సినిమా రివ్యూ: రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్
రేటింగ్: 3/5
నటీనటులు: ఆర్. మాధవన్, సిమ్రాన్, సామ్ మోహన్, గుల్షన్ గ్రోవర్, మిషా గోషాల్ తదితరులతో పాటు అతిథి పాత్రలో సూర్య
సినిమాటోగ్రఫీ: శీర్షా రై
సాహిత్యం: కె. రామ్ మనోహర్
సంగీతం: సామ్ సి.ఎస్.
నిర్మాతలు: ఆర్.మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఆర్.మాధవన్
విడుదల తేదీ: జూలై 1, 2022
మాధవన్ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్'. నిర్మాతల్లో మాధవన్ కూడా ఒకరు. రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Rocketry Movie Story) : నంబి నారాయణన్ (మాధవన్) ఇస్రో శాస్త్రవేత్త. దేశ రహస్యాలు పాకిస్తాన్‌కు చేరవేశారనే అభియోగం మీద పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు. కొన్నాళ్లకు నిర్దోషి అని తెలుస్తుంది. అయితే... పోలీసులు అరెస్ట్ తర్వాత నంబితో పాటు అతని కుటుంబాన్ని సమాజం ఎలా చూసింది? ఆయన నిరపరాధి అని, ఎటువంటి తప్పు చేయలేదని ఎలా నిరూపించబడింది? నంబిపై నిరాధారమైన కేసు బనాయించి, ఆయనపై దేశద్రోహి అని ముద్ర వేయడానికి ముందు, తర్వాత దేశం కోసం ఆయన ఏం చేశారు? ఏయే త్యాగాలు చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Rocketry Review) : రాకెట్రీ... ఇది కథ కాదు, ఒక జీవితం! ఓ కుటుంబం పడిన మానసిక సంక్షోభానికి దృశ్యరూపం! దేశం కోసం త్యాగాలు చేసిన, చేయడం కోసం సిద్ధపడిన మనిషికి ఎంతటి అవమానం జరిగినా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా... చేయని తప్పు చేశానని అంగీకరించకుండా, ధైర్యంగా నిలబడి చేసిన పోరాటానికి నిలువుటద్దం!
కథగా చూస్తే... 'రాకెట్రీ'లో కొత్తగా ఏమీ లేదు. గూగుల్‌లో రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణన్ గురించి అందుబాటులో ఉన్నదే సినిమాలో ఎక్కువ శాతం ఉంది. నాసా ఫెలోషిప్ రావడంతో అమెరికా వెళ్లడం, అక్కడ నుంచి తిరిగొచ్చిన తర్వాత అరెస్ట్ కావడం, ఆయనకు పద్మభూషణ్ రావడం అందరికీ అందుబాటులో ఉన్న సమాచారమే. అయితే, మాధవన్ కొత్తగా ఏం చూపించారు? అంటే... నంబి, ఆయన కుటుంబ సభ్యులు అనుభవించిన మానసిక క్షోభ.
నంబిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను చూడడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరూ రారు. ఎందుకు రాలేదని అధికారి ప్రశ్నిస్తే... ''ఒక రాకెట్ కూలిపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసిన మాకు (సైంటిస్ట్‌లకు), ఒక మనిషి కూలిపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదేమో'' అని నంబి సమాధానం ఇస్తారు. సినిమా చూశాక... నంబి కుటుంబం పట్ల బంధువులు, ఇతరులు ప్రవర్తించిన తీరు చూశాక... 'ఒక మనిషి కూలిపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రజలుగా మనలో చాలా మందికి తెలియదేమో' అనిపిస్తుంది. ద్వితీయార్థంలో సన్నివేశాలు అంతలా హృదయాన్ని తాకుతాయి.
'రాకెట్రీ'కి బలం, బలహీనత... రెండూ మాధవనే. ఆయనలోని నటుడు సినిమాకు వెన్నుదన్నుగా నిలిస్తే... తొలి అడుగు వేసిన దర్శకుడు ప్రేక్షకుల నాడిని సరిగ్గా అంచనా వేయడంలో కొంత తడబడ్డాడు. ఫస్టాఫ్‌లో పలు సన్నివేశాల్లో ఆ తడబాటు కనిపించింది. కమర్షియల్ హంగులు, డ్రామా జోలికి వెళ్లకుండా నంబి నారాయణన్ జీవితంలో జరిగినది జరిగినట్టు చెప్పాలని మాధవన్ ప్రయత్నించారు. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు సైన్స్ పాఠాలను గుర్తు చేస్తాయి. ఫస్టాఫ్ ఏమంత ఆకట్టుకోదు. ద్వితీయార్థంలో మాధవన్ అరెస్ట్ తర్వాత సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. స్క్రీన్ ప్లే పరంగా మరింత వర్క్ చేయడంతో పాటు కొన్ని సన్నివేశాలకు మాధవన్ కత్తెర వేయాల్సింది.
నంబి అరెస్టుకు మూల కారణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. దాన్ని ఈ సినిమాలో చూపించారనుకుంటే పొరపాటే. ఈ సినిమా ద్వారా మరోసారి అసలు కారణం తెలియాలని నంబి ప్రశ్నించారు. విదేశీ శాస్త్రవేత్త ఇంట్లో నంబి పడిన కష్టాన్ని, విదేశాల్లో ఆయన ప్రయాణాన్ని ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా తక్కువ సన్నివేశాల్లో మరింత ప్రభావం చూపించేలా తెరకెక్కించాల్సింది. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం ఓకే. రామ్ మనోహర్ సాహిత్యంలో కథలో ఆత్మ కనిపించింది. నంబి జీవితంలో ఆవేదన ఆవిష్కృతం అయ్యింది.
నటుడిగా మాధవన్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. నంబి నారాయణన్ జీవితంలో వివిధ దశలు చూపించడం కోసం బరువు తగ్గారు, పెరిగారు. శారీరకంగా ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టం కంటే నటన ఎక్కువ ఆకట్టుకుంటుంది. నటుడిగా మాధవన్ చేసిన అద్భుతమైన పాత్రల్లో నంబి నారాయణన్ ఒకటిగా నిలుస్తుంది. నంబి భార్య మీనా పాత్రలో సిమ్రాన్ జీవించారు. పతాక సన్నివేశాల్లో ప్రేక్షకులకు షాక్ ఇస్తారు. మిగతా నటీనటుల్లో గుర్తు పెట్టుకోదగ్గ వారు తక్కువ. కలాం పాత్రలో గుల్షన్ గ్రోవర్, నంబిని ఇంటర్వ్యూ చేసే స్టార్ హీరో సూర్యగా సూర్య ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇక, సినిమా చివర్లో నంబి నారాయణన్ కనిపించడం హైలైట్.
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
నంబి నారాయణన్ పడిన కష్టాన్ని, ఎదుర్కొన్న అవమానాలను, పడిన మానసిక క్షోభను వెండితెరపై ఆవిష్కరించడంలో మాధవన్‌లో నటుడు సక్సెస్ అయ్యారు. అయితే... ఆయన కథను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాగా మలచడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. డాక్యుమెంటరీలా తీశారు. 'రాకెట్రీ'కి ప్రశంసలు దక్కుతాయి. అయితే... అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించడం కష్టం. ఒక్కటి మాత్రం నిజం... నంబి నారాయణన్‌ను గౌరవించిన చిత్రమిది. దీని నుంచి విజువల్ గ్రాండియర్ ఆశించవద్దు. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ పక్కన పెట్టి... నంబి నారాయణన్ జీవితం గురించి తెలుసుకోవడంతో పాటు మాధవన్ కోసం ఒకసారి చూడొచ్చు.