సినిమా రివ్యూ: టెన్త్ క్లాస్ డైరీస్
రేటింగ్: 1.75/5
నటీనటులు: శ్రీరామ్, అవికా గోర్, 'వెన్నెల' రామారావు, శ్రీనివాసరెడ్డి, హిమజ, అర్చన, శివబాలాజీ, నాజర్, సంజయ్ స్వరూప్, భానుశ్రీ తదితరులు
కథ: రామారావు
స్క్రీన్ ప్లే - డైలాగ్స్: శ్రుతిక్
నేపథ్య సంగీతం: చిన్నా
స్వరాలు: సురేష్ బొబ్బిలి
సమర్పణ: అజయ్ మైసూర్
నిర్మాతలు: అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం
అడిషనల్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: 'గరుడవేగ' అంజి
విడుదల తేదీ: జూలై 1, 2022
స్కూల్‌మేట్స్‌ను మళ్ళీ కలుసుకోవడం (రీయూనియన్) నేపథ్యంలో 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'జాను' (తమిళ హిట్ '96) వంటి చిత్రాలు వచ్చాయి. ఆ కోవలో వచ్చిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్' (10th Class Diaries Movie). దీంతో 'గరుడవేగ' అంజి (Garudavega Anji) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఛాయాగ్రాహకుడిగా ఆయనకు 50వ చిత్రమిది. కథ అందించడంతో పాటు చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నారు నటుడు 'వెన్నెల' రామారావు. ఈ సినిమా ఎలా ఉంది? స్కూల్‌లో లవ్ కాకుండా ఇంకేం చెప్పారు?
కథ (10th Class Diaries Movie Story): సోము... సోమయాజి (శ్రీరామ్) అమెరికాలో స్థిరపడిన రాజమండ్రి వాసి. అతడి దగ్గర అందం, ఐశ్వర్యం ఉన్నాయి. అతడంటే పడని అమ్మాయి లేదు. కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చేశాడు. అయినా... పడక సుఖానికి, పదిమందిలో పేరుకు లోటు లేదు. అయితే అతడిలో ఏదో అసంతృప్తి. దాంతో సైకాలజిస్ట్‌ను కలుస్తాడు. అతడు సోము కథంతా విని ఓ సలహా ఇస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇండియాలో వాలిపోయిన సోము... టెన్త్ క్లాస్ బ్యాచ్ రీయూనియన్ ప్లాన్ చేస్తాడు. దానికి అందరూ వస్తారు... ఒక్క చాందిని (అవికా గోర్) తప్ప! దాంతో సోము అప్‌సెట్ అవుతాడు. చాందినిని కలవడం కోసం క్లాస్‌మేట్స్ ('వెన్నెల' రామారావు, హిమజ, శ్రీనివాసరెడ్డి, అర్చన)తో కలిసి ఊరు వెళతాడు. ఊరిలోనూ చాందిని లేదు. ఆమె ఎక్కడ ఉంది? ఆమెకు ఏమైంది? చివరకు... సోము, చాందిని కలిశారా? లేదా? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (10th Class Diaries Review) : స్కూల్ లైఫ్, కాలేజీ లైఫ్ మీద సినిమాలు ఎన్ని వచ్చినా ఆదరణ ఉంటుంది. ఎందుకంటే... స్కూల్, కాలేజీకి వెళ్లిన ప్రతి ఒక్కరూ సినిమా చూసేటప్పుడు ఆ రోజుల్లోకి వెళతారు. తెరపై పాత్రల్లో తమను తాము చూసుకుంటారు. 'టెన్త్ క్లాస్ డైరీస్'లో రీయూనియన్ వరకూ కాస్త సరదాగా వెళుతుంది. శ్రీరామ్, వెన్నెల రామారావు, శ్రీనివాసరెడ్డి సన్నివేశాలు వినోదం పంచుతాయి.
'టెన్త్ క్లాస్ డైరీస్'లో వినోదం వర్కవుట్ అయినట్టు... ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. ఎప్పుడైతే చాందిని కోసం అన్వేషణ మొదలైందో... అప్పుడు నెమ్మదిగా ఆసక్తి సన్నగిల్లుతూ వస్తుంది. అసలు కథంతా అన్వేషణలో ఉండటంతో చిక్కులు తప్పలేదు. అదీ సినిమాకు మేజర్ మైనస్. ముఖ్యంగా అమ్మాయితో లారీ డ్రైవర్స్, బస్ స్టాప్‌లో జనాలు, హోటల్ యజమాని ప్రవర్తించే తీరు ఫోర్స్డ్‌గా అనిపిస్తాయి. పాటలు పర్వాలేదు. అలాగని, గుర్తు పెట్టుకునేలా లేవు. ఇటువంటి సినిమాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అవసరం. నేపథ్య సంగీతంలోనూ మెరుపులు లేవు. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బావున్నాయి.
నటీనటులు ఎలా చేశారు?: శ్రీరామ్ హ్యాండ్సమ్‌గా ఉన్నారు. నటుడిగా పాత్ర పరిధి మేరకు చేశారు. ద్వితీయార్థం, పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలను బాగా చూపించారు. 'వెన్నెల' రామారావు, శ్రీనివాసరెడ్డి కాంబినేషన్‌లో కామెడీ సీన్స్ నవ్విస్తాయి. అఘోరగా 'తాగుబోతు' రమేష్ నవ్వించే ప్రయత్నం చేశారు. హిమజ పాత్రను హుందాగా తీర్చిదిద్దారు. అలాగే, అర్చన పాత్ర కూడా! నెగెటివ్ నోట్‌లో ప్రారంభమై... పాజిటివ్ నోట్‌లో ముగిసే పాత్రలో శివ బాలాజీ కనిపించారు. ప్రేమ అంటే సగటు తండ్రి ఏ విధంగా స్పందిస్తారో... అటువంటి రోల్ నాజర్ చేశారు. సినిమాలో కీలకమైన పాత్రలో అవికా గోర్ కనిపిస్తారు. ద్వితీయార్థంలో తెరపైకి వస్తారు. పాత్ర, సన్నివేశాలకు అవికా గోర్ న్యాయం చేశారు. అయితే... శ్రీరామ్, అవికా గోర్ క్లాస్‌మేట్స్ అంటే నమ్మడం కష్టంగా ఉంటుంది. శ్రీరామ్, వెన్నెల రామారావు, హిమజ, అర్చన ఒక ఏజ్ గ్రూప్‌లో కనపడితే... అవికా గోర్ మరొక ఏజ్ గ్రూప్ అనిపించారు.
Also Read : 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే?: కథ పరంగా 'టెన్త్ క్లాస్ డైరీస్'లో విషయం ఉంది. అయితే... స్క్రీన్ మీదకు సరిగా రాలేదు. ముఖ్యంగా సెకండాఫ్ ప్రేక్షకులకు పరీక్ష పెడుతుంది. ఒకవేళ ఎమోషన్ వర్కవుట్ అయ్యి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఫస్టాఫ్‌లో కామెడీ కాస్త కితకితలు పెడుతుంది.
Also Read : 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?