90s a middle class biopic review in Telugu: హీరో శివాజీ, 'తొలిప్రేమ' ఫేమ్ వాసుకీ ఆనంద్ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ '#90's'. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్... అనేది ఉపశీర్షిక. ఇది ఈటీవీ విన్ యాప్ ఒరిజినల్ సిరీస్. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ ఎలా ఉంది?
కథ: చంద్రశేఖర్ (శివాజీ)ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయన భార్య పేరు రాణి (వాసుకీ ఆనంద్ సాయి). ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి పేరు రఘు (మౌళి తనూజ్ ప్రశాంత్), అమ్మాయి దివ్య (వాసంతిక), చిన్నోడు ఆదిత్య (రోహన్ రాయ్). చంద్రశేఖర్ గవర్నమెంట్ స్కూల్‌లో లెక్కల మాస్టారు. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేస్తాడు. ఆదిత్య పూర్ స్టూడెంట్. రఘు, దివ్య బాగా చదువుతారు. పదో తరగతిలో రఘుకు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఆశిస్తారు. వచ్చిందా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: ఇప్పుడు పెద్దలతో పాటు పిల్లలదీ స్మార్ట్ లైఫ్. మన జీవితంలో ఫోన్ కూడా ఓ భాగమైంది. స్కూల్ బస్ టైమింగ్స్ నుంచి హోమ్ వర్క్ వరకు... గ్రీటింగ్ కార్డ్స్ నుంచి కమ్యూనికేషన్ వరకు... అన్నిటికీ ఫోన్ ఉంది. అందులో మెసేజ్ సెండ్ చేస్తున్నారు. కానీ, 90లలో జీవితం వేరు. అప్పటి జీవితాన్ని '90స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'లో ఆవిష్కరించారు దర్శక నిర్మాతలు.
'90స్' వెబ్ సిరీస్ ప్రారంభంలో ''మిడిల్ క్లాస్ లైఫ్‌లో పెద్ద కష్టాలు, కాన్‌ఫ్లిక్ట్స్ ఏం ఉండవు. బేసికల్లీ ఇది పెద్ద కథ ఏమీ కాదు. మన ఎక్స్‌పీరియన్స్, మెమరీస్ మాత్రమే'' అని డైలాగ్ వినబడుతుంది. అది నిజమే. ఈ కథలో పెద్దగా కష్టాలు, కాన్‌ఫ్లిక్ట్స్ ఏం లేవు. ఇదొక సింపుల్ స్టోరీ. కానీ, చాలా మిడిల్ క్లాస్ కుటుంబాల్లో జరిగిన స్టోరీ. మధ్య తరగతి కుటుంబాల్లో పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించే తల్లిదండ్రులు, నచ్చినవి చేయాలని ఆశపడే పిలల్లు, స్కూల్‌లో క్యూట్ & లిటిల్ లవ్ స్టోరీస్... '90స్'లో ఉన్నవి ఇవే. అయితే... వాటిని అందంగా తెరకెక్కించారు దర్శక నిర్మాతలు.
'90స్ - ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ'కి దర్శకుడు నవీన్ మేడారం ప్రజెంటర్. రాజశేఖర్ మేడారం నిర్మాత. మేడారం ఫ్యామిలీ ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. 90లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. ఆ పల్స్ బాగా పట్టుకున్నారు. ముందు చెప్పినట్టు పెద్దగా కథ ఏమీ లేదు. కానీ, క్యూట్ & లిటిల్ మూమెంట్స్ బావున్నాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. '90స్' నవ్విస్తుంది. మధ్యలో కంటతడి పెట్టిస్తుంది. తండ్రి చేతిలో తిన్న దెబ్బలు గుర్తు చేస్తుంది. అమ్మ కష్టాన్ని కళ్లకు చూపిస్తుంది. 90లలో పిల్లలు ఒక్కసారి తమ చిన్నతనంలో వెళ్ళేలా చేస్తుంది.
చంద్రశేఖర్ పాత్రలో శివాజీని తప్ప మరొకరిని ఊహించుకోలేం. అంత సహజంగా నటించారు. ఇంటికి డీఈవో వచ్చినప్పుడు వైట్ షర్ట్ వేసుకుని వచ్చే సన్నివేశం ఆయనలోని నటుడిని మరోసారి గుర్తు చేస్తుంది. కరాటే నేర్చుకోమని అమ్మాయికి చెప్పడం, అంతకు ముందు అమ్మాయి పెద్దమనిషి అయినప్పుడు భార్యతో 'భయమేస్తుంది' అని చెప్పే సన్నివేశాల్లోనూ శివాజీని చూస్తుంటే... మిడిల్ క్లాస్ తండ్రులందరికీ ప్రతినిధిగా కనిపిస్తారు.
Also Read: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే
మధ్య తరగతి గృహిణి రాణిగా వాసుకీ ఆనంద్ సాయిని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. భర్తతో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంట్లో పరిస్థితి గురించి చెప్పే సన్నివేశంలో ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. వాసుకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్‌లో ఎప్పటికీ గుర్తుంచుకునే పాత్ర ఇది. ఈ సిరీస్ చూశాక ఆమెను దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్లు రాయవచ్చని దర్శక రచయితలు తప్పకుండా అనుకుంటారు.
రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. అతను చక్కగా చేశారు. 90 కిడ్స్ రఘు పాత్రలో, మౌళి నటనలో తమను తాము చూసుకుంటారు. వాసంతి, స్నేహాల్ కామత్ అందంగా నటించారు. చిన్నోడు రోహన్ అయితే పక్కా నవ్విస్తాడు. లాస్ట్ ఎపిసోడ్‌లో 'నీది నాదీ ఒకే కథ', 'విరాట పర్వం' చిత్రాల దర్శకుడు వేణు ఊడుగుల అతిథి పాత్రలో కనిపించారు.
Also Read: పెళ్లికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?
అమ్మ ఉప్మా చేసిందని విసుక్కోవడం, మార్కులు తక్కువ వచ్చినప్పుడు నాన్న కొడతారని - తిడతారని భయం, క్లాస్‌లో నచ్చిన అమ్మాయి / అబ్బాయి మనల్ని చూస్తారో లేదోనని చిన్న సందేహం, చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కునే మధ్య తరగతి కుటుంబం... వీక్షకులకు '90స్' మంచి అనుభూతి ఇస్తుంది. ఉప్మా చాలా మంది నచ్చదు. కానీ, అమ్మ చేస్తే మాత్రం వదలకుండా తినేస్తాం. ఆ చేతిలో మేజిక్ అటువంటిది. '90స్' కూడా అంతే! అమ్మ చేతి ఉప్మా అంత రుచిగా ఉంటుందీ సిరీస్. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు.
Also Read: తండ్రికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి పిల్లను పడేశాడు - ఆమిర్ ఖాన్ అల్లుడి బ్యాగ్రౌండ్ తెలుసా?