట్టు ఈ కథల్లో కొన్ని మనసులను హత్తుకుంటాయి. కొన్ని కాస్త నిరాశకు గురి చేస్తాయి. ప్రస్తుత సమాజంలో బంధాలు, అనుబంధాలు, ప్రేమలు ఆవిష్కరించిన సిరీస్ ఇది. పాట రాయడం, పాడటంతో పాటు ఎంఎం కీరవాణి సంగీతం అందించిన సాంగ్ బావుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్... సిరీస్ అంతా టెక్నికల్ టీమ్ మంచి అవుట్‌పుట్‌ ఇచ్చింది. సహజత్వానికి దగ్గరగా ఉన్న 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' మీ మనసులో ముద్ర వేసుకుంటుంది. 


Also Read : 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? సత్యరాజ్ కుమారుడు శిబి నటించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?