వెబ్ సిరీస్ రివ్యూ : లస్ట్ స్టోరీస్ 2 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : మృణాల్ ఠాకూర్, అంగద్ బేడీ, నీనా గుప్తా, తమన్నా, విజయ్ వర్మ, తిలోత్తమా షోమే, అమృతా సుభాష్, కాజోల్, కుముద్ మిశ్రా తదితరులు
నిర్మాతలు : రోనీ స్క్రూవాలా, అషీ దువా
దర్శకత్వం : ఆర్. బల్కి, కొంకణా సేన్ శర్మ, అమిత్ రవీంద్రనాథ్ శర్మ, సుజోయ్ ఘోష్
విడుదల తేదీ: జూన్ 29, 2023
ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్!


Lust Stories 2 Review in Telugu: శృంగారం అనేది నాలుగు గోడలకు మధ్య పరిమితమైన అంశమని, నలుగురిలో మాట్లాడటం నేరమని భావించే జనాలు భారతీయ సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఆ శృంగారమే ప్రధాన అంశంగా 'లస్ట్ స్టోరీస్' వచ్చింది. వివాహేతర సంబంధం నుంచి పెళ్లికి ముందు, తర్వాత ఆడ మగ శృంగారం వరకు అందులో చర్చించారు. ఇప్పుడు 'లస్ట్ స్టోరీస్' రెండో సీజన్ వచ్చింది. ఇదీ నాలుగు కథల సమాహారంగా రూపొందిన యాంథాలజీయే. తమన్నా, విజయ్ వర్మ లవ్ కహానీ కారణంగా దీనికి మరింత ప్రచారం లభించింది. ప్రచారానికి తగ్గట్టు సిరీస్ (Lust Stories Season 2 Review) ఉందా? లేదా?


పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా?
వేద (మృణాల్ ఠాకూర్), అర్జున్ (అంగద్ బేడీ)కి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయిస్తారు. పెళ్లి మాటల మధ్యలో వేద నానమ్మ (నీనా గుప్తా) చెప్పిన పాయింట్ అందరికి షాక్ ఇస్తుంది. 'కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తాం. మరి, పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా?' అని ప్రశ్నించడమే కాదు.. ఆలుమగల మధ్య శృంగారం గొప్పగా ఉండాలని చెబుతుంది. దాంతో పెళ్ళికి ముందు వేద, అర్జున్ ఏం చేశారు? తర్వాత ఏమైంది? అనేది స్క్రీన్ మీద చూడాలి (ఇదీ మొదటి కథ). 


ఎలా ఉంది? : ఎలా తీశారు? : 'పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా?' - 'లస్ట్ స్టోరీస్ 2' ప్రచార చిత్రాల్లో వైరల్ అయిన డైలాగ్! ఆ మాటలో ఉన్న డెప్త్ కథలో, కథను తెరకెక్కించిన విధానంలో లేదు. దర్శకుడు ఆర్. బల్కి మాటల్లో ఎటువంటి మొహమాటం చూపించలేదు. కానీ, తీయడంలో మొహమాటపడ్డారు. దంపతుల మధ్య శృంగార జీవితం గొప్పగా ఉంటే సంతోషంగా ఉంటారని సందేశం ఇచ్చారు. అది చెబితే సరిపోతుంది కదా! ఈ కథను తెరకెక్కించడం ఎందుకు? అని చూసిన తర్వాత సందేహం కలుగుతుంది. మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, అంగద్ బేడీ... ఎవరికీ పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు.    


దొంగచాటుగా పనిమనిషి శృంగారం చూస్తే?
ఇషిత (తిలోత్తమా షోమే) ఒంటరి మహిళ. తలనొప్పి (మైగ్రేన్)గా అనిపించడంతో ఓ రోజు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వస్తుంది. తలుపు ఓపెన్ చేసి చూస్తే బెడ్ మీద పని మనిషి సీమ (అమృతా సుభాష్) గాఢమైన శృంగారంలో ఉంటుంది. తొలుత షాక్ అయినా... తర్వాత నుంచి దొంగచాటుగా చూడటం మొదలు పెడుతుంది. ఆమె ఎందుకు అలా చేస్తుంది? దొంగచాటుగా శృంగారాన్ని చూస్తున్న సంగతి పని మనిషికి తెలిసిందా? ఆమె శృంగారం చేస్తున్నది ఎవరితో? చివరకు ఏమైంది? అనేది స్క్రీన్ మీద చూడాలి. (ఇదీ రెండో కథ) 


ఎలా ఉంది? : శృంగారం కొందరికి సంతృప్తి ఇస్తుంది. ఇతరుల శృంగారాన్ని చూసి కొందరు సంతృప్తి పొందుతారు. రెండు రకాల వ్యక్తిత్వాలను దర్శకురాలు కొంకణా సేన్ శర్మ చూపించారు. అయితే... కథలో చెప్పాలనుకున్న విషయంలో స్పష్టత లేదు. ముంబై మురికివాడల్లో కుటుంబం అంతా ఒక్క గదిలో జీవిస్తుంది. భర్తతో ఏకాంతంగా గడిపే సమయం దొరకదు. అందుకని, యజమాని ఇంటిలో సంసార జీవితం మొదలు పెడుతుంది. భార్యాభర్తలు ప్రతిరోజూ శృంగారంలో  పాల్గొంటారు. యజమాని చూస్తున్న విషయం తెలిసిన తర్వాత పని మనిషి స్పందించే తీరు కాస్త వింతగా ఉంటుంది. అయితే... అమృతా సుభాష్, తిలోత్తమా శర్మ నటన సహజంగా ఉంది. కథలో వాస్తవ పరిస్థితులను ఆవిష్కరించారు కానీ... ముగింపు సరిగా లేదు. ఏం చెప్పాలనుకున్నారో క్లారిటీ లేదు.   


పదేళ్ళ క్రితం మాయమైన భార్య కనపడితే?
విజయ్ చౌహన్ (విజయ్ వర్మ) స్త్రీ లోలుడు. ఓ పెద్ద కంపెనీకి సీఈవో. అర్జెంట్ మీటింగ్ ఉందని ఫోన్ వస్తుంది. వెళుతుంటే కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఓ ఊరిలో ఆగుతాడు. అక్కడ శాంతి (తమన్నా భాటియా) కనబడుతుంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. పదేళ్ళ క్రితం శాంతి ఉన్నట్టుండి మాయమవుతుంది. భార్య కనిపించకుండా పోవడంతో విజయ్ మరో పెళ్ళి (స్నేహితురాలు అను - ముక్తీ మోహన్) చేసుకుంటాడు. ఆమె తండ్రి కంపెనీలో సీఈవో అవుతాడు. పదేళ్ళ క్రితం మాయమైన భార్య మళ్ళీ కనిపించడంతో విజయ్ చౌహన్ ఏం చేశాడు? భర్తకు శాంతి దూరం కావడానికి కారణం ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. (ఇదీ మూడో కథ)


ఎలా ఉంది? : 'లస్ట్ స్టోరీస్' మీద తెలుగు ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీ కలగడానికి కారణమైన కథ ఇది. నిడివి తక్కువ. దీనికి హారర్ రివేంజ్ టచ్ ఇచ్చారు. కథలో విషయం లేదు. ప్రతీకారం తప్ప! కానీ, ఆసక్తి కథ ముందుకు వెళ్ళిందంటే కారణం విజయ్ వర్మ, తమన్నా భాటియా మధ్య కెమిస్ట్రీ అని చెప్పాలి. గ్లామర్ షో పరంగా తమన్నా ఓ అడుగు ముందుకు వేశారు. నటిగానూ మెరిశారు. దర్శకుడు సుజోయ్ ఘోష్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని తడబాటు లేకుండా చెప్పేశారు.


అనుకున్నది ఒక్కటి... అయినది ఒక్కటి!
చందా (కాజోల్)కు కుమారుడిని ఇంగ్లాండ్ పంపించి చదివించాలని కోరిక. ఆమె భర్త (కుముద్ మిశ్రా) ప్రతి రోజూ తాగొచ్చి కొడతాడు. మొరటుగా శృంగారం చేస్తాడు. వేశ్య గృహం నుంచి రాజ వంశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని పెద్ద భవంతిలో అడుగు పెట్టినా ఆమె కష్టాలు కొనసాగుతాయి. పని మనిషి మీద భర్త కన్ను వేస్తాడు? ఆ విషయం తెలిసి చందా ఏం చేసింది? చివరకు, ఏమైంది? అనేది 'లస్ట్ స్టోరీస్ 2'లో ఆఖరి కథ. 


ఎలా ఉంది? : ఓ సన్నివేశంలో కాజోల్ వేశ్య గృహానికి ఫోన్ చేస్తారు. అటు వైపు ఫోన్ ఎత్తిన మనిషి మాటల మధ్యలో 'నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు మహారాణిలా ఉన్నావ్. అక్కడికి వెళ్లిన తర్వాత బజారు మనిషి అయ్యావ్' అని అంటుంది. వేశ్య గృహం నుంచి రాజ భవనానికి చందా ఎలా వెళ్ళింది? అని క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్ శర్మ. సంపన్న కుటుంబాల్లోనూ లైంగిక వేధింపులు ఉంటాయని చెప్పారు. భర్త అరాచకాలు భరించలేక విముక్తి కోసం భార్య ఓ పథకం రచిస్తే... విధి ఆడిన వింత నాటకంలో చివరకు ఆమెకు ఎదురు దెబ్బ తగులుతుంది. బాధపెట్టే పని జరుగుతుంది. 


అయితే... చందా పాత్రలో కాజోల్ నటన ఆకట్టుకుంటుంది. కేవలం కళ్ళతోనే హావభావాలు పలికించిన తీరు అద్భుతం. కథ చివరిలో ఇచ్చిన ట్విస్ట్ చిన్న షాక్ ఇస్తుంది. ఆ ట్విస్ట్ వచ్చేవరకు ఏం జరుగుతుందో? తెలుసుకోవాలని ప్రేక్షకుడు చూసేలా తీశారు.   


Also Read : 'స్పై' సినిమా రివ్యూ : నిఖిల్ గురి తప్పిందా? ఎక్కడా తేడా కొట్టింది?


చివరగా చెప్పేది ఏంటంటే? : 'లస్ట్ స్టోరీస్'లోని కథల్లో కనిపించే కామన్ పాయింట్ కామం! అలాగే, బలమైన కథలు ఉన్నాయి. ఆ కథల్లోంచి శృంగారాత్మక సన్నివేశాలను వేరు చేసి చూడలేం. కథల్లో భాగంగా సాగుతాయి. లస్ట్ స్టోరీస్ 2'లో ఆ కామాన్ని కావాలని తీసుకొచ్చినట్టు ఉంటుంది. దాంతో తాము చెప్పాలనుకున్న కథకు గానీ, కామకేళికి గానీ దర్శకులు న్యాయం చేయలేక తడబడ్డారు. 'లస్ట్ స్టోరీస్' టైటిల్ కంటే వేరే టైటిల్ పెడితే బావుండేది. సిరీస్‌ మీద ఇన్ని అంచనాలు ఏర్పడేవి కాదు. 'లస్ట్‌ స్టోరీస్‌ 2'లో దర్శకులు కథలు చెప్పాలనుకున్నారు. కొంకణా సేన్‌ శర్మ కథలో తప్ప మిగతా కథల్లోంచి శృంగారాత్మక సన్నివేశాలను వేరు చేసినా వచ్చే నష్టమేమీ లేదు.  


మృణాల్ ఠాకూర్ కథ సాదాసీదాగా ఉంటుంది. పెద్దగా ప్రభావం చూపదు. తిలోత్తమా శర్మ కథలో కొన్ని పరిస్థితులు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. తమన్నా కథలో గ్లామర్‌, ఆమె నటన ఆకట్టుకుంటుంది. కాజోల్‌ కథ కాలంలో వెనక్కి తీసుకువెళుతుంది. అందులో కామం ఓ భాగమే. దాన్ని మించిన పెయిన్ ఉంది. కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. లస్ట్‌ కోసం అయితే సిరీస్‌ చూడాల్సిన అవసరం లేదు. డిఫరెంట్‌ కథల కోసం అయితే ఖాళీగా ఉన్నప్పుడు లుక్‌ వేయండి. ఓటీటీ కనుక బోర్‌ కొట్టిన్నప్పుడు ముందుకు వెళ్ళడానికి ఫార్వర్డ్‌ ఆప్షన్‌ ఎలాగో ఉందిగా!  


Also Read 'సామజవరగమన' రివ్యూ : కామెడీతో కొట్టిన శ్రీ విష్ణు... సినిమా ఎలా ఉందంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial