సినిమా రివ్యూ: థోర్: లవ్ అండ్ థండర్
రేటింగ్: 2.5/5
నటీనటులు: క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్టియన్ బేల్, నటాలీ పోర్ట్‌మన్, టెస్సా థామ్సన్ తదితరులు
సంగీతం: మైకేల్ గియాచినో, నమి మెలుమాడ్
నిర్మాణ సంస్థ: మార్వెల్ స్టూడియోస్
దర్శకత్వం: టైకా వైటిటీ
విడుదల తేదీ: జులై 7, 2022
మార్వెల్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ థోర్‌కు ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికాల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే మార్వెల్ ఫ్రాంచైజీ హిస్టరీలో మొదటిసారిగా ఒక సూపర్ హీరో సినిమాకు నాలుగో సినిమాను రూపొందించారు. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికాల కథలను కూడా మూడు సినిమాల్లో ముగించిన మార్వెల్ థోర్‌కు నాలుగో సినిమా తెరకెక్కించడం అభిమానుల్లో అంచనాలు పెంచింది. దీనికి తోడు నోలాన్ బ్యాట్‌మ్యాన్ సినిమాల్లో టైటిల్ రోల్ పోషించిన విలక్షణ నటుడు క్రిస్టియన్ బేల్ ఇందులో విలన్ పాత్రలో నటించాడు. మరి ఈ కొత్త థోర్ సినిమా అభిమానులను అలరించిందా?
కథ: గోర్ (క్రిస్టియన్ బేల్) కూతురిని కాపాడమని ఒక దేవుడిని ప్రార్థించినా ఫలితం ఉండదు. తన కూతురు చనిపోతుంది. ఆ తర్వాత ఆ దేవుడు ప్రత్యక్షమై వెటకారంగా మాట్లాడటంతో పాటు గోర్‌నే చంపబోతాడు. ఇంతలో శాపగ్రస్తమైన ఒక కత్తితో గోర్ ఆ దేవుడిని చంపేస్తాడు. అక్కడ నుంచి దేవుళ్ల మీద పగ పెంచుకుని ప్రతి గ్రహం మీద దేవుళ్లను చంపేస్తూ ఉంటాడు. మరోవైపు థోర్ (క్రిస్ హెమ్స్‌వర్త్) గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ బృందంతో కలిసి విశ్వంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాడు. థోర్ స్నేహితురాలు అయిన సిఫ్ (జేమీ అలెగ్జాండర్) ఉన్న గ్రహం మీద కూడా గోర్ దాడి చేస్తాడు. చావు బతుకుల మధ్య ఉన్న సిఫ్ థోర్‌ను పిలుస్తుంది. గోర్ తర్వాతి లక్ష్యం థోర్‌ని చంపడమేనని చెబుతుంది. అప్పుడు థోర్ ఏం చేశాడు? తనతో పాటు మిగతా దేవుళ్లను ఎలా కాపాడుకున్నాడు? అన్నది తెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ: అవెంజర్స్ బృందంలో థోర్‌కు ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లను మించిన మానవాతీత శక్తులు థోర్ సొంతం. థోర్: రాగ్నరాక్‌లో (దీనికి ముందు భాగం), అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్, ఎండ్ గేమ్ చిత్రాల్లో థోర్ ఎంత పవర్‌ఫుల్లో చూడవచ్చు. ఆ చిత్రాల తరహాలోనే థోర్ సూపర్ హీరో విన్యాసాలు ఉండాలి అనుకుని ఈ సినిమాకు వెళ్తే మాత్రం కొంచెం నిరాశ తప్పదు. ఎందుకంటే ఇందులో పోరాట సన్నివేశాల కంటే హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, విలన్ ఎమోషనల్ కనెక్షన్ మీదనే దర్శకుడు టైకా వైటిటీ ఎక్కువ దృష్టి పెట్టాడు.
థోర్ సిరీస్‌లో ఇంతకు ముందు వచ్చిన మూడు సినిమాలకు, ఈ సినిమాకు ప్రధానమైన తేడా ఒకటి ఉంది. ఆ మూడు సినిమాలు పూర్తిగా థోర్ కథలు. థోర్ చుట్టూ తిరిగే కథల్లోకి విలన్స్ వస్తారు. వారిని థోర్ ఓడిస్తాడు, కథ సుఖాంతం అవుతుంది. కానీ ఈ సినిమా అలా కాదు. ఇది గోర్ కథ. గోర్‌తో ప్రారంభమై, గోర్‌తోనే ముగుస్తుంది. తన దారిలోకే థోర్ అడ్డం వస్తాడు. అందుకే ఈ సినిమాలో థోర్ కంటే గోర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తుంది. క్రిస్టియన్ బేల్ లాంటి నటుడు విలన్ పాత్రకు ఒప్పుకోవడానికి కూడా ఆ ప్రాముఖ్యతే కారణం.
రెగ్యులర్ మూవీ లవర్స్‌ను ఈ సినిమా సంతృప్తి పరిచినా, థోర్ అభిమానులకు ఒకింత అసంతృప్తి మిగలడానికి ఇదే కారణం అవుతుంది. కథాపరంగా సినిమాలో వంక పెట్టడానికి ఏమీ లేదు. ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా టైకా వైటిటీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా థోర్, జేన్ ఫాస్టర్‌ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలు కథానుగుణంగానే వస్తాయి. క్లైమ్యాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్ అద్బుతంగా ఉంటుంది. థోర్ ఐదో సినిమా కూడా వస్తుందని చివర్లో అనౌన్స్ చేశారు.
ఒక సూపర్ హీరోను పోస్టర్ మీద పెట్టి ఒక సినిమా తీసినప్పుడు ఆడియన్స్‌కు కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ పోస్టర్ మీదున్న సూపర్ హీరో చుట్టూ కథ తిరగాలని, తన ప్లస్ పాయింట్లను గత సినిమాల్లో ఎలా చూపించారో అంతకు మించి ఈ సినిమాలో చూపించాలని సాధారణ ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆశపడతారు. కానీ మార్వెల్ కొంతకాలంగా ఇక్కడే అదుపు తప్పుతుంది. ఎంసీయూలో ఇంతకు ముందు వచ్చిన ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’లో కూడా నెగిటివ్ రోల్ పోషించిన వాండాకే ఎక్కువ ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ‘థోర్: లవ్ అండ్ థండర్’లో కూడా అదే జరిగింది. గతంలో థోర్ కనిపించినప్పుడు ఇచ్చిన ఎలివేషన్లు, హీరోయిజం షాట్లు కనిపించాలని ఆడియన్స్ కోరుకుంటారు. కానీ సినిమా అంతా గోర్, జేన్ ఫాస్టర్ క్యాన్సర్ చుట్టూనే తిరుగుతుంది.
ఇక మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా కాస్త నిరాశనే కలిగిస్తుంది. ఎందుకంటే థోర్: రాగ్నరాక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక అద్బుతం. అందులో వచ్చే థీమ్ సాంగ్‌కు ఇప్పటికీ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమా తర్వాత వచ్చిన చిత్రం కాబట్టి దీని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను ఈ సినిమాలోని సౌండ్ ట్రాక్ అందుకోలేకపోయింది. విజువల్‌గా మాత్రం ఈ సినిమా స్టన్నింగ్ అని చెప్పవచ్చు. రన్‌టైం రెండు గంటలే ఉండటం కలిసొచ్చే అంశం.
Also Read : 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?
నటీనటుల విషయానికి వస్తే... థోర్ పాత్ర క్రిస్ హెమ్స్‌వర్త్‌కు కొట్టిన పిండి. అవెంజర్స్, థోర్ సినిమాల్లో కలిపితే ఇప్పటి వరకు ఏడు సినిమాల్లో థోర్ కనిపిస్తాడు. కాబట్టి నటన, యాక్షన్ పరంగా క్రిస్‌కు వంక పెట్టలేం. థోర్ పాత్ర కోసం ఎక్స్‌ట్రా ఫిట్‌గా కూడా ఈ సినిమాలో కనిపిస్తాడు. గోర్ పాత్రలో కనిపించిన క్రిస్టియన్ బేల్ ఈ సినిమాకు షో స్టీలర్. ఎమోషనల్ సన్నివేశాలు, కోపాన్ని చూపించే సీన్లలో తన నటన పీక్స్‌లో ఉంటుంది. ఈ పాత్రకు తను పర్ఫెక్ట్ చాయిస్. వీరిద్దరి తర్వాత ప్రధాన పాత్ర థోర్ ప్రేయసి జేన్ ఫాస్టర్ పాత్రలో కనిపించిన నటాలీ పోర్ట్‌మన్‌ది. చివరి దశ క్యాన్సర్‌తో పోరాడే పేషెంట్ పాత్రలో తను జీవించింది. మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... థోర్ పాత్ర మీద ఎక్కువ అంచనాలు లేకుండా ఒక కథ లాగా చూస్తే ఈ సినిమా నచ్చుతుంది. థోర్: రాగ్నరాక్‌ను దృష్టిలో పెట్టుకుని వెళ్తే మాత్రం నిరాశ పడటం ఖాయం.
Also Read : 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?