Kaathal The Core movie review starring Mammootty and Jyothika: మమ్ముట్టి, జ్యోతిక నటించిన మలయాళ సినిమా 'కాథల్ ది కోర్'. నవంబర్ 23న కేరళలోని థియేటర్లలో విడుదలైంది. రూ. 150 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగు ప్రేక్షకులలో  మమ్ముట్టి, జ్యోతికకు అభిమానులు ఉన్నారు. పైగా, హీరోది గే రోల్ అని తెలియడంతో ఆసక్తి చూపించారు. సినిమా ఎలా ఉంది?


కథ: మాథ్యూ (మమ్ముట్టి), ఓమన (జ్యోతిక) దంపతులు. వాళ్లమ్మాయి ఫెమి (అనఘా రవి) వేరే ఊరిలో చదువుకుంటోంది. ఫ్యామిలీకి మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి. సో, అంతా హ్యాపీ. మాథ్యూ వార్డు ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేస్తాడు. భర్త  గే అని, అతని నుంచి విడాకులు కావాలని కోరుతూ ఓమన కోర్టులో పిటిషన్ వేస్తుంది. ఆమె చేసిన ఆరోపణలు నిజమేనా? మాథ్యూ గే అయితే బిడ్డ ఎలా పుట్టింది? ఎన్నికల నేపథ్యంలో అపోజిషన్ పార్టీలు ఏమైనా కుట్ర చేశాయా? ప్రజలు ఎలా రెస్పాండ్ అయ్యారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.


విశ్లేషణ: 'కాథల్ ది కోర్' కంటే ముందు దర్శకుడు Jeo Baby 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' తీశారు. భార్యాభర్తలు విడాకులు తీసుకోవడంతో ఆ కథ ముగుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యమైన కథ భర్త నుంచి విడాకులు కోరుతూ భార్య కోర్టుకు వెళ్లడంతో మొదలవుతుంది. కోర్టు, సెక్షన్ 377ను కేవలం తన కథకు అవసరమైనంత మేరకు మాత్రమే దర్శకుడు వాడుకున్నారు. భార్యభర్తల మధ్య వైవాహిక సంబంధం ఎలా ఉంది? వాళ్ల మానసిక పరిస్థితి ఏమిటి? వాళ్లిద్దరూ కోరుకుంటున్నది ఏంటి? అనేది చెప్పారు.


భార్యాభర్తల గొడవలు అనేసరికి అరుపులు, కొట్లాటలు వంటివి తెరపై ఎక్కువగా వచ్చాయి. ఆ సినిమాలకు 'కాథల్ ది కోర్' పూర్తిగా భిన్నమైన సినిమా. అరిచి గీ పెట్టడాలు, గుండెలు బాదుకుంటూ ఏడవడాలు, కొట్టుకోవడాలు అసలు లేవు. కేసు వేసిందని భార్య మీద భర్త కోప్పడడు. విడాకులకు భర్త మీద లేనిపోని ఆరోపణలు చేయదు భార్య. ఇద్దరూ కోర్టుకు కలిసి వెళతారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ కనిపిస్తారు. ఫస్టాఫ్ చాలా స్లోగా ఉంటుంది. కానీ, ఎవరు చెప్పేది నిజం? ఇద్దరి మధ్య ఏం జరిగింది? అని కుతూహలం మాత్రం ఉంటుంది.


మాథ్యూ గే అని తెలిశాక, భర్త నుంచి భార్యకు సుఖం లేదని అర్థమైన తర్వాత ఆ పాత్ర మీద ప్రేక్షకులకు కోపం రాదు. జాలి కలుగుతుంది. భర్తను ఓమన అర్థం చేసుకున్న తీరుకు ఆమెకు సలాం చేయాలనిపిస్తుంది. 'ఈ ఒక్క రాత్రికి నాతో పడుకుంటారా' అని అడిగే సన్నివేశం కంటతడి పెట్టిస్తుంది. భార్యాభర్తల భావోద్వేగాలపై పెట్టిన దృష్టి భర్త స్నేహితుడి మీద పెట్టలేదు. అతని బాధను చూపించలేదు. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పారు. కానీ, నెమ్మదిగా ఎక్కువ సమయం తీసుకున్నారు. అందువల్ల, సాగదీసినట్లు ఉంది. సందేశం పేరుతో క్లాసులు పీకలేదు. ఆ విషయంలో మెచ్చుకోవాలి.


ఓమన పాత్రలో జ్యోతిక జీవించారు. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన మమ్ముట్టిని డామినేట్ చేసింది. కేవలం కళ్లతో నటించారు. మాథ్యూ పాత్ర చేసిన మమ్ముట్టిని మెచ్చుకోవాలి. అటువంటి క్యారెక్టర్ చేయడానికి గట్స్ కావాలి. 70 ఏళ్ళ వయసులో ప్రయోగాలు చేస్తున్న ఆయన నటుడిగా మరోసారి మెప్పించారు. మిగతా ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.


Also Read#90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ : ఈటీవీ విన్‌లో శివాజీ నటించిన వెబ్ సిరీస్


నాలుగు గోడల మధ్య భార్యాభర్తల మధ్య సంసార జీవితం ఎప్పుడూ రహస్యమే. మన దేశంలో బెడ్ రూమ్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి మెజారిటీ జనాలు ఇంట్రెస్ట్ చూపించరు. అదొక బూతు అన్నట్లు వ్యవహరిస్తారు. ఉద్దేశం మంచిది అయితే బూతు లేకుండా చెప్పవచ్చని 'కాథల్ ది కోర్' చెబుతుంది. సినిమాలో బూతులు  లేవు. అసభ్యకరమైన సన్నివేశాలు అసలే లేవు. 


భార్యను కొట్టడం, తిట్టడం మాత్రమే హింస కాదు. ఆమెకు అవసరమైన సుఖాన్ని భర్త ఇవ్వకపోవడం కూడా ఒక విధమైన హింస. సమాజం ఏమనుకుంటుందోనని తమ నిజస్వరూపం దాచి ఒకరిని పెళ్లి చేసుకోవడం తప్పని, అదే సమయంలో ఒకరి ఇష్టాఇష్టాలను గౌరవించాలని చెబుతుందీ 'కాథల్ ది కోర్'. గే / ఎల్‌జిబిటీ కమ్యూనిటీ నేపథ్యంలో ఇంత అర్థవంతమైన భావోద్వేగాలతో కూడిన సినిమా ఈ మధ్య కాలంలో రాలేదని చెప్పవచ్చు. స్లోగా ఉంటుంది. కానీ, తప్పకుండా ఎంగేజ్ చేస్తుంది. ఆలోచించేలా చేస్తుంది. డోంట్ మిస్ ఇట్.


Also Readబెర్లిన్ సిరీస్ రివ్యూ: ‘మనీ హెయిస్ట్’ను మించిపోయిందా? ఎలా ఉంది?