సినిమా రివ్యూ: మాయోన్
రేటింగ్: 2.5/5
నటీనటులు: శిబి సత్యరాజ్, తాన్య రవిచంద్రన్, రాధా రవి, కె.ఎస్. రవికుమార్, ఎస్.ఎ. చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్, హరీష్ పెరడి తదితరులు
సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్
సంగీతం: ఇళయరాజా
నిర్మాతలు: మామిడాల శ్రీనివాస్,అరుణ్ మోజి మాణిక్కం
దర్శకత్వం: ఎన్. కిషోర్ 
విడుదల తేదీ: జూలై 7, 2022


'మాయోన్'... శిబి సత్యరాజ్ హీరోగా నటించిన సినిమా. ఆయన నటుడు సత్యరాజ్ కుమారుడు. ఇందులో కార్తికేయ గుమ్మకొండ 'రాజా విక్రమార్క'లో నటించిన తాన్యా రవిచంద్రన్ కథానాయిక. తెలుగులో మూవీ మ్యాక్స్ సంస్థ విడుదల చేసింది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?


కథ (Maayon Movie Story): అర్జున్ (శిబి చక్రవర్తి) పురావస్తు శాఖ (ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌)లో ఉద్యోగి. పురాతన వస్తువులకు నఖలు తయారు చేసి లక్షలు, కోట్లు ఖరీదు చేసే అసలు వాటిని అమ్మేస్తుంటాడు. అతని క్రైమ్ పార్ట్‌న‌ర్‌ మరో అధికారి దేవరాజ్ (హరీష్ పేరడి). మాయోన్మాల గ్రామంలో శ్రీకృష్ణుడి దేవాలయంలోని ఒక రహస్య గది ఉందని, అందులో వేల కోట్లు ఖరీదు చేసే బంగారు నిధి ఉందని ఈ జంట దొంగలకు తెలుస్తుంది. కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. అర్జున్‌కు సహాయంగా అంజనా (తాన్యా రవిచంద్రన్), డీకే (భగవతి పెరుమాళ్)తో పాటు మరొకరిని నియమిస్తాడు దేవరాజ్. భక్తులు వస్తుంటారు కాబట్టి పగలు దొంగతనం చేయడానికి కుదరదు. రాత్రి చేయాలని ప్లాన్ చేస్తే... రాత్రి కృష్ణుడిని పరవశింపజేయడానికి గంధర్వులు గానం చేస్తారని, అందువల్ల రాత్రిపూట దేవాలయంలోకి వెళ్లిన కొంత మందికి పిచ్చి పట్టిందని ఊరిలో కథలు కథలుగా చెబుతారు. దేవాలయానికి రక్షణగా పెద్ద సర్పం కాపలాగా ఉందని ప్రతీతి. ఇవన్నీ అర్జున్ అండ్ కో నమ్మకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రాత్రి నిధి వేటకు, రహస్య గదిని తెరవడానికి వెళతారు. అప్పుడు ఏం జరిగింది? కథలన్నీ నిజమా? కల్పితమా? మరోవైపు పురాతన విగ్రహాలు విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న దొంగలను పట్టుకోవడానికి ప్రభుత్వం ఏం చేసింది? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ (Maayon Review) : భగవంతుడు ఉన్నాడా? లేదా? - ఈ ప్రశ్నకు పరస్పర భిన్నమైన సమాధానాలు లభిస్తాయి. కొందరు భగవంతుడు ఉన్నాడని చెబుతారు. మరికొందరు లేదని అంటారు. ఈ చర్చ నేపథ్యంలో రూపొందిన థ్రిల్లర్ సినిమా 'మాయోన్'.
'మాయోన్' సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. గుడిలో రాత్రి ఉండాలని ప్రయత్నించిన ఓ యువకుడికి పిచ్చి పట్టడం, విగ్రహాల స్మగ్లింగ్, పురాతత్వ శాఖలో కొంత మంది దొంగలు ఉండటం, ఇంటి దొంగలను ప్రభుత్వం ఎలా పట్టుకుంటుందనే ఆలోచన రేకెత్తించడం... ప్రారంభమైన తర్వాత ఆసక్తిగా ముందుకు వెళుతుంది. దర్శక, రచయితలు చిక్కుముడులను చక్కగా వేసుకుంటూ వెళ్లారు. అయితే... విశ్రాంతి తర్వాత కథలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. గుడిలోకి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తిగా ఉంటాయి.


'మాయోన్'కు మెయిన్ మైనస్ ఏంటంటే... మధ్య మధ్యలో ఉత్కంఠ తగ్గించేలా లవ్ సాంగ్ తీసుకురావడం, డీటెయిలింగ్ పేరుతో కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా చూపించడం, తెలుగు ప్రేక్షకులకు ఎక్కువమంది తెలిసిన ముఖాలు లేకపోవడం! కథను ఆసక్తిగా ప్రారంభించినా... తెలుగులో గుడి, రహస్యం నేపథ్యంలో 'కార్తికేయ' వంటి సినిమా రావడంతో ఆ సినిమాతో పోలికలు కనిపిస్తాయి.
నేపథ్య సంగీతంలో ఇళయరాజా మార్క్ కనిపించింది. ముఖ్యంగా విశ్రాంతికి ముందు శిబి సత్యరాజ్ గుడిలో ఉన్నప్పుడు వచ్చే పాట బావుంది. మీడియం బడ్జెట్ సినిమాల పరంగా చూసుకుంటే... విజువల్స్ ఎఫెక్ట్స్ బావున్నాయి. నిర్మాతలు బాగా ఖర్చు చేశారని కనపడుతోంది.


నటీనటులు ఎలా చేశారు?: శిబి సత్యరాజ్‌కు కమర్షియల్ హీరోకు కావలసిన కటౌట్ ఉంది. అయితే... ఈ సినిమాలో ఫైట్స్ చేసి హీరోయిజం చూపించే ఛాన్స్ లేదు. అందువల్ల, క్యారెక్టర్‌కు తగ్గట్టు నటించారు. హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ చూడటానికి బావున్నారు. నటిగా పర్వాలేదు. ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాల్లో మరింత మెరుగవ్వాలి. హరీష్ పేరడి, కెఎస్ రవికుమార్, రాధా రవి వంటి ప్రముఖ తమిళ నటులు సినిమాలో కనిపిస్తారు. వాళ్ళ ప్రతిభ చూపించే సన్నివేశాలు లేవు.


Also Read : థోర్ లవ్ అండ్ థండర్ రివ్యూ: ఉరుముల దొర ఆకట్టుకున్నాడా?


చివరగా చెప్పేది ఏంటంటే?: 'మాయోన్' మీకు డిఫరెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ ఇస్తుంది. ఫస్టాఫ్ థ్రిల్లర్ తరహాలో సాగుతూ... కథలో చిక్కుముడులను వేసుకుంటూ వెళితే, సెకండాఫ్ స్టార్టింగ్‌లో కాసేపు హారర్ ఫీల్ ఇస్తుంది. విజువల్ పరంగా బావుంటుంది. చివరకు, రెగ్యులర్ ప్యాట్రన్‌లో ముగుస్తుంది. దేవుడు ఉన్నాడని చెప్పారు. సైంటిఫిక్‌గానూ కంక్లూజ‌న్‌ ఇచ్చారు. సత్యరాజ్ కుమారుడు కావడంతో తెలుగులో 'మాయోన్'కు 200 ప్లస్ స్క్రీన్స్ లభించాయి. ఆడియన్స్‌లో క్యూరియాసిటీ కలిగించింది. థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు మంచి ఆప్షన్ ఇది. అన్నట్టు... సీక్వెల్‌కు వీలుగా ఎండింగ్ ఇచ్చారు. 



Also Read : 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?