సినిమా రివ్యూ : మాయా పేటిక
రేటింగ్ : 2/5
నటీనటులు : పాయల్ రాజ్‌పుత్, రజత్ రాఘవ్, పృథ్వీరాజ్, హిమజ, సునీల్, యాంకర్ శ్యామల, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, శ్రీనివాస రెడ్డి తదితరులు
ఛాయాగ్రహణం : సురేష్ రగుతు
సంగీతం : గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌
నిర్మాతలు : మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
దర్శకత్వం : రమేష్ రాపర్తి
విడుదల తేదీ: జూన్ 30, 2023


రమేష్ రాపర్తి (Ramesh Raparthi) దర్శకత్వం వహించిన 'మాయా పేటిక' ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. 'థాంక్ యు బ్రదర్' చిత్రానికీ ఆయన దర్శకత్వం వహించారు. పాయల్ రాజ్ పుత్, సునీల్, శ్రీనివాస రెడ్డి తదితరులు నటించిన ఈ సినిమా ఎలా ఉంది (Maya Petika Review)? ఇది సెల్ ఫోన్ బయోపిక్ అని, ఫోన్ ఒక 'మాయా పేటిక' అని ప్రచారం చేశారు. ఫోన్ బయోపిక్ ఏంటి?


కథ (Maya Petika Story) : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఫోన్ పోతుంది. ఆమెకు నిర్మాత ఓ మొబైల్ గిఫ్టుగా ఇస్తాడు. ఆ ఫోన్ వల్ల కాబోయే భర్తతో గొడవలు వస్తాయి. అందుకని, అసిస్టెంట్‌కు ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి ఫోన్ పలువురి చేతులు మారి పాకిస్థాన్ చేరుతుంది.

ఫోన్ వల్ల కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు (పృథ్వీరాజ్) ఎలా జైలుకు వెళ్లారు? అలీ (విరాజ్ అశ్విన్), ఆస్రా (సిమ్రత్ కౌర్) మధ్య ప్రేమ ఎలా పుట్టింది. వాచ్‌మెన్, అతని భార్య సోషల్ మీడియాలో 'నక్కిలీసు గొలుసు' నారాయణ రావు (సునీల్)గా ఎలా ఫేమస్ అయ్యారు? డబ్బు కోసం హిజ్డా వేషం వేస్తూ, కోతిని ఆడించే శ్రీనివాసరెడ్డి జీవితంలో ఎటువంటి మార్పు చోటు చేసుకుంది? చివరకు, పాకిస్థాన్ తీవ్రవాదుల చేతికి ఎలా వెళ్ళింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Maya Petika Movie Review) : సెల్ ఫోన్ బయోపిక్ అంటూ ఒక్క టికెట్ మీద ఆరు షోలు వేశారు దర్శకుడు రమేష్ రాపర్తి. సినిమాలో మొత్తం ఆరు కథల్ని చూపించారు. ఓ కథకు, మరో కథకు సంబంధం ఉండదు. మధ్యలో పాయల్, సునీల్ మధ్య ఓ సీన్... పతాక సన్నివేశంలో శ్రీనివాసరెడ్డి, విరాజ్ అశ్విన్ మధ్య మరో సీన్ ఉంటుంది. 'వేదం' తరహాలో చివరకు వచ్చేసరికి అన్ని కథల్ని కలిపి కొత్తగా ఏదైనా చెబుతారని ఆశిస్తే నిరాశే మిగిలింది. 


'మాయా పేటిక'ను సినిమా అనడం కంటే యాంథాలజీ అంటే కరెక్ట్. ఓ కథ తర్వాత మరో కథ... వరుసగా ఆరు కథలు వస్తాయి. అందులో కొన్ని మాత్రమే 'పర్వాలేదు' అని చెప్పేలా ఉన్నాయి. తెలుగులో ఈ మధ్య స్పూఫ్ కామెడీ తగ్గింది. ఆ లోటును 'మాయా పేటిక' భర్తీ చేస్తుంది. అలాగని, గొప్పగా నవ్వించే సీన్లు ఎక్కువ ఉన్నాయని ఆశిస్తే నిరాశ కలుగుతుంది. కన్నె కామేశ్వర రావుగా '30' ఇయర్స్ పృథ్వీ ఎపిసోడ్ చూస్తే... ఏపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గుర్తుకు వస్తారు. మధ్యలో ఆయనపై విమర్శలకు, టీటీడీలో పదవి కోల్పోవడానికి కారణమైన 'వెనుక నుంచి వచ్చి వాటేసుకుందాం' డైలాగ్ కూడా వాడేశారు. టిక్ టాక్ దుర్గారావు స్ఫూర్తితో సునీల్, శ్యామల ట్రాక్ రాశారు. అయితే... ఆ కథల్లో డెప్త్ లేదు. జస్ట్ నవ్వించాయి అంతే!


విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్ మధ్య ప్రేమ కథలో నిజాయతీ ఉంది. అయితే... ట్విస్ట్ ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఆ కథ నిదానంగా సాగింది. శ్రీనివాసరెడ్డి కథలో కోతి పర్సులు కొట్టేయడం కాన్సెప్ట్ తెలుగు తెరకు కొంచెం కొత్త. నటుడిగా శ్రీనివాస రెడ్డి బాగా చేయడంతో ఎమోషన్స్ వర్కవుట్ అయ్యింది. టెర్రరిస్ట్ ఎపిసోడ్ మొదలైన కాసేపటికి ఎప్పుడు ముగుస్తోందా? అని చూసేలా మారింది.


సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తే తప్ప 'మాయా పేటిక' వంటి కథల్ని రాయలేదు. రమేష్ రాపర్తి మంచి రీసెర్చ్ చేసినట్టు అర్థం అవుతోంది. అయితే... కథల్ని ఒక్కటి చేయడంలో, డెప్త్ చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. సురేష్ రగుతు కెమెరా వర్క్ బావుంది. కథకు తగ్గట్టు మూడ్ చేంజ్ చేశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండే పాటలు లేవు. కానీ, స్క్రీన్ మీద పాయల్ సాంగ్ పిక్చరైజేషన్ బావుంది. విరాజ్ అశ్విన్, సిమ్రత్ మధ్య సాంగ్ వినసొంపుగా, అందంగా ఉంది.       


నటీనటులు ఎలా చేశారు? : సినిమాలోనూ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ రోల్ చేశారు. అందంగా కనిపించారు. సన్నివేశాలకు తగ్గట్లు నటించారు. 'విప్పేయ్' అంటూ కన్నె కామేశ్వరరావు పాత్రలో పృథ్వీ కొంత నవ్వించారు. ఆయన, 'మిర్చి' కిరణ్ టైమింగ్ వల్ల కొన్ని సీన్లు బాగా వచ్చాయి. సునీల్, శ్యామల ట్రాక్ మొత్తం స్పూఫ్ కావడంతో వాళ్ళిద్దరికీ నటించే అవకాశం రాలేదు. శ్రీనివాసరెడ్డి కొంత విరామం తర్వాత చాలా సేపు స్క్రీన్ మీద కనిపించారు. ముస్లిం యువతీ యువకుల పాత్రల్లో సిమ్రత్ కౌర్, విరాజ్ అశ్విన్ ఒదిగిపోయారు. వాళ్ళ కెమిస్ట్రీ కూడా బావుంది. 


Also Read 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ : తమన్నా బోల్డ్‌గా చేశారు సరే సిరీస్‌ ఎలా ఉంది? శృంగారం గురించి కొత్తగా ఏం చెప్పారు?


చివరగా చెప్పేది ఏంటంటే? : మనుషుల జీవితాల్లో ఫోన్ ఎటువంటి మార్పులకు కారణం అవుతుందనేది చెప్పాలనుకోవడం మంచి పాయింట్. దానిని ఆచరణలోకి తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ కాలేదు. సమాజంలో అంశాలపై రీసెర్చ్ చేశారు కానీ... కథల్లో ఎమోషన్స్, కామెడీ ఎంత ఉంది? అనేది సెర్చ్ చేసుకోలేదు. ప్రేక్షకుడికి భావోద్వేగాలు కనెక్ట్ అయ్యేలా సీన్స్ రాసుకోలేదు. అందువల్ల, 'మాయా పేటిక'మంచి ప్రయత్నంగా మిగిలింది. ఇది మంచి సినిమా అనిపించుకోదు. 'మాయా పేటిక' టైటిల్‌ పెట్టడంలో చూపించిన క్రియేటివిటీ సినిమాలో, సీన్లలో చూపించలేదు.  


Also Read 'స్పై' సినిమా రివ్యూ : నిఖిల్ గురి ఎక్కడ తప్పింది? ఎందుకు తేడా కొట్టింది?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial