సినిమా రివ్యూ : లవ్ యు రామ్
రేటింగ్ : 2.5/5
నటీనటులు : రోహిత్ బెహల్, అపర్ణా జనార్దన్, బెనర్జీ, దశరథ్, ప్రదీప్, కాదంబరి కిరణ్, కార్టూనిస్ట్ మాలిక్, డివై చౌదరి తదితరులు
కథ : కె. దశరథ్
మాటలు : ప్రవీణ్ వర్మ
ఛాయాగ్రహణం : సాయి సంతోష్
సంగీతం : కె. వేదా
నిర్మాత : కె. దశరథ్, డీవై చౌదరి
దర్శకత్వం : డీవై చౌదరి
విడుదల తేదీ: జూన్ 30, 2023
దర్శకుడు దశరథ్ (K Dasarath) పేరు చెబితే 'సంతోషం', 'మిస్టర్ పర్ఫెక్ట్' గుర్తుకు వస్తాయి. పాశ్చాత్య సంస్కృతి, మన సంప్రదాయాలు మేళవించి చక్కటి కుటుంబ కథా చిత్రాలు అందించారు. తొలిసారి దశరథ్ తెరపైకి వచ్చారు. 'లవ్ యు రామ్' (Love You Ram Movie)లో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి దశరథ్ కథ అందించడంతో పాటు దర్శకుడు డీవై చౌదరితో కలిసి నిర్మించారు. ఇందులో 'నాట్యం' ఫేమ్ రోహిత్ బెహల్ హీరో. (Love You Ram Review) ప్రచార చిత్రాలతో ప్లజెంట్ ఫీల్ కలిగించిన ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Love You Ram Story) : రామ్ (రోహిత్ బెహల్) నార్వేలో స్థిరపడిన భారతీయ యువకుడు. అతనిది హోటల్ బిజినెస్. నార్వేలో చాలా హోటల్స్ ఉన్నాయి. పక్కా కమర్షియల్ పర్సన్. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు దివ్య (అపర్ణా జనార్దన్) ఎదురవుతుంది. ఆమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన కంటే డబ్బులు తక్కువ ఉన్న అమ్మాయి కనుక తాను చెప్పింది వింటుందని దివ్యతో పెళ్లికి రామ్ రెడీ అవుతాడు. దివ్య తన బాల్య స్నేహితురాలు అని రామ్ గుర్తు పట్టలేకపోతాడు. చిన్నప్పుడు రామ్ చెప్పిన మాటల వల్ల నలుగురికి సాయం చేసే గుణం దివ్యకు అలవాటు అవుతుంది. అయితే... ఇప్పుడు రామ్ పూర్తిగా మారిపోయాడు. అతడి కమర్షియల్ మైండ్ సెట్, కన్నింగ్ నేచర్ తెలిసిన తర్వాత దివ్య పెళ్ళికి ఓకే చెప్పిందా? లేదా? తాను ఎంతగానో అభిమానించిన వ్యక్తి మోసగాడిగా మారాడని తెలిసిన తర్వాత ఎలా స్పందించింది? దివ్య తన బాల్య స్నేహితురాలు అని రామ్ గుర్తించాడా? లేదా? రామ్ హోటల్స్ సీఈవో పీసీ (దశరథ్) పాత్ర ఏమిటి? చివరకు, ఏమైంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ (Love You Ram Movie Review) : ప్రేమ, ఇష్క్, కాదల్, లవ్... భాష ఏదైనా భావం ఒక్కటే. సిల్వర్ స్క్రీన్ మీద ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. అయితే... కాలంతో పాటు మనుషుల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు, ప్రేమలు మారుతూ వస్తున్నాయి. దశరథ్ రాసిన కథలోనూ ఆ మార్పు కనిపించింది. ప్రేమ, వినోదం మేళవించి తనదైన శైలి భావోద్వేగాలతో ఈ తరం యువతను ప్రతిబింబించేలా 'లవ్ యు రామ్' స్క్రిప్ట్ తీర్చిదిద్దారు.
వాస్తవ దృక్పథంతో కమర్షియల్ కోణంలో సాగే కథానాయకుడి ఆలోచనలు... ప్రేమ మధ్య సంఘర్షణను రచయిత దశరథ్, దర్శకుడు డీవై చౌదరి తెరపైకి తీసుకొచ్చిన విధానం బావుంది. అయితే... కథలో మలుపులు ఊహించడం కష్టం కాదు. తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా చెప్పవచ్చు. అయినా సరే కామెడీ & సీన్స్ ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టేలా ఉన్నాయి. ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి.
ప్రేమలో, మనుషుల్ని నమ్మే విషయంలో... ఈ తరం యువతకు సందేశం ఇచ్చే చిత్రమిది. కథనం కొత్తగా లేదు. కానీ, కథలో ఎమోషన్స్ డీల్ చేసిన విధానం చాలా బావుంది. ముఖ్యంగా కామెడీ. ఫస్టాఫ్ అంతా లవ్ సీన్స్, కామెడీతో అలా అలా సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత కథ సీరియస్ & ఎమోషనల్ వేలో వెళ్లడంతో కామెడీ తగ్గింది. మంచి పాయింట్‌ను చెప్పాలనుకున్నప్పుడు... కథను మరింత ఆసక్తిగా, సెకండాఫ్‌లో కూడా కామెడీ డోస్ పెంచి తీసుకువెళ్ళి ఉంటే బావుండేది.
ప్రవీణ్ వర్మ రాసిన మాటలు సహజంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ ఓకే. వేదా అందించిన మెలోడీలు బావున్నాయి. మంచి రిలీఫ్ ఇస్తాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సందర్భానికి తగ్గట్టు సాగింది. నిడివి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : రామ్ పాత్రకు రోహిత్ బెహల్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. 'నాట్యం'తో పోలిస్తే నటుడిగా చాలా మెరుగయ్యాడు. ముఖ్యంగా హావభావాలు చక్కగా పలికించాడు. పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత అమ్మాయి లేచిపోయిందని తెలిసిన సన్నివేశంలో గానీ, కమర్షియల్ కన్నింగ్ నేచర్ చూపించే సన్నివేశాల్లో గానీ రోహిత్ నటన బావుంది. దివ్యగా అపర్ణా జనార్దన్ ఒదిగిపోయారు. తెరపై అచ్చం పల్లెటూరి అమ్మాయిగానే కనిపించారు. సెంటిమెంట్ & ఎమోషనల్ సన్నివేశాల్లో అపర్ణ నటన బావుంది.
సినిమాలో హైలైట్ అంటే దశరథ్ నటన. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ మామూలుగా నవ్వించలేదు. సెటిల్డ్ గా పంచ్ డైలాగ్స్ చెప్పి ఫన్ జనరేట్ చేశారు. ఆయనలో ఇంత నటుడు ఉన్నాడా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం ఖాయం. జూదగాడిగా, ఏ పని పాట చేయని భర్తగా బెనర్జీ చక్కటి నటన కనపరిచాడు. ఇక, కాదంబరి కిరణ్, ప్రదీప్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు డీవై చౌదరి సైతం ఓ పాత్రలో కనిపించారు.
Also Read : 'మాయా పేటిక' రివ్యూ : ఒక్క టికెట్ మీద ఆరు షోలు - సెల్ ఫోన్ బయోపిక్ ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'లవ్ యు రామ్' యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. యూనివర్సల్ అప్పీల్, కాన్సెప్ట్ ఉన్న సినిమా. కథ సింపుల్ గా ఉంటుంది. కానీ, పాయింట్ ఆలోచింపజేసేలా ఉంటుంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే 'డీసెంట్ ఫిల్మ్' అనిపిస్తుంది. దశరథ్ నటన, ఆయన కామెడీని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.